గుత్తాకు మరో ఎదురు దెబ్బ.. ఆయన ఖేల్ ఖతమేనా?
posted on Oct 1, 2021 @ 6:34PM
తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ మొదలు, తెరాస వరకు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించారు. నల్గొండ లోక్ సభ నియోజక వర్గం నుంచి 2004లో టీడీపీ టికెట్ పైన, 2009 కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి, రెండు సార్లూ గెలిచారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరారు. 2018 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీనియారిటీ గుర్తించారు. గుత్తాను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.ఆవెంటనే కొద్ది రోజులకే (2019 సెప్టెంబరు 11న) శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2021, జూన్ 3న ముగిసింది. నిజానికి, ఈ పాటికి ఎప్పుడోనే ఆయన మళ్ళీ ఎన్నిక కావలసింది. కానీ, కొవిడ్ కారణంగా మండలి ఎన్నికలు వాయిదా పడడంతో గుత్తా ప్రస్తుతానికి ఏమీ కాకుండా, ఏమీలేకుండా, మాజీగానే మిగిలి పోయారు. అడపా తడపా కేంద్ర ప్రభిత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని, పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నాయకులకు విమర్శించి, వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
గుత్తాకు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడిందని అంటున్నారు. నల్గొండ-రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో పాడిరైతుల సమాఖ్య డైరీ ప్రభావం చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. జిల్లా రాజకీయ నాయకులు డైరీ సమాఖ్య తొలి రాజకీయ అడుగుగా భావిస్తారు. ప్రతి గ్రామంలో డైరీ సమాఖ్య సభ్యులు ఉంటారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి డైరీ సమాఖ్యతో విడదీయరాని బంధమే ఉందని అంటారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా, ఏ పార్టీలో ఉన్నా డైరీ అధ్యక్ష పదవి మాత్రం ఇప్పటి వరకు గుత్తా గుప్పిట్లోనే ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డే సుదీర్ఘ కాలంగా డైరీ చైర్మన్ గా చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు, జిల్లామంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా మంత్రి ఆశలను మొగ్గలోనే తుంచేశారు డైరీ చైర్మన్ పదవి గుత్తా జితేందర్ రెడ్డికి కాకుండా గంగుల కృష్ణారెడ్డికి దక్కేలా చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఇదంతా జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.
నిజానికి మంత్రి పదవి ఆశ చూపితేనే గుత్తా తెరాసలో చేరారు. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే, మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్సీ పదవి అయినా రెన్యువల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్త పరిచినట్లు సామాచారం. ఈనేపధ్యంలో ఆయన మరో మారుపార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సారి ఏ గూటికి చేరతారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు...ఇంతవరకు గుత్తా పద్మ మోపని పార్టీ అయితే ఒకటే ఉంది .. అది బీజేపీ. కానీ, జిల్లా రాజకీయ లెక్కలు బీజేపీ కంటే, కాంగ్రెస్ పార్టీనే సేఫ్ అని చెపుతున్నాయి. అయితే అదయినా, ఇదయినా ఎమ్మెల్సీ ఇష్యూ అటో ఇటో తేలిన తర్వాతనే ... అంతవరకు గప్ చిప్... అంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులు.