వామ్మో.. ఇంత తాగేశారా? తగ్గేదే లే...

కొత్త సంవత్సరాదికి తెలుగు రాష్ట్రాల ప్రజలు గ్రాండ్ వెల్ కం చెప్పారు. మందుబాబుల హడావుడి అయితే ఓ రేంజ్ లో కనిపించింది. ఫుల్లుగా తాగేశారు. న్యూ ఇయర్ కు స్వాగతం పలికే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే తెలంగాణ, ఏపీ ఎక్సైజ్ శాఖలకు భారీ ఆదాయం వచ్చిపడింది. డిసెంబరు 31న తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.  తెలంగాణ వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్‌, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్‌ రూ.23.13 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.  మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో మద్యం అమ్మకాలు రూ.3459 కోట్లు జరిగాయి. ఇందులో 40.48 కేసుల లిక్కర్‌, 34 లక్షల కేసులకుపైగా బీర్ల అమ్మకాలు ఉన్నాయి. మొత్తంగా 2021లో రూ.30,222 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి.  ఏపీలోనూ ఇదే తీరు కనిపించింది. మద్యం ప్రియులు  1.36 లక్షల కేసు లిక్కర్, 53 వేల కేసులు బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకాని ఉంచడంతో ఏపీలో మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడం కూడా కలిసొచ్చింది. డిసెంబర్‌ 30, 31 తేదీల్లో మొత్తం రూ.215 కోట్ల మద్యం విక్రయం జరిగింది. రోజువారీగా రూ.70- 75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగగా... న్యూ ఇయర్‌ సందర్భంగా రూ.50 కోట్ల మేర అదనంగా అమ్మకాలు సాగాయి. 

షణ్ముక్- దీప్తి సునయన లవ్ బ్రేకప్.. యూట్యూబ్ స్టార్స్ భావోద్వేగ పోస్టులు 

అనుమానించినట్లే జరిగింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ జంట విడిపోయింది. కొత్త సంవత్సం రోజునే ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా బ్రేకప్ ప్రకటించారు. తామిద్దరం విడిపోతున్నామంటూ వేరు వేరుగా ఎమోషనల్ పోస్టులు పెట్టారు.  సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ తోపాటు కవర్ సాంగ్స్ లోనూ మెరిశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు లవ్ లో ఉన్న విషయం కూడా అందరిలో తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని తేలిపోయింది. షణ్ముఖ్ జశ్వంత్ తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి. దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. నిర్ణయాలు తీసుకునే హక్కు దీప్తికి ఉందని. మా దారులు వేరని తెలిసిందని.. ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు షణ్ముఖ్. నాకు తాను హ్యాపీగా ఉండటమే కావలి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో నీ సపోర్ట్ తో చాలా నేర్చుకున్నాను.. మంచి వ్యక్తిగా ఎదిగాను.. అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు షణ్ముఖ్.  ముందుగా దీప్తి సునయన ఇన్ స్టాలో బ్రేకప్ గురించి పోస్ట్ చేసింది. “నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులభంగా మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన. బిగ్‏బాస్ షోలోకి రాకముందే షణ్ముఖ్ దీప్తి ప్రేమలో ఉన్నారు. కానీ బిగ్‏బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. బిగ్‏బాస్ జర్నీలో వీరిద్దరి శ్రుతిమించిన ప్రవర్తన, హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి హగ్గులు తగ్గించండి అని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలాగే ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ చెప్పడంతో వీరిద్దరిపై మరింత నెగిటివిటి పెరిగింది. ఇవే కాకుండా.. ప్రతిసారి సిరిని షణ్ముఖ్ కంట్రోల్ చేయడం.. ఆమె ఎవరితో మాట్లాడిన సహించలేకపోవడం.. చూపులతోనే సిరిని కంట్రోల్ చేయడం వంటివి షణ్ముఖ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. దీంతో టైటిల్ రేసులో ముందంజలో ఉన్న షణ్ముఖ్ చివరిగా రన్నరప్ గా మిగిలాడు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం.. షణ్ముఖ్, దీప్తి విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై షణ్ముఖ్ స్పందిస్తూ… ప్రస్తుతం దీప్తి తనపై అలిగి బ్లాక్ చేసిందని.. త్వరలోనే హైదారాబాద్ వెళ్లి కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. 

సార్లు కావాలి సార్.. ఏపీలో రోడ్డెక్కిన విద్యార్ధులు 

వైసీపీ ప్రభుత్వం సర్కారీ స్కూల్స్’కు రంగులు బానే అద్దింది .. నాడు నేడు’ అనీ ఇంకొకటని  మేకప్పులు చేసింది. అలాగే, ప్రాధమిక స్థాయినుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి తెలుగు పిల్లలు తెలుగు మరిచి పోయి ఇంగ్లీష్’లో  మాట్లాడేలా చేస్తామని ఆశలు రేపింది. పిల్లలలను చదివించే తల్లులకు సంవత్సరానికి పిల్లాడికి రూ.15000 వంతున ఇచ్చే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది. సరే, ఆ పథకం ఎంత సుందర ముదనష్టంగా అమలవుతోంది చెప్పనే అక్కర లేదు. అది వేరే విషయం. అదలా ఉంటే, ఇప్పుడు సర్కారీ బడుల్లో చదువుతున్న పిల్లలు, పంతుళ్ళు కావాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలుచేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ‘టీచర్లను నియమించండి, క్లాసులు నిర్వహించండి’ అని తల్లి తండ్రులు ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నారు. సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఆ స్థాయికి చేరింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది అయినా ఇంత వరకు సింగిల్ టీచర్ నియామకం కూడా జరగలేదు. 2018 లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీనే చివరి డీఎస్సీ.ఆ తర్వాత ఈ రెండున్నర మూడేళ్ళ కాలంలో డీఎస్సీ లేదు. ఉపాధ్యాయ నియామకాలు లేవు. పదవీ విరమణలే గానీ.. కొత్త నియామకాలు జరగనే  లేదు. అనేక చోట్ల ఒకే ఒక్క ఉపాధ్యాయుడు నాలుగైదు తరగతులను నెట్టుకొస్తున్నారు. అంతే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం, దేశంలోనే ‘డిస్టిక్షన్’ కూడా సాధించింది. దేశం మొత్తం మీద ‘సింగిల్ టీచర్’ స్కూల్స్  ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్‌ ప్రదేశ్‌  తర్వాత ఏపీ సెకండ్ ప్లేస్’లో ఉంది.  రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ని మొత్తం స్కూల్స్’లో 18.94 శాతం ‘సింగిల్ టీచర్’ స్కూల్స్ ఉన్నాయి. ఇండి జాతీయ సగటు(6.80%)  కంటే మూడు రెట్లు ఎక్కువ. అరుణాచల్‌ప్రదేశ్‌ (21.85 శాతం) తర్వాత అత్యధిక ‘సింగిల్ టీచర్’ స్కూల్స్ ఉన్న స్టేట్ ఏపీ. నూతన విద్యా విధానం ప్రకారం 250 మీటర్ల దూరంలోని 2,663 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వీటిలో సగానికిపైగా ఏకోపాధ్యాయ బడులే. దీంతో ఇక్కడి నుంచి పిల్లలే తప్ప ఉపాధ్యాయులు రావడం లేదు. ఫలితంగా హైస్కూళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి, వైసీపీ ప్రభుత్వం గడచిన రెండున్నర సంవత్సరాలలో అన్నివ్యవస్థలను ఒకలానే చూసింది అన్ని వ్యవస్థలను సమానంగానే నాశనం చేసింది. అందుకు విద్యావ్యవస్థ మినహాయింపు కాదు. అందుకే, ప్రాధమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన విధానం మొదలు అమ్మఒడి వరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, అనాలోచిత నిర్ణయమే అంటున్నారు విద్యారంగ నిపుణులు. ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఉపాధాయులు లేక ఇంగ్లీష్ మీడియం విధ్యార్ధులను తెలుగు మీడియం విధ్యార్ధులతో కలిపేశారు. దీంతో విద్యార్ధుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైందని విద్యార్ధులు , ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు వాపోతున్నారు. ముందస్తు ప్రణాలిక ప్రాధాన్యతలు తెలియకుండా విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యారంగ నిపుణులు   అంటున్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, దేవుడులేని గుళ్ళు..ఒకటే. కానీ, ఏపీలో అదే పరిస్థితి వుందని, అంటున్నారు.

