వామ్మో.. ఇంత తాగేశారా? తగ్గేదే లే...
posted on Jan 1, 2022 @ 2:12PM
కొత్త సంవత్సరాదికి తెలుగు రాష్ట్రాల ప్రజలు గ్రాండ్ వెల్ కం చెప్పారు. మందుబాబుల హడావుడి అయితే ఓ రేంజ్ లో కనిపించింది. ఫుల్లుగా తాగేశారు. న్యూ ఇయర్ కు స్వాగతం పలికే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే తెలంగాణ, ఏపీ ఎక్సైజ్ శాఖలకు భారీ ఆదాయం వచ్చిపడింది. డిసెంబరు 31న తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
తెలంగాణ వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్ రూ.23.13 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో మద్యం అమ్మకాలు రూ.3459 కోట్లు జరిగాయి. ఇందులో 40.48 కేసుల లిక్కర్, 34 లక్షల కేసులకుపైగా బీర్ల అమ్మకాలు ఉన్నాయి. మొత్తంగా 2021లో రూ.30,222 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి.
ఏపీలోనూ ఇదే తీరు కనిపించింది. మద్యం ప్రియులు 1.36 లక్షల కేసు లిక్కర్, 53 వేల కేసులు బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకాని ఉంచడంతో ఏపీలో మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడం కూడా కలిసొచ్చింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో మొత్తం రూ.215 కోట్ల మద్యం విక్రయం జరిగింది. రోజువారీగా రూ.70- 75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగగా... న్యూ ఇయర్ సందర్భంగా రూ.50 కోట్ల మేర అదనంగా అమ్మకాలు సాగాయి.