కొండపల్లి ఖిల్లాపై టీడీపీ జెండా.. జగన్ కు దిమ్మతిరిగే షాక్
posted on Nov 24, 2021 @ 10:51AM
అధికార పార్టీ కుట్రలు చిత్తయ్యాయి. వైసీపీ నేతల దౌర్జన్యాలు ఫలించలేదు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీపై తెలుగు దేశం పార్టీ జెండా ఎగిరింది. హైకోర్టు ఆదేశాలతో అత్యంత భద్రత మధ్య సాగిన చైర్మెన్ ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థికి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీకౌన్సిలర్ చిట్టిబాబు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. ఎన్నికల్లో టీడీపీ 14 వార్డులు, వైసీపీ 14 వార్డులు గెలవగా... 14 వార్డులో స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు పెరగగా.. వైసీపీ బలం 14గా ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గంలో ఉంది. దీంతో మైలవరం వైసీపీ ఎమ్మెల్యేకు ఎక్స్ అఫిషియో ఓటు ఉంది. దీంతో వైసీపీ బలం కూడా 15కు చేరింది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని ఎక్స్ అఫీషియోగా కొండపల్లిలో నమోదు చేసుకోవడంతో వైసీపీకి షాక్ తగిలింది. కేశినేని ఓటుతో టీడీపీ బలం 16కు పెరగగా.. వైసీపీకి 15 మంది సభ్యులే ఉన్నారు. అందుకే ఓడిపోతామనే భయంతో వైసీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. సోమవారం, మంగళవారం ఎన్నిక జరగాల్సి ఉండగా... వైసీపీ సభ్యుల విధ్వంసంతో జరగలేదు. చివరికి ఎన్నికల అధికారి చైర్మెన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి పంపించారు.
అయితే చైర్మెన్ ఎన్నికను కావాలనే అడ్డుకుంటున్నారంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బుధవారం చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఆదేశించింది. ఫలితాన్ని మాత్రం ప్రకటించవద్దని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని విజయవాడ సీపీని ఆదేశించింది హైకోర్టు. దీంతో అత్యంత భారీ భద్రత మధ్య కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.
భారీ భద్రత నడుమ ఎంపీ కేశినేని నాని సహా వార్డు సభ్యులను పోలీసులు కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమని సైతం వార్డు సభ్యులు బస్సులో వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొండపల్లిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. వార్డు సభ్యుల బస్సులో వస్తున్న మీడియా సిబ్బందిని కూడా మార్గమధ్యలోనే దించివేశారు. కొండపల్లిలో స్థానికులకు కూడా పోలీసుల ఆంక్షలు తప్పని పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆంక్షలు వర్తించలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.