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12మంది మృతి! కొత్త సంవత్సరం రోజే తీవ్ర విషాదం

కొత్త సంవత్సరం మొదలైన కొన్ని నిమిషాల్లోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని ప్రఖ్యాత మాతా వైష్టోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె చెంతకే చేరారు. తొలుత ఏడుగురు చనిపోయినట్టు వార్తలు రాగా, ఆ తర్వాత 12 మంది చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  మృతులను ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను కాట్రా, కాక్రయల్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కొత్త సంవత్సరం రోజున భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వేలాదిగా తరలివస్తుంటారు. ఈసారి కూడా ఆలయానికి పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.భక్తుల రద్దీని తట్టుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  మాతా వైష్టోదేవి ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకయ్యే ఖర్చును భరిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటించింది.  

హ్యాంగోవర్ అయిందా.. అయితే ఇలా చేయండి!

న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారా.. రాత్రంతా ఫుల్లుగా మందు తాగి చిందేశారా..  ఉదయం లేవగానే తల పట్టేసిందా... ఫుల్లుగా లిక్కర్ తాగిన వాళ్లకు ఇది కామన్. దాన్నే మనం హ్యాంగోవర్ అని కూడా అంటాం. ఎక్కువ తాగేసిన ప్రతిసారి ఈ హ్యాంగోవర్ సమస్య తప్పదు. తలనొప్పి, దాహం, గొంతు ఎండిపోవడం, అలసట, వాంతులు, వికారం ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే. మీరు అతిగా తాగి హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి ఉపశమనం లభిస్తుంది. మద్యం శరీరంలో ఉన్న నీటిశాతాన్ని పీల్చేస్తుంది. అందుకే తలనొప్పి, వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజంతా మంచినీళ్లు తాగితే.. హ్యాంగోవర్ వల్ల వచ్చిన డీహైడ్రేషన్ తగ్గిపోతుంది.అరటి, పీనట్ బటర్, మామిడి, పాస్తా, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తీసుకుంటే రక్తంలో.. ఆల్కహాల్ నెమ్మదిగా కరుగుతుంది. నిమ్మకాయ రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు.. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నిమ్మరసం తాగితే హ్యాంగోవర్ తగ్గుతుంది. తేనెలోని ఫ్రక్టోజ్ బాడీ నుంచి ఆల్కహాల్ ను తొందరగా బయటకు పంపేలా చేస్తుంది. హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు తేనే తీసుకోండి. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు ఉండేలా జాగ్రత్త పడండి. ప్రోటీన్‌లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి తొందరగా బయట పడొచ్చు. చాలామంది ముల్లును ముల్లుతోనే తీయాలన్న ట్రెండ్ ఫాలో అవుతూ.. ఉదయాన్నే హ్యాంగోవర్ పెగ్ తాగితే తలనొప్పి తగ్గుతుందనుకుంటారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. పైగా.. మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడంలో విటమిన్-సి బాగా పనిచేస్తుంది. హ్యాంగోవర్ తో సతమతమవుతున్నప్పుడు ఆరెంజ్, నిమ్మ జ్యూస్ తీసుకోండి. ఇది కాలేయం మీద ఆల్కహాల్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్కహాల్ తాగే ముందు ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తింటే చాలావరకు హ్యాంగోవర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. 

ఇటలీకి రాహుల్.. ఇండియాలో రచ్చ 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడ? ఒకప్పుడు ఇదొక పెద్ద ప్రశ్న. ఒకసారి కాదు అంతకంటే ఎక్కువసార్లే ఆయన ఎవరికీ చెప్పపెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోవడం... ఎక్కడి కెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది ఎవరకీ తెలియకపోవడం, పార్టీ నాయకులు మీడియా ముందు కొంచెం చాలా ఇబ్బంది పడడం, అందరికీ తెలిసిన విషయమే. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్  గాంధీ కనిపించని సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చింది. అయితే, ఇప్పుడు గతంలోలా ఎవరికీ చెప్పాపెట్టకుండా గాయబ్ కాలేదు . అందరికీ చెప్పే ఇటలీ వెళ్ళారు. ఇటలీ ఎందుకు వెళ్లారు అనేది వేరే చెప్పనక్కర లేదు. సంక్రాంతికో ఉగాదికో మనం మన అమ్మమ్మ ఊరుకు పోతాం కదా, ఆలాగే, ఆయన  న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కావచ్చు, అమ్మమ్మ ఊరు (ఇటలీ) వెళ్ళారు.  నిజానికి ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. ప్రధాని మోడీ సంవత్సరంలో ఒక సారో రెండు సార్లో గుజరాత్ వెళ్లి అమ్మను చూస్తారు కదా .. ఇది కూడా అలాంటిదే. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటి, దేశంలో ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి, వచ్చే ప్రయాణికుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఇటలీ ఎలా వెళతారని, బీజేపీ, పాయింట్ రైజ్ చేసింది, ఇది రాహుల్ జీ  వ్యక్తిగత పర్యటన, వ్యక్తిగత పర్యటనను రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాహుల్‌ పర్యటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమంటూ బీజేపీ విమర్శించింది. ఇదే అదనుగా గతంలో రాహుల్  గాంధి విదేశీ పర్యటనల హిస్టరీ మొత్తం బయటకు తెస్సింది. గతంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు రాహుల్‌ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని తెలిపారు. కనీసం ప్రోటోకాల్‌ పాటించకుండా ఆయన పర్యటనలు చేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. మరో వంక  బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంటోంది. రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. బీజీపే  ఆ పార్టీ మద్దతుదారులు ఈ విషయాన్నిసోషల్ మీడియాలో  రాద్దాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అంటూ  ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా అన్నారు. అదలా ఉంటే, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి అంతగా రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు, కొవిడ్ నిబంధనలను  పాటిస్తున్నారా, అని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడ్ పాల్గొన్న బహరీ బహిరణ సభలను ఫోటోలను జోడించి ... మరీ ట్రోల్ చేస్తున్నాయి.  నిజమే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న (గురువారం) ఉత్తఖండ్’లో భా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు అయోధ్యలో హోమ్ మంత్రి అంతకంటే పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజానికి, నిన్న ఈరోజు అని కాదు, బీజేపీ నాయకులు కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి భారీ బహిరంగ సభలు నిర్వహించని రోజు లేదు. సో.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నందుకు ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే ముందుగా ప్రధమ సేవకుడు (పీఎం) మీద ఆ తర్వాత హోమ్ మంత్రి అమిత్ షా మీద తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ..సోషల్ మీడియా సూటిగా ప్రశ్నిస్తోంది.. నిజమే కదా ..

