వర్క్ ఫ్రమ్ హోం సీఎం జగన్.. విపక్షాల విమర్శలకు వైసీపీ బదులేది?
posted on Nov 24, 2021 @ 10:45AM
కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాపులర్ అయింది. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మెజార్టీ సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం చేయించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్ కంట్రోల్ లోనే ఉన్నా... ఇంకా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఏపీకి సంబంధించి రాజకీయంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాక రాజేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి అంటూ విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ పై జనాల్లోకి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయినా సీఎం మాత్రం బయటికి రాలేదనే విమర్శలు వస్తున్నాయి. తన సొంత జిల్లా కడపలోనూ దుర్బర పరిస్థితులు ఉన్నా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు.
అసెంబ్లీలో తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలం వాడారంటూ ప్రెస్ మీట్ లో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు కూడా రెండు రోజుల్లో తేరుకుని జనంలోకి వెళ్లారు. కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వాళ్లకు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. తీవ్రమైన బాధలో ఉన్నా చంద్రబాబు ప్రజల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం గాల్లో చక్కలు కొట్టి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు జనాల నుంచి వస్తున్నాయి. తాజాగా జగన్ ను టార్గెట్ చేస్తూ జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో వరదల కారణంగా ముఖ్యమంత్రి జగన్ను వర్క్ ఫ్రం హోమ్ సీఎంగా విమర్శిస్తూ జనసేన తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీసం పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కదలని ముఖ్యమంత్రి అంటే జగనే అని.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ సీఎం అని నాదెండ్ల విమర్శించారు. ప్రజలు వరదతో కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం గాల్లో హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం పరిపాలన దక్షత లేని నాయకుడిగా జగన్ తయారయ్యారని నాదెండ్ల విమర్శించారు . ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
సీఎం జగన్ తీరుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతల నుంచి కౌంటర్లు రావడం లేదు. జగన్ తీరుపై వైసీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని, అందుకు వాళ్లు కూడా స్పందించడం లేదని అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్ వెళ్లకపోవడంతో తమపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని వైసీపీ నేతలు ఓపెన్ గానే అంగీకరిస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు జనాలను ఓదారుస్తుంటే.. జగన్ రెడ్డి ప్యాలెస్ లో ఉండటం సరికాదని చెబుతున్నారు. మొత్తంగా వర్క్ ఫ్రమ్ హోం ముఖ్యమంత్రి జగన్ అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతుండటం ఆసక్తిగా మారింది.