అన్ని పార్టీల కాపు నేతలు ఏకమవుతారా? జనసేన పరిస్థితి ఏంటీ?
posted on Dec 31, 2021 @ 3:11PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోందా? రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు సామాజిక వర్గమంతా ఏకమవుతుందా? ఈ ప్రశ్న ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా మారింది.హైదరాబాద్‌లో ఇటీవల అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు రహస్యంగా సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేనల్లో ఉన్న ముఖ్యమైన కాపు నేతలంతా హాజరుకావడంతో.. ఆ సమావేశంలో ఏం చర్చించారన్నది ఆసక్తిగా మారింది. చీమ చిట్టుక్కుమన్నా మీడియా పట్టేస్తున్న ఈ పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత లీకైందంటే.. సమావేశం పక్కాగానే జరిపారని తెలుస్తోంది. కాపునేతల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా వస్తోంది.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్న రీతిలో కాపు నేతలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ముద్రగడ పద్మనాభం, గంటా శ్రీనివాసరావు , కన్నా లక్ష్మినారాయణ, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ, వంగవీటి రాధాకృష్ణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరి రామ్మోహన్ రావు, కాపు రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ ఆరేటి ప్రకాశరావు, సంఘం నేతలు కేవీరావు, ఎంహెచ్ రావు సహా కాపు వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొన్నారు.కాపు సామాజికవర్గం రాజకీయంగా అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్నది కాపు నేతలు కలిసి మేథోమథనం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సామాజికవర్గాలే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటున్నాయి.. ఆ రెండు సామాజికవర్గాల కన్నా ఎక్కువ ఓటు బ్యాంక్ కాపులకు ఉంది. కానీ ఇప్పటి వరకూ పాలక స్థానానికి చేరుకునే అవకాశం రాలేదు. అందుకే అధికారమే లక్ష్యంగా కాపుల కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టాలనే ఆలోచన వీరి మధ్య సాగినట్లుగా తెలుస్తోంది.
అయితే ఒక్క కులానికే ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పెడితే ఇతర వర్గాలు ఏ మాత్రం ఆదరించవని.. అలాంటప్పుడు ఎలా పాలక స్థానం పొందాలన్న అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు, విఫలమైన తీరును సమావేశం సమీక్షించదట. ఈ సమయంలో సమావేశంలో పాల్గొన్న కొంత మంది నేతలు కర్ణాటకలోని జేడీఎస్‌ను ఉదహరించినట్లుగా చెబుతున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా... దేవేగౌడ సామాజికవర్గానికి చెందినవారే. వారు బలంగా ఉన్నచోట పార్టీ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. .ఈ క్రమంలో సమీకరణాలు కలసి రావడంతోనే రెండు సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. నేరుగా పార్టీ పెట్టడం ద్వారా చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు సక్సెస్ కాలేకపోతున్నందున ఇలా వర్గంగా సమైక్యంగా మారి అనుకున్నది సాధించవచ్చని కొందరు సూచించినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఉంది. కాపు సామాజికవర్గం యువత ఎక్కువగా ఆ పార్టీని ఓన్ చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రత్యేకంగా కాపు పార్టీ అంటే... కాపుల్లోనే విభజన తెచ్చినట్లు కదా అన్న అభిప్రాయం కూడా వారిలో వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే జనసేనను మరింత బలపర్చడాన్ని కూడా ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే జనసేనపార్టీని కాపు సామాజికవర్గంపూర్తి స్థాయిలో నమ్మలేకపోతోందని., గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆరు శాతం ఉండటమే కారణం అని కొంత మంది విశ్లేషించారట. కాపు నేతలందరూ కలసి కట్టుగా కొత్తపార్టీ పెడితే... కాపు సామాజికవర్గం మొత్తం కలసివస్తుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న ఆ కీలక నేత తెలుగు వన్ తో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాజకీయంగా కీలక చర్చలు జరిగినట్లు అంగీకరించారు. కొత్త పార్టీ ఏర్పాటుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదన్నారు. అతి త్వరలో జరగబోయే మరో సమావేశంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
మరోవైపు అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలంతా ఏకం కావడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం వివిధ పార్టీల్లోని కాపునేతలు, ప్రముఖులంతా తమ పార్టీలకు రాజీనామాలు చేసి కాపు బ్యానర్ కిందకు వచ్చి పోటీచేస్తేనే కాపులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని కాపు మేథావులు అంటున్నారు. నేతలకు కాపులకు రాజ్యాధికారం కావాలనే పట్టుదలుంటే వారంతా ముందు తమ పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి.. కాపుల కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరాలని అంటున్నారు. లేదంటే ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగంలేదని కొందరు చెబుతున్నారు. అందరూ ఏకం కాకుండా కొత్త పార్టీల పేరుతో ముందుకు వస్తే జనాలు డ్రామాగా చూస్తారని కూడా కాపు మేథావులు స్పష్టం చేస్తున్నారు.