ఏపీ క్యాపిటల్ ఫర్ సేల్.. జగనన్న దేన్ని వదలరా?
posted on Dec 31, 2021 @ 12:02PM
మూడంటే మూడే మరో మాటే లేదు. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నమొన్నటి దాకా చెప్పిన మాట ఇది. అయితే, అనుకోకుండా నవంబర్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. అయినా చింత చచ్చినా పులుపు చావలేదన్న రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సాంకేతిక కారణాల వలన చేత చట్టాన్ని వెనక్కి తీసుకున్నామే కానీ, మా ‘మూడు’ మారలేదని, వికేంద్రీకణ (మూడు రాజధానుల)కే ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలోనే చెప్పు కొచ్చారు. ‘మూడు’ బిల్లు మళ్ళీ పక్కాగా తీసుకొస్తాం’ అని ప్రకటించారు.
అప్పట్లో అందరూ కూడా, హైకోర్టు విచారణలో ఉన్న కేసులో ఎటూ ఎదురుదెబ్బ తప్పదని తెలిసే, ముఖ్యమంత్రి ముందుగానే జాగ్రత్త పడ్డారని అనుకున్నారు, అమాయకంగా. కానీ ఇప్పుడు జగనన్న ముందు చూపు బయట పడింది. మూడు రాజధానుల చట్టం రద్దు వెనక ఉన్న అసలు రహస్యం బయట పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు హయాంలో రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను, చంద్రబాబు హయాంలో మూడొంతులకు పైగా పూర్తయిన భవనాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను అమ్మి. తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకునేందుకు, ముందుచూపుతో రచించిన బృహత్తర పథకంలో భాగంగానే ప్రభుత్వం మూడు రాజాధనుల చట్టాన్ని వెనక్కి తెసుకుంది అనే నిజం ఇప్పుడు వెలుగుచూసింది. ‘కూచమ్మకూడా బెడితే మాచమ్మ మాయం చేసింది’ అన్నట్లుగా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులను ఒప్పించి సేకరించిన భూములను, జగన్ రెడ్డి ఇప్పుడు అమ్మకానికి పెట్టి నట్లు తెలుస్తోంది. అమరావతిని ముక్కలు ముక్కలుగా అమ్ముకునేందుకు ప్రణాలికలు ప్రభుత్వం పక్కా ప్రణాలికను సిద్దం చేసిందని అంటున్నారు. అందుకోసమే, మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారని. అమరావతి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నగరాభివృద్ధికి అవసరమైన నిధులను అమరావతి నుంచే రాబట్టేలా ‘సెల్ఫ్ ఫైనాన్స్’ ప్రాజెక్టుగా రూపొందించారు. నిజానికి, ఆ ప్రోజక్ట్ అదే విహంగా కొనసాగితే, ఇప్పటికే రాజధాని ఏర్పడేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగ్గా ఉండేదని, ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో అంటున్నారు. అదెలా ఉన్నా,రైతుల నుంచి సమీకరించిన భూములతోపాటు ప్రభుత్వ భూములు దాదాపు 50 వేల ఎకరాలను అమరావతికి కేటాయించారు. అన్ని అవసరాలకుపోగా మిగిలిన భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు. దీని ద్వారా సీడ్ క్యాపిటల్‌తోపాటు నవ నగరాలను నిర్మించాలన్న బృహత్ ప్రణాళికతో ‘అమరావతి’ మొదలైంది. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మీద లేనిపోని నిందలువేసి, వికేంద్రీకరణ పేరున మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. చంద్రబాబు నాయుడు మొత్తం ప్రణాళికను సర్కారు అటకెక్కించింది. ఇప్పుడు... కొత్తగా ‘అభివృద్ధి’ పేరిట అమరావతి భూముల అమ్మకానికి తెరలేపుతోంది.
జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు ఆమోదం పొందేందుకు అపట్లో అమరావతిలో ఏముంది, బూడిద. అదొక ఎడారి, శ్మశానం అంటూ రైతుల త్యాగాలను తూలనాడారు, ఆయనే కాదు, బొత్స సత్యనారయణ ఇతర మంత్రులు కూడా అమరావతిలో అసలు అభివృద్దే జరగలేదని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని నమ్మపలికకారు. ఇప్పుడు అదే అమరావతి భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే అమరావతి పరిధిలో 350 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు. ఇప్పుడు... చేస్తామంటున్న అభివృద్ధిలో భాగంగా 70 కిలోమీటర్ల రహదారులు వేస్తామంటున్నారు. నిజానికి... అవి అంతకుముందే వేసిన 350 కిలోమీటర్లలో భాగమే.
ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.2995 కోట్ల అప్పు తెచ్చి, పైపై మెరుగులు దిద్ది, మిగిలిన డబ్బులు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన అపార్టుమెంట్లలో మిగిలిపోయిన పనుల్ని సీఆర్‌డీఏ మళ్లీ ప్రారంభించింది. రాజధాని అమరావతిలో పనులకు 3 వేల కోట్ల రుణం కోసం సీఆర్డీఏ డీపీఆర్ సిద్ధం చేయించింది. ఆ మొత్తానికి హామీ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. 481 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తామని వివరించింది.అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని అమ్మకానికి పెట్టిందని అనుకోవచ్చును. నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ళలో ఏ నాడు కూడా రాష్ట్ర ఆదాయ వనరులను అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేదు. ఆదాయం అప్పలు, ప్రభుత్వ అస్తుల అమ్మకాలు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు అమరావతి వంతు వచ్చింది.