ఎమ్మెల్యే రికార్డింగ్ డ్యాన్స్.. సోము సంచలనం.. బార్లు ఓపెన్.. టాప్ న్యూస్@7PM

జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.  2022లోనైనా రాష్ట్ర ఆర్థిక స్థితి చక్కదిద్దే యాక్షన్ ప్లాన్ ఉందా అని ప్రశ్నించారు. ‘‘మీరు పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండితనమేనా?’’ అని యెద్దేవా చేశారు. ఫ్యాక్షనిస్ట్ చేతిలో అధికారం.. వేటగాడి చేతిలో బాణం ఒక్కటే అన్నారు. ప్రజాస్వామ్యానికే కాదు.. ప్రజలకు నిలువెల్లా గాయాలే అని యనమల వ్యాఖ్యాలు చేశారు ------ నెల్లూరు జిల్లాలో విపక్షాలు మీడియాపై చిందులువేసే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రికార్డు డ్యాన్సులకు సాక్షిగా నిలిచారు. పైగా వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. రాజుపాలెంలోని ప్రసన్నకుమార్ ముఖ్య అనుచరుడి గెస్టు హౌస్‌లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు వేయించారు. --------- ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్‌ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును... కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే లిక్కర్‌పై మాట్లాడానని వివరించారు.  -------- కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతులను వరి వేయవద్దని.. తాను మాత్రం ఫామ్‌హౌస్‌లో వేశారని మండిపడ్డారు. కేసీఆర్ వరిసాగుపై ప్రజలకు చెబుతామనే నిర్బంధించారన్నారు. జీవో 317తో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారని... ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు ------ బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీని అప్పగించారని, ఆయన ఇంటిపేరు సారాయిగా మారిపోయిందన్నారు. బిచ్చగత్తే కంగనా రనౌత్ దారిలో బీజేపీ నడుస్తోందని దుయ్యబట్టారు. విప్పేసి ఆడే కంగనాకు పద్మశ్రీ.. రైతులకు సాయపడే సోనుసూద్‌పై ఐటీ దాడులా అని నారాయణ ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత బీజేపీ లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ------ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చిత్తూరు జిల్లా పోలీసులను ఆశ్రయించారు.జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదని రోజా స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా మండిపడ్డారు. ----- వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది.  ప్రీమియం బ్రాండ్ల విక్రయాలను ప్రారంభించింది.   -- ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా మందు తీసుకొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆనందయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు. డివిజన్‌ బెంచ్‌లో విచారణకు సింగిల్‌ జడ్జి సూచించారు. గతంలో ఆనందయ్య మందుపై ధర్మాసనంలో విచారణ జరిగిన విషయాన్ని న్యాయవాదులు  గుర్తుచేశారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి దగ్గరకి పంపాలని సింగిల్‌ జడ్జి పేర్కొన్నారు. -------- గత ఏడాది తెలంగాణలో క్రైమ్ రేటు 4.6 శాతంపెరిగింది. నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థంగా అమలు చేశామన్నారు డీజీపీ.  ఇప్పటిదాకా 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, మరో 133 మంది లొంగిపోయారని పేర్కొన్నారు.  ---- టాలీవుడ్ యువ హీరో విష్వక్ సేన్ కరోనా బారినపడ్డాడు. . కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని  సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉన్నానని విష్వక్ సేన్ వెల్లడించాడు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా కార్చిచ్చులాగా కరోనా వైరస్ వ్యాపిస్తుండడం దురదృష్టకరమన్నారు.  --------- హాలీవుడ్ కండలవీరుడు, టెర్మినేటర్ అర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కీలక ప్రకటన చేశారు. తన భార్య శ్రివర్ కు విడాకులిస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. దాదాపు పదేళ్ల క్రితమే విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగానే బతుకుతున్నారు. వీరికి ఉన్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి సెటిల్ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది.

డీజీపీ ఫోటోలతో అక్రమ వసూళ్లు! సొంత పార్టీ నేతలపై ఎస్పీకి ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు..

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నుంచి సెగ తగులుతోంది. తన వ్యతిరేకులతో అమీతుమీకి దిగింది రోజా. వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. వాళ్లపై చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. అక్రమ వసూళ్లపై పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.  నియోజకవర్గంలోని కొందరు నేతలు మంత్రులు, డీజీపీతో ఫొటోలు దిగి వాటిని తప్పుడు పద్ధతుల్లో వినియోగించుకుంటున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ల ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోవర్టుల అంశాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రోజా వెల్లడించారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదంటూ రోజా స్పష్టం చేశారు.  నగరి నియోజకవర్గ వైసీపీలో చాలా కాలంగా విభేదాలు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకరిద్దరు నేతలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని సొంత పార్టీ పెద్దల అండదండలుండటంతో ఎమ్మెల్యేపై వారు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం తయారైంది. అంతేకాదు వారు బలపడటానికి పావులు కదుపుతూ రోజాపై విమర్శలు చేస్తున్నారు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగారు. తనపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందుకు డీజీపీ, మంత్రుల ఫోటోను వాడుకుంటున్నారని ఎస్పీకి కంప్లైంట్‌ చేశారు.

ఏడాదిలో లక్షా 80 వేల కేసులు.. 2021లో పెరిగిన నేరాలు

రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. హత్యలు, అత్యాచార ఘటనలు గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యాయి. సైబర్ నేరాలు పెరిగాయ్. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు కూడా పెరిగాయ్.. వార్షిక నేర నివేదిక 2021లో కీలక విషయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. డీజీపీ ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు 4.6 శాతం మేర పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లక్షా 80 వేల కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 32 వేల FIRలు నమోదయ్యాయి. 838 జీరో FIR కేసులున్నాయి.  2021 సంవత్సరంలో  923 హత్యలు జరిగాయి 2,382 రేప్ కేసులు, 1,218 కిడ్నాప్, 16, 956 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి 17,058 మహిళలపై క్రైమ్ కేసులు నమోదయ్యాయి 2021 లో 17,429 దోపిడీ కేసులు నమోదయ్యాయి.. 113 కోట్ల దోపిడీ జరగగా 53 కోట్లు రికవరీ చేశారు.  8,828 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి 19,248 రోడ్ యాక్సిడెంట్స్ జరుగగా.. 6,690 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద 2 కోట్ల 22 లక్షల 55 వేల కేసులు నమోదు చేశారు.  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 877 కోట్ల జరిమానాలు వేశారు. 2021 లో 4 లక్షల 80 వేల పెటీ కేసులు వచ్చాయి.రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 51 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 86 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థంగా అమలు చేశామన్నారు డీజీపీ.  ఇప్పటిదాకా 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, మరో 133 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. నక్సలైట్ల నుండి 8 ఆయుధాలు, లక్ష 26 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని, ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదైనట్టు డీజీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.879 కోట్ల జరిమానా వేశామని డీజీపీ వెల్లడించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ద్వారా చేరువయ్యామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. డయల్ 100కు ఈ ఏడాది 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్ సిటీలో ఫిర్యాదు వచ్చిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి కోసం 800 స్టేషన్లలో రిసెప్షన్లను ఏర్పాటు చేశామన్నారు. షీ టీమ్స్ కు 5,145 ఫిర్యాదులు వచ్చాయని, బాధితులకు భరోసా కల్పించాయని తెలిపారు. హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. కేసులు పెట్టినా తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.5 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.కరోనా కష్ట కాలంలో పోలుసులు శక్తి వంచన లేకుండా పని చేశారని చెప్పారు మహేందర్ రెడ్డి.  

జిన్నా టవరేంటి..? జిన్నా సెంటర్ ఏంటి? ఈ హీట్ ఏంటి..?

