ఆ నలుగురికీ మరింత భద్రత.. అంటే, మరింత రెచ్చిపొమ్మనేనా?
posted on Nov 24, 2021 @ 2:02PM
తిట్టిందీ వారే. నోటికొచ్చినట్టు వాగిందీ వారే. అసభ్య పదజాలం వాడిందీ వారే. అవమానించిందీ వారే. అవహేళన చేసిందీ వారే. చంద్రబాబును వెక్కి వెక్కి ఏడ్చేలా చేసిందీ వారే. ఉక్కుమనిషి గుండెకు లోతైన గాయం చేసిందీ వారే. ఇంతా చేసి.. అంతగా రచ్చ చేసి.. ఇప్పుడు వారే బాధితులన్నట్టు చేశారు. ఏడిపించిన వారిపైనే సింపతీ చూపిస్తున్నారు. ఆ నలుగురికి భద్రత మరింత పెంచారు. ఎందుకు? మరింత సెక్యూరిటీ కల్పిస్తాం.. మీరు చంద్రబాబుపై మరింత రెచ్చిపోండని ఎంకరేజ్ చేసేందుకా? అంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రతిపక్షం, ప్రజలు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబంపై.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఆవేదనా వ్యక్తం అయింది. ఇదే అదునుగా.. ఆ వ్యతిరేకతను సాకుగా చూపిస్తూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబుపై వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఆ నలుగురికి బెదిరింపులు వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమీక్షించి.. వారికి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తెలిపింది.
మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లకు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత కల్పించింది ప్రభుత్వం. నాని కాన్వాయ్‌లో అదనంగా మరో సెక్యూరిటీ వెహికిల్ కూడా కల్పించింది. ఇకపై కొడాలి నానికి 7+7 భద్రత ఉండనుంది. మరోవైపు.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్‌లతో పాటు అదనంగా 3+3 గన్‌మెన్ భద్రతను ఇచ్చింది. ఇకపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు 4+4 భద్రత ఉండనుంది.
ప్రతిపక్ష నేతపై లేనిపోని నీలాపనిందలు వేసిన వారిని మామూలుగా అయితే క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. కేసులు పెట్టి విచారణ జరపాలి. చట్టం ముందు నిలబెట్టాలి. కానీ, అధికారం వారి చేతిలోనే ఉంది కాబట్టి.. దాన్ని ఇలా వాడేసుకుంటున్నారు. చెత్త ఆరోపణలు కూసిన ఆ నలుగురికి మరింత సెక్యూరిటీ కల్పించి.. జగనన్న పాలనంటే ఇలానే ఉంటుందని మరోసారి నిరూపించారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టు ఉంది జగన్‌రెడ్డి ప్రభుత్వ తీరు..అంటున్నారు.