సరిహద్దులు దాటిన జగన్ ‘అప్పుల’ ఖ్యాతి
posted on Nov 24, 2021 @ 1:11PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. ఇంకే ప్రభుత్వానికి లేదు. ఇప్పుడా ఖ్యాతి దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అవును,ఏపీ గడచిన రెండున్నర సంవత్సరాలలో అందినకాడికి అన్ని సోర్సెస్ నుంచి అప్పులు చేసింది. దేశంలో ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని ఉపయోగించుకుంది. కేంద్ర ప్రభుత్వం గీసిన అప్పు గీత (ఎఫ్ఆర్బీఎం) దాటేసింది. ఇతరత్రా అప్పు పుట్టే ఆన్ని సోర్సెస్’ను చుట్టేసింది. ఇక దేశంలో పైసా అప్పు పుట్టే దారిలేక కావచ్చు, ఏకంగా ప్రపంచ బ్యాక్ నుంచి ఒకే సారి, ఓ 50 వేల కోట్ల రూపాయల అప్పుతెచ్చుకునే ‘చక్కటి’ ఆలోచన చేసినట్లు సమాచరం.ఇలా ఒకే సారి ఒకరి దగ్గరే ఏక మొత్తంగా అప్పు తెచ్చుకుంటే, ప్రతి పూటా వాళ్ళదగ్గర వీళ్ళ దగ్గరా చేయి చాచవలసిన అవసరం ఉండదు. ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ,అక్కడ అప్పు తెచ్చి ఇక్కడా సర్డుబాటు చేసే చికాకులు తప్పుతాయని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తలకాయలు ‘బ్రెయిన్’ పెట్టి అలోచించి ప్రపంచ బ్యాంకు అప్పుకోసం అప్లై చేసినట్లు అక్కడా ఇక్కడా వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదన ప్రపంచబ్యాంకు పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది.
అదే గనుక నిజం అయితే, ఏపీ ప్రభుత్వం ‘అప్పు కీర్తి’ అంతర్జాతీయ స్థాయికి చేరిందని అనుకోవచ్చును. అయితే అప్పు చేయడం తప్పు కాదు. అలాగే, ప్రపంచ బ్యాంకు వద్ద అప్పుచేయడం తప్పని ఎవరూ అనరు, నిజానికి, ప్రపంచ బ్యాంకు విధానాలను వ్యతిరేకించే, వామపక్ష ప్రభుత్వాలు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకున్నాయి. అయితే, ప్రపంచ బ్యాంకు సహజంగా, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇస్తుందని అంటారు. వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అభివృద్ది, ప్రాజెక్టులు అట్టడుగున ఉంటే ఉంటాయి,లేదంటే అట్టడుగునా లేకపోవచ్చును. పంపకాలే వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలో పర్ధం పంక్తిలో ఉంటాయి. సో ..వైసీపీ ప్రభుత్వ పంపకాల పథకాలకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తుందా అనేది అనుమానం అంటున్నారు. అందుకే ప్రభుత్వం.‘రాజధాని నగరాభివృద్ధి’ పేరిట ఈ రుణ ప్రతిపాదనను పంపిందని అంటున్నారు.
నిజానికి గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అప్పు కావాలని ప్రపంచ బ్యాంకును అభ్యర్ధించింది. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, అడ్డుపుల్లలు వేసింది.అయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు తెలిసిన ప్రపంచ బ్యాంకు ఋణం మంజురుకు సుముఖత వ్యక్తపరిచింది. అయితే, ఇతరేతర కారణాల వలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేదు అనుకోండి. అది వేరే విషయం
అదలా ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు వద్ద ఋణం తీసుకోవడాన్ని వ్యతిరేలించిన వైసీపీ, అధికారంలోకి వచ్చి, అప్పు దారులు అన్నీ మూసుకుపోయిన నేపధ్యంలో అదే ప్రపంచ బ్యాంకు నుంచి, అదే రాజధాని అభివృద్ధి’ కోసం రూ.50వేల కోట్లు రుణం కోరడం గమనార్హం. రాజధానే లేని, పోనీ ఖరారు కానీ రాష్ట్రంలో ఏ రాజధాని అభివృద్ధి కోసం ఈ అప్పు ఖర్చు చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటున్నారు పరిశీలకులు. గత తెలుగు దేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అమరావతిని రాష్ట్ర రాజధానిగా గెజెట్’లో ప్రకటించి కొంత వరకు నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు, ప్రభుత్వం మూడు రాజధానుల మత్తులో అమరావతి రాజధాని కాదంటున్నా, ప్రభుత్వ కార్యకలపాలన్నీ అక్కడి నుంచే సాగుతున్నాయి. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడు రాజధానులు ముచ్చటను పైకి తెచ్చింది. అది వివాదంగా మార్చింది. అయితే మూడు రోజుల క్రితం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకుని కొత్త వివాదానికి తెరసింది. అదే సమయంలో ‘క్యాపిటల్ డెవల్‌పమెంట్’ పేరుతో ప్రపంచ బ్యాంకు రుణంకోసం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచబ్యాంకుకు చెప్పిన ‘క్యాపిటల్’ ఏది? అది... అమరావతేనా? లేక... పరిపాలనా రాజధానిగా చెబుతున్న విశాఖ నగరమా? అదీ కాకపోతే... న్యాయరాజధాని కర్నూలు నగరమా? దీనిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఆదలా ఉంటే ఆర్థిక క్రమ శిక్షణను అటకెక్కించి,నిధులను దారి మళ్ళించడంలో తప్పుడు లెక్కలు చూపడంలో సంపూర్ణ ప్రావీణ్యతను సంపాదించింది అంటారు. కేంద్ర నిధులు, ఇంతవరకు చేసిన అనేక వందల వేల కోట్ల రుణాలను దారి మళ్లించిన విధంగానే, ఈ ఆప్పును పక్కదారి పాటిస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
నిజానికి ఇప్పటికే ప్రపంచబ్యాంకు రాష్ట్రంలో విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను వైసీపీ పభుత్వం పందారాలకు పక్కదారి పట్టించింది. దీనిపై ప్రపంచబ్యాంకు సీరియ్‌సగా స్పందించి నేరుగా కేంద్రంతోనే తేల్చుకుంటామంటూ లేఖ రాసినట్లు అధికార వర్గాల సమాచారం. అలాగే, ఏఐఐబీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించింది. దీంతో ఏఐఐబీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి వాయిదా చెల్లింపులను ఆపేసింది. కేంద్ర కార్మిక శాఖ ఈఎ్‌సఐ ఆస్పత్రుల కోసం ఇచ్చిన నిధులను కూడా జగన్ సర్కార్ దారి మళ్లించింది. దీనిపై కేంద్ర కార్మిక శాఖ... “రాష్ట్రంలో ఈఎ్‌సఐను నేరుగా మేమే నిర్వహించాలనుకుంటున్నాం మీ స్పందన చెప్పండి’’ అని లేఖ రాసింది. రోడ్డు అభివృద్ధి పేరిట విధించిన సెస్‌లు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులతో సహా మరెన్నో శాఖలు, విభాగాల నిధులను వైసేపీ సర్కారు వాడేసుకుంది. ఇవేవీ చాలదన్నట్లు వేలకోట్ల అప్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెచ్చి... ఏం చేస్తారు? అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారా? లేక... వాటినీ అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? అనేదే ప్రస్తుత మిలియన్ డాలర్ల అప్పంత పెద్ద సందేహం.అంటున్నారు.