చలికాలంలో కూడా ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది గుంటూరులో దశాబ్దాల క్రితం నిర్మించిన జిన్నా టవర్. జిన్నా టవర్ను కూల్చేయాలనే వాదాన్ని తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యప్రసాద్ కొద్ది రోజుల క్రితమే తెర మీదకు తెచ్చారు. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్లలో లక్షలాది మంది మరణానికి కారకుడైన దేశద్రోహి జిన్నా పేరు గుంటూరులో ఓ సెంటర్ కు పెట్టడమేంటనేది సత్య ప్రసాద్ వాదన. ఆ సెంటర్ కు జిన్నా పేరు తీసేయాలని, ఆ పేరు వెంటనే మార్చేయాలని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యప్రసాద్ చేసిన ఈ డిమాండ్ ను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి సమర్ధించారు. జిన్నా టవర్ ఉన్న ప్రాంతం జిన్నా సెంటర్ గా పేరులో ఉంది. ఇది ఏ పాకిస్తాన్ లోనో లేదని, దురదృష్టం కొద్దీ గుంటూరులో ఉందని విష్ణు విమర్శించారు. దేశ ద్రోహి జిన్నా పేరు అలాగే ఉంచాలా? లేక అబ్దుల్ కలామ్ పేరో లేదా కవి గుర్రం జాషువా పేరో ఎందుకు పెట్టలేదని సత్యప్రసాద్ ప్రశ్నించారు. సత్య ప్రసాద్ వ్యాఖ్యల్ని విష్ణువర్ధన్ రెడ్డి రీ ట్వీట్ చేయడంతోనే పొలిటికల్ హీట్ పెరిగింది. అక్కడితో ఆగని విష్ణువర్ధన్ రెడ్డి జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే బాబ్రీ మసీదు కూల్చేసినట్టు కూలదోస్తామని హెచ్చరించడంతో మరింతగా రాజకీయ అగ్గి రాజుకుంది. విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు ప్రతిస్పందిస్తున్నారు. వివాదాస్పదం అయిన జిన్నా టవర్ పై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మనదన్నారు. ఉద్దేశం ఏదైనా సరే ఉన్న కట్టడాలను తొలగించాలనే వాదన సరికాదని తప్పుపట్టారు. జిన్నా టవర్ కూల్చివేత నెపంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం తగదని బీజేపీ నేతలకు సుచరిత హితవు పలికారు. జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడనేది టవర్ వల్ల తెలుసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం సరికాదని ఖండించారు. కొత్త నిర్మాణాలు చేయండి.. కానీ ఉన్న వాటిని తొలగించవద్దని దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పిన మాటల్ని హోంమంత్రి సుచరిత ప్రస్తావించారు. జిన్నా టవర్ ను కూల్చాలన్న  బీజేపీ నేతల వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేతలు కూడా ఖండిస్తున్నారు.  జిన్నా టవర్ ను కూల్చాలంటే ముందుగా ఢిల్లీలోని పలువురు ముస్లిం నేతలు, పాలకుల పేర్లతో ఉన్న మార్గ్ లను మార్చాలని,  భవంతులను కూల్చాలని, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే కనుక, ఢిల్లీ పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం చేతిలోనే ఉంది కాబట్టి కూల్చివేతలు అక్కడి నుంచే ప్రారంభించాలని సూచిస్తున్నారు. దేశంలోని గుజరాత్ సహా పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో ముస్లిం నేతలు, పాలకుల పేర్లతో ఉన్న చిహ్నాలను తొలగించాలనేది విశ్లేషకుల సూచన. గుజరాత్ లోని ఒక్క ముస్లిం కూడా లేని ఓ గ్రామానికి పాకిస్తాన్ అనే పేరు ఇప్పటికీ ఉండడాన్ని రాజకీయ  విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. పాకిస్తాన్ పేరును మార్చాలని ఆ గ్రామస్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారట. పాకిస్తాన్ గ్రామం పేరు మార్చని కేంద్రం, బీజేపీ ఇప్పుడు జిన్నా టవర్ పై ఎందుకు పడ్డారనే సూటి ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. ఏపీలో ఏమాత్రం ఉనికి ప్రదర్శించలేకపోతున్న బీజేపీ ఏదో ఒక విధంగా నలుగురి దృష్టినీ ఆకర్షించాలనే పక్కా ప్రణాళికలో భాగంగానే జిన్నా టవర్ అంశాన్ని పొలిటికల్ తెరమీద చర్చనీయాంశం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరో పక్కన ప్రజా ఆగ్రహ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేపిన ‘చీప్ లిక్కర్’ వివాదం నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే జిన్నా టవర్ టాపిక్ ను బీజేపీ నేతలు లేవనెత్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి. సున్నితమైన అంశాలు లేవనెత్తి ప్రజల మధ్య విధ్వేషాన్ని బీజేపీ పెంచుతోందని ముస్లిం చేత మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక పక్కన వైసీపీ నేతలు, రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యల్ని ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి మరో కొత్త వాదం తెరమీదకు తేవడం గమనార్హం. జిన్నా టవర్ ను కూల్చవద్దంటే దేశంపై దండయాత్రలు చేసి వేలాది విగ్రహాలను మహ్మద్ గజనీ, ఘోరీలు ధ్వంసం చేసిన సందర్బాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా? అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం గమనార్హం.  జిన్నా టవర్ ఏంటి? జిన్నా సెంటర్ ఏంటి? దాని చారిత్రక నేపథ్యం ఏంటీ..  మన దేశ స్వాతంత్యానికి ముందు నిర్మించిన కట్టడం జిన్నా టవర్. స్వాతంత్ర్య సమరయోధులు అప్పట్లో జిన్నా టవర్ నిర్మాణానికి మద్దతిచ్చారని చరిత్ర చెబుతోంది. 1942లో ప్రస్తుత సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో మత ఘర్షణలు జరిగాయి. దాన్ని స్వాతంత్ర పోరాటంగా మరల్చారనే వివాదంలో స్థానిక కోర్టు 14 మంది ముస్లింలకు ఉరిశిక్ష విధించింది. వారి తరఫున వాదించిన జిన్నా ఉరిశిక్షను రద్దు చేయించారు. దీనికి గుర్తుగా 1942లో స్వాతంత్ర్య ఉద్యమకారులు మహ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో టవర్ నిర్మించారు. ఈ టవర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినా.. వచ్చేందుకు జిన్నాకు వీలు పడలేదు. జిన్నా తరఫున ఆయన అనుచరుడు జులేదా లియాఖత్ అలీకాన్ 1945లో టవర్ కు ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచీ జిన్నా టవర్ నిర్వహణ బాధ్యతను గుంటూరు నగర పాలక సంస్థే చూసుకోవడం విశేషం.జిన్నా టవర్ పేరు మార్చాలని గతంలో కొన్ని సార్లు అప్పటి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానాలు జరిగినా ఎందుకో ఆ తీర్మానాలు అమలులోకి రాకపోవడం గమనార్హం.

