జగన్ ఉపసంహరణ వెనక పీకే వ్యూహం?
posted on Nov 24, 2021 @ 3:46PM
మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉప సంహరించుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే చర్చ జోరుజి సాగుతోంది. ఇటు రాజకీయ మీడియా వర్గాల్లో, అటు మేథావి, న్యాయనిపుణులు, న్యాయవాదులలో ఇదే విషయంపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చలలో విభిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ఉపసంహరణ నిర్ణయంలో రాజధాని సమస్య జటిలమవుతుంది అనే విషయంలో ఇంచుమించుగా ఏకాభిప్రాయమే వినవస్తోంది. సమీప భవిష్యత్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదన్నవాదన బలంగా వినిపిస్తోంది.
నిజానికి, మూడు రాజధానుల చట్టం, ఉప సహరణ ప్రకటనతో, ముఖ్యమంత్రి రాజధాని కథను మళ్ళీ మొదటికి తెచ్చారు. మరింత జటిలం చేశారు. అయోమయం, గందరగోళం సృష్టించారు. రాష్ట్రన్ని మరింత నవ్వులపాలు చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజధాని కలను కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టేశారు., ఈ ‘ఉత్తుత్తి’ ఉపసంహరణతో ఏపీ నిర్దిష్ట రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిలి పోతుంది ... మీడియా చర్చల్లో,సోషల్ మీడియా ఇలా ఎవరికి వారు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.అలాగే, సమీప భవిష్యత్’లో రాజధాని కల సాకారం అయ్యే అవకాశమే లేదని న్యాయనిపుణులు అంటున్నారు. పాత కొత్త చిక్కుముళ్ళన్నీ విప్పుకుని రాజధాని, (అది ఎక్కడైనా కానీ,) మళ్ళీ ముడి పడి పట్టాల మీదకు రావడం ఇప్పట్లో కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న, ఉప సంహరణ నిర్ణయం ఉద్దేశం ఉప సంహరణ కాదు. ఇదొక ఎత్తుగడ. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన కుట్ర పూరిత ఎత్తుగడగానే చూడవలసి ఉంటుదని ఇటు ప్రతిపక్షాలు, అటు న్యాయ, రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. వివాద చట్టాల మీద కోర్టులో దాఖలైన కేసుల విచారణ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంల తీసుకున్న,ఇలాంటి నిర్ణయం కుట్రపూరిత నేరంగా భావించినా తప్పు లేదని న్యాయపోరాటంలో ప్రత్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఉపసంహరణ నిర్ణయం పై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే’ విధించే అవకాశంతో పాటుగా, విస్తృత ధర్మాసనానికి నివేదించే అవకాశాలను కూడా కొట్టి వేయలేమని అంటున్నారు.
నిజానికి జగన్ రెడ్డి కూడా అదే కోరుకుంటున్నారా, మూడు రాజధానుల వివాదంతో ముడిపడిన వికేంద్రీకరణ, ‘మహా మత్రం’ తోనే 2024 ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారా? అందుకేనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారా? వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా జనంలోకి తీసుకువెళ్లేందుకే, తేనే తుట్టెను కదిల్చారా? అందుకే రద్దు బిల్లు సభలో ప్రవేశ పెట్టిన సమయంలో చేసిన ప్రకటనలో రాజకీయ మంత్రాలను జోడించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంత్రి సభలో చేసిన ప్రకటనలో “వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానుల బిల్లు లోని ప్రభుత్వ సదుద్దేశాలను విపులంగా వివరించేందుకు, అన్ని ప్రాంతాల ప్రజలకు విస్తృతంగా వివరించేందుకు, ఇంతకు ముందు తెచ్చిన చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందిని, ఈ అన్నిటితో కొత్త బిల్లును తీసుకొస్తుందని, చెప్పు కొచ్చారు. అంటే, ఎన్నికలకు ముందుగానే మూడు రాజధానులకు అన్నిప్రాంతాల ప్రజల ఆమోదం పొందేందుకు, మరో మారు జనంలోకి వెళ్ళే ఆలోచన ముఖ్య మంత్రి చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే, అందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ సలహా మేరకు ముఖ్యమంత్రి మరో ప్రజాయాత్రకు సిద్దమవుతున్నారంటూ వస్తున్న వార్తలు సమాధానంగా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వివాదాన్ని ఎన్నికల అంశం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి,మొదటి నుంచి మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టే చూస్తున్నారు. ప్రస్తుత సందర్భంలో మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం, అంటూ 2019లో ఎన్నికలలో కూడా తమ పార్టీది అదే స్టాండ్ అని పచ్చి అబద్ధాన్ని పబ్లిక్’గా అది కూడా శాసన సభలో చెప్పారు. 2019 ఎన్నికల్లోనే మూడు రాజధానులకు ప్రజలు ఆమోద ముద్ర వేశారని ముఖ్యమంత్రి హౌస్’లో అబద్ధం చెప్పారు. సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా బ్రీచ్ అఫ్ ప్రివిలేజ్’ కు పాల్పడ్డారు.
2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, జగన్ రెడ్డి అమరావతికి జై కొట్టారనేది జగమెరిగిన సత్యం. అసలు అప్పటికి మూడు రాజధానుల ముచ్చట ఎక్కడా రాలేదు. జగన్ రెడ్డి సహ ఎవరూ ప్రస్తావించ లేదు. శాసనసభలో కూడా ప్రతిపక్ష నేత హోదాలో జగన్ రెడ్డి అమరావతికి మద్దతిస్తున్నామని చెప్పారు. 33వేల ఎకరాలు చాలవని.. ఇంకా భూసేకరణ చేయాలంటూ అమరావతికి అనుకూలంగా మాట్లడారు. ఇది అసెంబ్లీ రికార్డుల సాక్షిగా నిజం. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధాని అని కుండ బద్దలు కొట్టారు. ఈ నేపధ్యంలో అసలు సమస్యలు అన్నీ పక్కకు పోయి ... మూడు రాజధానులు, వికేంద్రీకరణ ప్రధాన ఎన్నికల అస్త్రంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, అనేది ఇప్పుడు తెరపైకొచ్చిన తాజా ప్రశ్న. ఇందుకు సంబందించి, ప్రశాంత్ కిశోర్ బృందం ఇప్పటికే సర్వే కూడా చేసిందని, అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి మూడు రాజదానుల చట్టం ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.