వంగవీటి రాధా అందరి వాడా!
posted on Dec 31, 2021 @ 1:26PM
వంగవీటి రాధా.. కొత్తగా పరిచయం అక్కర్లేని బెజవాడ రాజకీయ నాయకుడు.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు. రంగా కొడుకుగా కాపు సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉన్నవ్యక్తి. కొంత కాలంగా రాజకీయంగా కాస్త స్తబ్ధుగా ఉన్న రాధా మళ్లీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. తండ్రి వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రాధా మాట్లాడుతూ.. తనను హత్య చేయడం కోసం రెక్కీ నిర్వహించారని చెప్పారు. తాను ప్రజల మనిషినని, భయపడేది లేదని సభా ముఖంగానే రాధా పేర్కొన్నారు.
నిజానికి వంగవీటి రాధా కాపు సామాజికవర్గంలో మంచిగుర్తింపు ఉన్న నాయకుడనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు ఉంది. అలాంటి ఓటు బ్యాంకును తమ వైపు ఆకర్షించాలంటే రాధాను మచ్చిక చేసుకుంటే సరిపోతుందనే లెక్కల్లో పార్టీలు ఉండడం సహజం.
వంగవీటి రాధా రెక్కీ ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలు క్యూ కట్టేశాయి. రాధాను ఎలాగైనా తమ పార్టీలోకి లాక్కోవాలని వైసీపీ వర్గాలు అప్పటికే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధా పూర్వ మిత్రులు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు పాల్గొన్నారు. రాధా చేసిన రెక్కీ వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగమేఘాల మీద స్పందించారు. సీఎం జగన్ వద్ద రెక్కీ విషయం చెప్పి వెంటనే 2+2 భద్రతను ఏర్పాటు చేయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంతే వేగంగా స్పందించి, రాధాకు భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించడం గమనార్హం.
అయితే.. తాను ప్రజల మనిషినని, ప్రజల్లోనే ఉంటానని, తనను ప్రజలు, వంగవీటి అనుచరులే రక్షించుకుంటారని సున్నితంగా చెప్పి సెక్యూరిటీని రాధా తిప్పి పంపించడం విశేషం. అయినా పట్టు వీడకుండా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు రాధా కార్యాలయానికి రోజూ ఇద్దరు గన్ మెన్ ను పంపిస్తూ ఉండడం గమనార్హం. రాధా అనుగ్రహం కోసం ఒక పక్కన వైసీపీ తీవ్రంగా కృషి చేస్తోంది. రాధా వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనించి సమాచారం ఇచ్చేందుకే కొడాలి, వంశీలను జగన్ తన గూఢచారులుగా వినియోగించారనే గుసగుసలు వస్తుండడం గమనార్హం. ఇందులో భాగంగానే రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో పాటు కొడాలి, వంశీ పాల్గొన్నారని రాజకీయ వర్గాల నుంచి కామెంట్ వస్తోంది.
మరో పక్కన.. వంగవీటి రాధా తమవాడే అని, తమ పార్టీ నాయకుడే అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత వెంటనే రంగంలోకి దిగిపోవడం విశేషం. రాధాకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా స్వయంగా రాధాకు ఫోన్ చేసి టీడీపీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మరికొంత పెద్దరికం తీసుకుని గన్ మెన్ ను తిరస్కరించడం సరికాదని సూచించారు. మన ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాలని హితవు చెప్పారు.
ప్రస్తుతం ఏ పార్టీ తరఫునా ప్రత్యక్షంగా రాజకీయ కార్యక్రమాల్లో రాధా పాల్గొనడం లేదు. సొంత పనులు, రాధా-రంగా మిత్రమండలి కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటున్నారు. ఇలాంటి రాధాను తమవాడు చేసుకోవాలంటే.. తమవాడిగా చేసుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ రన్నింగ్ రేస్ ఆడుతుండడం విశేషం. ఆ రెండు పార్టీల పరుగంతా రాధాను మచ్చిక చేసుకుని, వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టేందుకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. రాధా మాత్రం ఏ పార్టీకీ అనుకూలంగా కానీ, మరే పార్టీకి వ్యతిరేకంగా గాని వ్యవహరించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం విశేషం.