అన్ని పార్టీల కాపు నేతలు ఏకమవుతారా? జనసేన పరిస్థితి ఏంటీ? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోందా? రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గమంతా ఏకమవుతుందా? ఈ ప్రశ్న ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా మారింది.హైదరాబాద్‌లో ఇటీవల అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు రహస్యంగా సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. టీడీపీ, వైసీపీ,  బీజేపీ, జనసేనల్లో ఉన్న ముఖ్యమైన కాపు నేతలంతా హాజరుకావడంతో.. ఆ సమావేశంలో ఏం చర్చించారన్నది ఆసక్తిగా మారింది. చీమ చిట్టుక్కుమన్నా మీడియా పట్టేస్తున్న ఈ పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత లీకైందంటే.. సమావేశం పక్కాగానే జరిపారని తెలుస్తోంది. కాపునేతల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా వస్తోంది.  ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్న రీతిలో కాపు నేతలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ముద్రగడ పద్మనాభం, గంటా శ్రీనివాసరావు , కన్నా లక్ష్మినారాయణ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ, వంగవీటి రాధాకృష్ణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరి రామ్మోహన్ రావు, కాపు రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ ఆరేటి ప్రకాశరావు, సంఘం నేతలు కేవీరావు, ఎంహెచ్ రావు సహా కాపు వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొన్నారు.కాపు సామాజికవర్గం రాజకీయంగా అధికారంలోకి రావాలంటే ఏం  చేయాలన్నది  కాపు నేతలు కలిసి మేథోమథనం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సామాజికవర్గాలే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటున్నాయి.. ఆ రెండు సామాజికవర్గాల కన్నా ఎక్కువ ఓటు  బ్యాంక్ కాపులకు ఉంది. కానీ ఇప్పటి వరకూ పాలక స్థానానికి చేరుకునే అవకాశం రాలేదు. అందుకే అధికారమే లక్ష్యంగా కాపుల కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టాలనే ఆలోచన వీరి మధ్య సాగినట్లుగా తెలుస్తోంది.  అయితే ఒక్క కులానికే  ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పెడితే ఇతర వర్గాలు ఏ మాత్రం ఆదరించవని.. అలాంటప్పుడు ఎలా పాలక స్థానం పొందాలన్న అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు,  విఫలమైన తీరును సమావేశం సమీక్షించదట. ఈ సమయంలో సమావేశంలో పాల్గొన్న కొంత మంది నేతలు కర్ణాటకలోని జేడీఎస్‌ను ఉదహరించినట్లుగా చెబుతున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా...  దేవేగౌడ సామాజికవర్గానికి చెందినవారే. వారు బలంగా ఉన్నచోట పార్టీ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. .ఈ క్రమంలో సమీకరణాలు కలసి రావడంతోనే రెండు సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. నేరుగా పార్టీ పెట్టడం ద్వారా చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు సక్సెస్ కాలేకపోతున్నందున ఇలా వర్గంగా సమైక్యంగా మారి అనుకున్నది సాధించవచ్చని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఉంది. కాపు సామాజికవర్గం యువత ఎక్కువగా ఆ పార్టీని ఓన్ చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రత్యేకంగా కాపు పార్టీ అంటే... కాపుల్లోనే విభజన తెచ్చినట్లు కదా అన్న అభిప్రాయం కూడా వారిలో వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే జనసేనను మరింత బలపర్చడాన్ని కూడా ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే జనసేనపార్టీని కాపు సామాజికవర్గంపూర్తి స్థాయిలో నమ్మలేకపోతోందని., గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆరు శాతం ఉండటమే కారణం అని కొంత మంది విశ్లేషించారట. కాపు నేతలందరూ కలసి కట్టుగా కొత్తపార్టీ పెడితే... కాపు సామాజికవర్గం మొత్తం కలసివస్తుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న ఆ కీలక నేత తెలుగు వన్ తో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో  రాజకీయంగా కీలక చర్చలు జరిగినట్లు అంగీకరించారు.  కొత్త పార్టీ ఏర్పాటుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదన్నారు. అతి త్వరలో జరగబోయే మరో సమావేశంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.  మరోవైపు అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలంతా ఏకం కావడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం వివిధ పార్టీల్లోని కాపునేతలు, ప్రముఖులంతా తమ పార్టీలకు రాజీనామాలు చేసి కాపు బ్యానర్ కిందకు వచ్చి  పోటీచేస్తేనే కాపులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని కాపు మేథావులు  అంటున్నారు.  నేతలకు కాపులకు రాజ్యాధికారం కావాలనే పట్టుదలుంటే వారంతా ముందు తమ పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి.. కాపుల కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరాలని అంటున్నారు. లేదంటే ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగంలేదని కొందరు  చెబుతున్నారు. అందరూ ఏకం కాకుండా కొత్త పార్టీల పేరుతో ముందుకు వస్తే జనాలు డ్రామాగా చూస్తారని కూడా కాపు మేథావులు స్పష్టం చేస్తున్నారు.

అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, బార్లు ఓపెన్.. కేసీఆర్ బాటలో జగన్ లిక్కర్ స్కీమ్ 

తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి కనిపిస్తొంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు జనాలు సిద్ధమవుతున్నాయి. మందుబాబుల హడావుడి అయితే మాములుగా లేదు. అయితే కొవిడ్ ఆంక్షలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. తాగినోడికి తాగినంత మందు దొరుకుతుందా లేదా అన్న భయాలు కొందరిలో ఉన్నాయి. అయితే అలాంటి మందుబాబులకు గుడ్ న్యూస్ చేసింది వైసీపీ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా ఏపీలో బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్.  వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి నిచ్చింది.  ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు డిసెంబర్ 31 నుంచి చేపట్టింది.ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు12  వందలు దాటేశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కొత్త వేరియంట్ విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో కఠిన ఆంక్షలు విధించాయి. చాలా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. ఢిల్లీ సర్కార్ ఏకంగా సినిమా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. కేరళ సర్కార్ కూడా న్యూఇయర్ వేడుకలపై నిఘా పెట్టింది.  అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం  మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మద్యం అమ్మకాల వేళలు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవడంపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాగినోళ్ల‌కి తాగినంత మందు అందుబాటులో ఉంచ‌డ‌మే జగన్  స‌ర్కారు ల‌క్ష్యంగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ భయపెడుతున్నా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమైన్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు. 

ప్రతి కొత్త వేవ్ లో ఫార్మాకు లాభాల వేవ్.. వాక్సిన్ కంపెనీల మాయాజాలమే ఒమిక్రాన్? 

