ఉత్త మాటలేనా.. పోరాటం లేదా! ఢిల్లీలో కేసీఆర్ హ్యాండ్సప్..
posted on Nov 24, 2021 @ 3:35PM
అంతన్నారు.. ఇంతన్నారు.. తాడేపేడో తేల్చుకుంటానన్నారు.. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానన్నారు... తెలంగాణ ఉద్యమ గర్జన చూపిస్తానంటూ ఢిల్లీ ఫ్లైటెక్కారు.. సీన్ కట్ చేస్తే నాలుగు రోజులు మకాం వేసి.. ఎవరినీ కలవకుండానే ఉత్త చేపులతో ఊపుకుంటా తిరిగి హైదరాబాద్ ఫ్లైటెక్కేశారు.. ఇంతకూ ఆయన హస్తన వెళ్లిందేందుకు.. పోరాటం ఎక్కడ పోయింది..నాలుగు రోజులు సైలెంటుగాన్ ఎందుకు ఉన్నట్లు.. ఇదో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
ఇంతవరకు పైన చెప్పిదంతా ఎవరి గురించో అర్ధమైందంనుకుంటాను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, జల వివాదం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీతో తాడో పేడో తెల్చుకుంటానంటూ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్. తనతో కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలను తీసుకెళ్లారు. కాని ఢిల్లీ పర్యటనలో నాలుగు రోజులూ ఇంట్లోనే ఉన్నారు కేసీఆర్. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి .. బుధవారం తిరిగి బయలుదేరే వరకు ఢిల్లిలోని తన నివాసమైన 23 తుగ్లక్ రోడ్ లోనే ఉన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న కేసీఆర్ ఎవరినీ కలవలేదు.
మంగెళవారం సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్ తో కేవలం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. అయితే తెలంగాణ బృందానికి కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. అయినా కేసీఆర్ కేంద్ర మంత్రితో సమావేశం కాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం లేదు. బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీని కలిశారు. మంగళవారం మోడీ అపాయింట్ మెంట్ కోరడంతో పీఎంవో ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చింది. కానీ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఎందుకు రాలేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
రాష్ట్రంలో పండిన మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేయలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునళ్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రాజెక్టులకు పర్మిషన్ పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఢిల్లీకి వెళ్తున్నానని కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అంశాల్లో ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. షెకావత్ జోధ్‌పూర్‌లో ఉండటంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు. ప్రధాని ఢిల్లీలోనే ఉన్నా కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది తేలడం లేదు.
అయితే ప్రధాని మోడీని కేసీఆర్ కలవకపోవడంపై మరో చర్చ కూడా సాగుతోంది. అసలు కేసీఆర్ మోడీ అపాయింట్ మెంట్ అడగలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక ఢిల్లిలోని ఎయిమ్స్ లో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు తప్ప.. రాష్ట్ర సమస్యలపై కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానని వెళ్లిన కేసీఆర్.. ఎవరినీ కలవకుండా తిరిగి రావడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులపై కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గొప్ప గొపప్ ప్రకటనలు చేశారని మండిపడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని,యాసంగిలో వరి ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జగన్ ఉపసంహరణ వెనక పీకే వ్యూహం?