కొవిడ్ కొత్త వేరియంట్, ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచాన్ని చుట్టే స్తోంది. ఇంతవరకు మరే వేరియంట్ విస్తరించనంత వేగంగా ఒమిక్రాన్  పరుగులు తీస్తోంది. ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన 26 రోజుల్లోనే, వందకు పైగా దేశాలకు పాకింది. వంద వేలమంది కంటే ఎక్కువ మందికి సోకింది. మరో వంక ఒమిక్రాన్  కరోనా మహామ్మారి వేరియంట్లలో ఆఖరి వేరియంట్ అని, ఒమిక్రాన్ తో   మహమ్మారి మరణిస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఆశ పడుతున్నాయి. కొత్త సంవత్సరం 2022లో మహమ్మారి మాయమై పోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం నమ్మ బలుకుతోంది... కానీ, అది జరగదు. 2022 లో మహమ్మారి ప్రపంచాన్ని వదిలి పోదు .. మనతోనే ఉంటుంది.  ఎందుకంటే, మహమ్మరి కంటే మరింత ప్రమాదకరమైన వైరస్ ఫార్మా కంపెనీలు. ఈ కంపెనీలు  వ్యూహాన్ మహమ్మారి వెళ్ళిపోతానన్నా .. వెళ్ళనీయవు. ఎందుకంటే వ్యూహాన్ వైరస్ ఫార్మా కంపెనీల పాలిట కల్పతరువు. కాసుల పంట పండించే బంగారు ఖని. ప్రతి కొత్త వేవ్’లో  ఫార్మా కంపెనీలు లాభాల వేవ్’నే చూస్తున్నాయి. ఎన్ని వేవులు వస్తే అంతగా ధనవంతులు కావచ్చని కంపెనీలు కొత్త వేరియంట్ల కోసం  ఎదురు చూస్తున్నాయి.. ముఖ్యంగా ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలకు  మహమ్మారి ఆరాధ్య దైవం. మహామ్మారి  పుణ్యాన, ఈ రెండు కంపెనీలు అనూహ్య లాభలు సొంత చేసుకుంటున్నాయి. అమెరికా పార్లమెంట్ సభ్యుడు, బర్నీ స్టాండర్డ్, ఒమిక్రాన్ వేవ్ మొదలైన వారం రోజుల్లోనే ఈ రెండు కంపెనీలలో పెట్టు పదులు పెట్టిన ఎనిమిది మంది సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగింది . అంటే వారం రోజుల్లో ఈ ఎనిమిది మంది 10 బిలియన్ డాలర్ల లాభాలు పొందారు, సని వివరించారు. అయిందేదో అయింది .. ఇక నైనా ధనాపేక్ష కాస్త తగ్గించుకోమని ఆ రెండు కంపెనీలను కోరారు.  ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలు గడచిన రెండు సంవత్సరాలలో బిలుయన్ల డాలర్ల లాభాలను పొందాయి. 2020లో  మోడెర్నా బిలియన్ డాలర్ల నష్టాల్లో వుంది. కానీ, అదే కంపెనీ, 2021లో 7 బిలయన్ డాలర్లు లాభాలు అర్జించింది. అయితే ఫైజర్ తో పోల్చుకుంటే అది తక్కువే .. ఫైజర్ 2020 లో 8 బిలియన్ డాలర్లు లాభాలు అర్జించింది, 2021లో ఇంతవరకు 19 బిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. అంటే ఒకే ఒక్క సంవత్సర కాలంలో ఫైజర్, 124 శాతం లాభాలు అర్జించింది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు,శాస్త్రవేత్తలు, డాక్టర్లు కరోనా మహమ్మరి మరణాన్ని కోరుతున్నారు, కానీ ఫార్మా కంపెనీలు ... ఇంకా ఇంకా అనేక వేరియంట్లు, వేవులు రావాలని కోరుకుంటున్నాయి. ప్రార్ధనలు చేస్తున్నాయి అంటే ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. ఫార్మా కంపెనీలకు ఇంతింత లాభాలు ఎలా వస్తున్నాయని చూస్తే ...ఇంకా ఇంకా ఆశ్చర్యం వేస్తుంది.  ఫైజర్ ఒక డోస్, ఒక షాట్ వాక్సిన్ తయారు చేయడానికి చేసే ఖర్చు ఎంతో తెలుసా, బ్రిటిష్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఒక్క ఫైజర్ షాట్ తయారు చేయడానికి అయ్యే కర్చు కేవలం ఒకే ఒక్క డాలర్ ,బ్రిటిష్ కరెన్సీలో అయితే 76 పెన్నీస్ అదే డోస్, అదే షాట్’ను ఫైజర్ బ్రిటీష్ ప్రభుత్వానికి  30 డాలర్లకు/ 22 పాండ్స్’ కు అమ్ముతుంది. అంటే, 30 రెట్లు ఎక్కువకు అమ్ముతుంది. మోడెర్నాకు సంబందించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేక పోయినా ఉత్పాదక వ్యయం కంటే 4 నుంచి 14 రెట్లు ఎక్కువకు అమ్ముతోందని సమాచారం. ఇటీవల దక్షిణ అఫ్రికాకు  మోడెర్నా ఒమిక్రాన్ కట్టడికి ఒక్కొక్క డోసు వాక్సిన్ను 30 నుంచి 42 డాలర్స్ కు విక్రయించింది. ఇది ... ఉత్పాదక వ్యయం కంటే, 15 రెట్లు ఎక్కువ ఉటుందని అంటున్నారు.  అయితే కంపెనీల వాదన ఇంకోలా వుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ - R &D కి ఖర్చు చేసిన సొమ్మును కూడా రికవరీ చేసుకుంటున్నామని అంటున్నాయి .. కానీ, R &D కి అమెరికా ప్రభుత్వమే, ఫైజర్ కు రెండు బిలయన్ డాలర్లు, మోడెర్నాకు రెండున్నర బిలియన్ డాలర్లు నిధులు సమకూర్చింది. ఇవి గాక, జర్మనీ ముందస్తు కొనుగోలు ఒప్పందంలో భాగంగా మరో రెండు బులియన్ డాలర్లు సమకూర్చింది. అంతే ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో కలిసి, వాక్సిన్ డెవలప్ చేశాయి. ప్రభుత్వ సంస్థలలో పనిచె శాస్త్రవేత్తలు ఇందులో భాగస్వాములయ్యారు.  అయినా ... పేటెంట్ హక్కులు కంపెనీల చేతుల్లో పెట్టి  ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి ప్రజలను, ప్రభుత్వాలను దోచుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.  అయితే వాక్సిన్ పేటెంట్ హక్కులు వ్యూహాన్ వైరస్ నుంచి అనూహ్య లాభాలు అర్జిస్తున్న ఫైజర్, మోడెర్నా చేతుల్లో ఉన్నత వరకు మహమ్మారి మనల్ని వదిలి పోదని అంటున్నారు. అందుకే అమెరికా పార్లమెంట్ సభ్యుడు అన్నట్లుగా  ఫైజర్, మోడెర్నా .. అయిందేదో అయింది ఇకనైనా ... ధన దాహాన్ని తగ్గింసుకుంటేనే ప్రపంచానకి  వ్యూహాన్ మహామ్మారి  నుంచి మానవాళికి విముక్తి లభిస్తుంది

కేసీఆర్ తెల్లవారుజాము దాకా తాగుతడు! కేటీఆర్ కు సోము వీర్రాజు కౌంటర్.. 

చీప్ లిక్కర్ పై సోము వీర్రాజు చేసిన ప్రకటనపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. సోము వీర్రాజును ఏపీతో తెలంగాణ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అయితే తనను విమర్శిస్తూ ట్వీట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పై ఖతర్నాక్ కౌంటరిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్‌ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును... కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు.  పేదవాడిని దృష్టిలో పెట్టుకునే లిక్కర్‌పై మాట్లాడానని వివరించారు సోము వీర్రాజు.  రూ.50కి లిక్కర్ అమ్మితే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయని అన్నారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024 బీజేపీ మేనిఫెస్టోలో పెడతామని స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందన్నారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రి పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరు?.. వెంటనే ఆ పేరును మార్చాలన్నారు. లేకుంటే 2024 అధికారంలోకి వచ్చాక తామే మారుస్తామన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న పేరును బీజేపీ ప్రతిపాదిస్తోందని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. 

వంగవీటి రాధా అందరి వాడా!

వంగవీటి రాధా.. కొత్తగా పరిచయం అక్కర్లేని బెజవాడ రాజకీయ నాయకుడు.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు. రంగా కొడుకుగా కాపు సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉన్నవ్యక్తి. కొంత కాలంగా రాజకీయంగా కాస్త స్తబ్ధుగా ఉన్న రాధా మళ్లీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. తండ్రి వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రాధా మాట్లాడుతూ.. తనను హత్య చేయడం కోసం రెక్కీ నిర్వహించారని చెప్పారు. తాను ప్రజల మనిషినని, భయపడేది లేదని సభా ముఖంగానే రాధా పేర్కొన్నారు. నిజానికి వంగవీటి రాధా కాపు సామాజికవర్గంలో మంచిగుర్తింపు ఉన్న నాయకుడనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు ఉంది. అలాంటి ఓటు బ్యాంకును తమ వైపు ఆకర్షించాలంటే రాధాను మచ్చిక చేసుకుంటే సరిపోతుందనే లెక్కల్లో పార్టీలు ఉండడం సహజం. వంగవీటి రాధా రెక్కీ ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలు క్యూ కట్టేశాయి. రాధాను ఎలాగైనా తమ పార్టీలోకి లాక్కోవాలని వైసీపీ వర్గాలు అప్పటికే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధా పూర్వ మిత్రులు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు పాల్గొన్నారు. రాధా చేసిన రెక్కీ వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగమేఘాల మీద స్పందించారు. సీఎం జగన్ వద్ద రెక్కీ విషయం చెప్పి వెంటనే 2+2 భద్రతను ఏర్పాటు చేయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంతే వేగంగా స్పందించి, రాధాకు భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించడం గమనార్హం. అయితే.. తాను ప్రజల మనిషినని, ప్రజల్లోనే ఉంటానని, తనను ప్రజలు, వంగవీటి అనుచరులే రక్షించుకుంటారని సున్నితంగా చెప్పి సెక్యూరిటీని  రాధా తిప్పి పంపించడం విశేషం. అయినా పట్టు వీడకుండా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు రాధా కార్యాలయానికి రోజూ ఇద్దరు గన్ మెన్ ను పంపిస్తూ ఉండడం గమనార్హం. రాధా అనుగ్రహం కోసం ఒక పక్కన వైసీపీ తీవ్రంగా కృషి చేస్తోంది. రాధా వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనించి సమాచారం ఇచ్చేందుకే కొడాలి, వంశీలను జగన్ తన గూఢచారులుగా వినియోగించారనే గుసగుసలు వస్తుండడం గమనార్హం. ఇందులో భాగంగానే రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో పాటు కొడాలి, వంశీ పాల్గొన్నారని రాజకీయ వర్గాల నుంచి కామెంట్ వస్తోంది. మరో పక్కన.. వంగవీటి రాధా తమవాడే అని, తమ పార్టీ నాయకుడే అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత వెంటనే రంగంలోకి దిగిపోవడం విశేషం. రాధాకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా స్వయంగా రాధాకు ఫోన్ చేసి టీడీపీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మరికొంత పెద్దరికం తీసుకుని గన్ మెన్ ను తిరస్కరించడం సరికాదని సూచించారు. మన ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాలని హితవు చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీ తరఫునా ప్రత్యక్షంగా రాజకీయ కార్యక్రమాల్లో రాధా పాల్గొనడం లేదు. సొంత పనులు, రాధా-రంగా మిత్రమండలి కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటున్నారు. ఇలాంటి రాధాను తమవాడు చేసుకోవాలంటే.. తమవాడిగా చేసుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ రన్నింగ్ రేస్ ఆడుతుండడం విశేషం. ఆ రెండు పార్టీల పరుగంతా రాధాను మచ్చిక చేసుకుని, వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టేందుకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. రాధా మాత్రం ఏ పార్టీకీ అనుకూలంగా కానీ, మరే పార్టీకి వ్యతిరేకంగా గాని వ్యవహరించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం విశేషం.

ఏపీ క్యాపిటల్ ఫర్ సేల్.. జగనన్న దేన్ని వదలరా? 

మూడంటే మూడే  మరో మాటే లేదు.  మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నమొన్నటి దాకా చెప్పిన మాట ఇది. అయితే, అనుకోకుండా నవంబర్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. అయినా చింత చచ్చినా పులుపు చావలేదన్న రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సాంకేతిక కారణాల వలన చేత చట్టాన్ని వెనక్కి తీసుకున్నామే కానీ, మా ‘మూడు’  మారలేదని, వికేంద్రీకణ (మూడు రాజధానుల)కే ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలోనే చెప్పు కొచ్చారు. ‘మూడు’ బిల్లు మళ్ళీ పక్కాగా తీసుకొస్తాం’ అని ప్రకటించారు.  అప్పట్లో అందరూ కూడా, హైకోర్టు విచారణలో ఉన్న కేసులో  ఎటూ ఎదురుదెబ్బ తప్పదని తెలిసే, ముఖ్యమంత్రి  ముందుగానే జాగ్రత్త పడ్డారని అనుకున్నారు, అమాయకంగా. కానీ ఇప్పుడు జగనన్న ముందు చూపు బయట పడింది. మూడు రాజధానుల చట్టం రద్దు వెనక ఉన్న అసలు రహస్యం బయట పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు హయాంలో రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను, చంద్రబాబు హయాంలో మూడొంతులకు పైగా పూర్తయిన భవనాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను అమ్మి. తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకునేందుకు, ముందుచూపుతో రచించిన బృహత్తర పథకంలో భాగంగానే ప్రభుత్వం మూడు రాజాధనుల చట్టాన్ని వెనక్కి తెసుకుంది అనే  నిజం ఇప్పుడు వెలుగుచూసింది.  ‘కూచమ్మకూడా బెడితే మాచమ్మ మాయం చేసింది’ అన్నట్లుగా చంద్రబాబు నాయుడు  అమరావతి ప్రాంత రైతులను ఒప్పించి సేకరించిన భూములను, జగన్ రెడ్డి ఇప్పుడు అమ్మకానికి పెట్టి నట్లు తెలుస్తోంది. అమరావతిని ముక్కలు ముక్కలుగా అమ్ముకునేందుకు ప్రణాలికలు ప్రభుత్వం పక్కా ప్రణాలికను సిద్దం చేసిందని అంటున్నారు. అందుకోసమే, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారని. అమరావతి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నగరాభివృద్ధికి అవసరమైన నిధులను అమరావతి నుంచే రాబట్టేలా ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌’ ప్రాజెక్టుగా రూపొందించారు. నిజానికి, ఆ ప్రోజక్ట్ అదే విహంగా కొనసాగితే, ఇప్పటికే రాజధాని ఏర్పడేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగ్గా ఉండేదని, ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో అంటున్నారు. అదెలా ఉన్నా,రైతుల నుంచి సమీకరించిన భూములతోపాటు ప్రభుత్వ భూములు దాదాపు 50 వేల ఎకరాలను అమరావతికి కేటాయించారు. అన్ని అవసరాలకుపోగా మిగిలిన భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు. దీని ద్వారా సీడ్‌ క్యాపిటల్‌తోపాటు నవ నగరాలను నిర్మించాలన్న బృహత్‌ ప్రణాళికతో ‘అమరావతి’ మొదలైంది. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మీద లేనిపోని నిందలువేసి, వికేంద్రీకరణ పేరున మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. చంద్రబాబు నాయుడు  మొత్తం ప్రణాళికను సర్కారు అటకెక్కించింది. ఇప్పుడు... కొత్తగా ‘అభివృద్ధి’ పేరిట అమరావతి భూముల అమ్మకానికి తెరలేపుతోంది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు ఆమోదం పొందేందుకు అపట్లో అమరావతిలో ఏముంది, బూడిద. అదొక  ఎడారి, శ్మశానం అంటూ రైతుల త్యాగాలను తూలనాడారు, ఆయనే కాదు, బొత్స సత్యనారయణ ఇతర మంత్రులు కూడా అమరావతిలో అసలు అభివృద్దే జరగలేదని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని నమ్మపలికకారు. ఇప్పుడు అదే అమరావతి భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే అమరావతి పరిధిలో 350 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. ఇప్పుడు... చేస్తామంటున్న అభివృద్ధిలో భాగంగా 70 కిలోమీటర్ల రహదారులు వేస్తామంటున్నారు. నిజానికి... అవి అంతకుముందే వేసిన 350 కిలోమీటర్లలో భాగమే. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.2995 కోట్ల అప్పు తెచ్చి, పైపై మెరుగులు దిద్ది, మిగిలిన డబ్బులు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన అపార్టుమెంట్లలో మిగిలిపోయిన పనుల్ని సీఆర్‌డీఏ మళ్లీ ప్రారంభించింది. రాజధాని అమరావతిలో పనులకు 3 వేల కోట్ల రుణం కోసం సీఆర్డీఏ డీపీఆర్‌ సిద్ధం చేయించింది. ఆ మొత్తానికి హామీ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. 481 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తామని వివరించింది.అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని అమ్మకానికి పెట్టిందని అనుకోవచ్చును. నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ళలో ఏ నాడు కూడా రాష్ట్ర  ఆదాయ వనరులను అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేదు. ఆదాయం అప్పలు, ప్రభుత్వ అస్తుల అమ్మకాలు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు అమరావతి వంతు వచ్చింది.

వైసీపీ కౌన్సిలర్ల ఫైటింగ్.. ఎమ్మార్వో చిందులు..కాంగ్రెస్ జోరు..టాప్ న్యూస్@1PM

చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల కౌన్సిలర్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రరత్న రోడ్డు, ప్రసాద్ థియేటర్ ప్రాంతాలలో షాపుల మధ్య గతంలో వేసిన స్టీల్ రెయిలింగ్‌ను తొలగించవద్దని సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. తొలగించాలని ఎమ్మెల్యే కరణం బలరామ్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అందరితో చర్చించి వివరణ ఇస్తానని సమావేశం హాలు నుంచి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వెళ్ళిపోయారు. --------- వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచి వంగవీటి రంగా కుటుంబానికి ఏమీ చేశారని ప్రశ్నించారు. కాపులను సర్వేచేసి బీసీల్లో చేర్చడానికి కాపులందరూ రూ. 46 లక్షలు ప్రభుత్వాన్ని అడిగితే 4 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.  ------- తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 317 జీవోను స‌మీక్షించాల‌ని, దాన్ని స‌వ‌రించాల‌ని స‌ర్కారుకి సూచించాల‌ని కోర‌డానికి ఈ రోజు గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం సమావేశం అయింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను త‌మిళిసైకు తాము వివరించామని చెప్పారు. ------ విశాఖపట్నం నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది. 100, 200, 500 డినామినేషన్‌లో ఉన్న 7.4 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని తీసుకువెళ్తున్న రాజాన విష్ణు, యాగంటి ఈశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిస్సా, జాజ్ పూర్ నుంచి  నకిలీ కరెన్సీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ---- అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు పంపిణి చేసిన కోడి గుడ్లు కుళ్ళిపోయాయి. భయంకరమైన దుర్వాసన వస్తుండడంతో బాధితులు గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలం, గోకివాడలో ఈ ఘటన కలకలం రేపుతోంది. అంగన్‌వాడి కేంద్రంలో వెలుగుల చక్రరావు పాపకు ఇచ్చిన గుడ్లు పగులగొట్టగా కుళ్లిన వాసన వచ్చింది. దీంతో ఆయన విషయాన్ని సర్పంచ్‌కు ఫిర్యాదు చేశాడు. ------- నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ధూంధామ్ చేస్తున్నారు.  న్యూ ఇయర్ వేడుకల్లొ పాల్గొని వైసిపి నేతలతో కలిసి చిందులేసారు ప్రభుత్వ అధికారి. కొవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముందస్తు న్యూ ఇయర్ వేడుకల్లొ ఈ సంఘటన చోటుచేసుకుంది. బుచ్చి రెడ్డి పాళెం తహసీల్దారు స్వయంగా అమ్మాయితొ చిందేసి తెగ సంబరాలు చెసుకున్నారు.  ----- నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల విష‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రాష్ట్రాలు నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌ని వివ‌రించింది. వేడుక‌ల‌పై ఇప్ప‌టికే పోలీసులు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేశార‌ని గుర్తు చేసింది. తెలంగాణ‌లో మొద‌టి డోసు వంద శాతం పూర్త‌యిందని న్యాయ‌స్థానం చెప్పింది. అయితే, క‌రోనాపై కేంద్ర ప్ర‌భుత్వం మార్గద‌ర్శ‌కాలు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర స‌ర్కారుకు సూచించింది.  -------- కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు  జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 437 వార్డుల్లో విజయం సాధించింది. జేడీఎస్ 45, స్వతంత్రులు 204 చోట్ల గెలిచారు.కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బీజేపీ 36.9 శాతం, జేడీఎస్ 3.8 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులకు 17.2 శాతం ఓట్లు లభించాయి. ------ దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కొత్త వైరస్ విజృంభణతో దేశంలో కొత్త కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. గురువారం 16 వేలకుపైగా చేరాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 16,764 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270. ఒక్క రోజులోనే కొత్త వేరియంట్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి.  -- ముస్లిం మహిళకు సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు మొదటి భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది.ఏ వ్యక్తి కూడా ఒక మహిళ లేదా తన భార్యతో సహజీవనం చేయడం ద్వారా దాంపత్య హక్కులను సొంతం చేసుకోలేడని  కోర్టు పేర్కొంది. ---

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా!  వైసీపీ నేతలతో కలిసి ఎమ్మార్వో చిందులు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ధూంధామ్ చేస్తున్నారు.  కొవిడ్ రూల్స్ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లొ పాల్గొని వైసిపి నేతలతో కలిసి చిందులేసారు ప్రభుత్వ అధికారి. కొవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముందస్తు న్యూ ఇయర్ వేడుకల్లొ ఈ సంఘటన చోటుచేసుకుంది. బుచ్చి రెడ్డి పాళెం తహసీల్దారు స్వయంగా అమ్మాయితొ చిందేసి తెగ సంబరాలు చెసుకున్నారు. తహసీల్దారు అయి ఉండి ఇలాంటి పాడు పనులు చేయడం ఏంటని జనాలు దుమ్మొత్తిపోస్తున్నారు. వేడుకలు జరిగె దగ్గరకు స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముందుగా వచ్చి వారిని పలకరించి వెళ్లడం ఇంకా చర్చకు దారితీసింది. ఒమైక్రాన్‌ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలతో కూడిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనాలెవరు గుంపులుగా ఉండవద్దని సూచించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు పూర్తిగా నిషిద్ధం విధించినట్లు పోలీసులు తెలిపారు. కాని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల తహశీల్దారే ఇలా చిందులు వేశారు. ఆ వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఎవరూ మాస్క్ ధరించలేదు. అంతా గుంపులుగుంపులుగా ఉన్నారు. అయినా ఆ కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి తహశీల్దార్ చిందులు వేయడం దుమారం రేపుతోంది.   

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? రవీందర్ సింగ్ కు ఆహ్వానం అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటారు. జగ మొండి అని కూడా చెబుతారు. తనకు నచ్చని వాళ్లు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వదిలించుకుంటారని అంటారు. తనను కాదనుకుని వెళ్లినవాళ్లను మళ్లీ దగ్గరకు రానీయరు అని కూడా ఆయనపై టాక్ ఉంది. కాని ప్రస్తుతం కేసీఆర్ తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గతంలో మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని గులాబీబాస్.. ఇప్పుడు జిల్లాల బాట పడుతున్నారు.  చిన్నచిన్న నేతలను కూడా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. చివరకు తనను వ్యతిరేకించిన వాళ్లను కూడా పిలిపించుకుని.. బుజ్జగించి తన దారికి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇంటలిజెన్స్ నివేదికలు రావడం వల్లే కేసీఆర్ ఇలా దిగొచ్చారని చెబుతున్నారు.  తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఆధిపత్యం కోసం  అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ఎత్తులు వేస్తున్నాయి. వరి సాగు, నిరుద్యోగం వంటి అంశాల్లో విపక్షాలు దూకుడుగా వెళుతుండగా.. కేంద్రానికి కౌంటర్ గా అధికార పార్టీ కూడా నిరసనలకు దిగింది. తాజాగా  బిజెపికి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అధినేత బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటీగా బరిలో నిలిచిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు కేసీఆర్. చాలా సేపు ఆయనతో మాట్లాడి కూల్ చేశారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు రవీందర్ సింగ్. నియంత పాలన సాగుతుందన్నారు. అయినా రవీందర్ సింగ్ ను ప్రగతి భవన్ కు గులాబీబాస్ పిలుపించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్  టీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడ్డారు.  సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఇటీవలే పార్టీలో చేరిన ఎల్.రమణ ను పోటీలో నిలిపింది అధికార పార్టీ. దీంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచారు. అయితే రవీందర్ సింగ్ వెనకున్నది ఈటలేననిప్రచారం జరిగింది.  తనకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తున్నట్లు రవీందర్ బహిరంగంగానే ప్రకటించుకున్నారు.  ఈటల రాజేందర్ కూడా రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నారని పదేపదే ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారని భావించినా.. రవీందర్ సింగ్ కు 200పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ గెలిచి ఎమ్మెల్సీలుగా మారారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వుండాలన్న రాష్ట్ర బిజెపి నిర్ణయాన్ని కాదని ఈటల రవీందర్ సింగ్ కు మద్దతివ్వడంపై కాషాయదళంలోనే భిన్నస్వరాలు వినిపించాయి. ఓటమి తర్వాత కూడా రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడారు. తన ఓటమికి ఈటలను బాధ్యుడిని చేయడం తగదని కూడా టీఆర్ఎస్ కు కౌంటరిచ్చారు. అయితే సడెన్ గా  ఏమయ్యిందో తెలీయదు కానీ రవీందర్ సింగ్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. సిక్కు సామాజిక వర్గం 1832 నుండి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ సీఎం కేసీర్ సానుకూలంగా స్పందించినట్లు రవీందర్ పేర్కొన్నారు. రానున్న రోజులలో ఈఅన్ని  సమస్యలను పరిష్కారం  చేసుకుద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆ హామి ఇచ్చినట్లు తెలిపారు.  అయితే సర్దార్ రవీందర్ సింగ్ ను సీఎం కేసీఆర్ మళ్లీ దగ్గరకుతీయడం వెనక పెద్ద రాజకీయమే దాగివుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను దెబ్బతీయడానికే టీఆర్ఎస్ ను వీడటమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తిని కూడా కేసీఆర్ దగ్గరకు తీసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటల బలం పెరగకకుండా ముందస్తుగానే ఆయనను టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరగడంతో ఏ లీడర్ ను వదులుకోరాదని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తనను తిట్టినవాళ్లను కూడా చేరదీస్తున్నారని అంటున్నారు.