వైసీపీ కౌన్సిలర్ల ఫైటింగ్.. ఎమ్మార్వో చిందులు..కాంగ్రెస్ జోరు..టాప్ న్యూస్@1PM
posted on Dec 31, 2021 @ 11:57AM
చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల కౌన్సిలర్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రరత్న రోడ్డు, ప్రసాద్ థియేటర్ ప్రాంతాలలో షాపుల మధ్య గతంలో వేసిన స్టీల్ రెయిలింగ్‌ను తొలగించవద్దని సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. తొలగించాలని ఎమ్మెల్యే కరణం బలరామ్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అందరితో చర్చించి వివరణ ఇస్తానని సమావేశం హాలు నుంచి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వెళ్ళిపోయారు.
---------
వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచి వంగవీటి రంగా కుటుంబానికి ఏమీ చేశారని ప్రశ్నించారు. కాపులను సర్వేచేసి బీసీల్లో చేర్చడానికి కాపులందరూ రూ. 46 లక్షలు ప్రభుత్వాన్ని అడిగితే 4 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
-------
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోను సమీక్షించాలని, దాన్ని సవరించాలని సర్కారుకి సూచించాలని కోరడానికి ఈ రోజు గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం సమావేశం అయింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను తమిళిసైకు తాము వివరించామని చెప్పారు.
------
విశాఖపట్నం నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది. 100, 200, 500 డినామినేషన్‌లో ఉన్న 7.4 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని తీసుకువెళ్తున్న రాజాన విష్ణు, యాగంటి ఈశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిస్సా, జాజ్ పూర్ నుంచి నకిలీ కరెన్సీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
----
అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు పంపిణి చేసిన కోడి గుడ్లు కుళ్ళిపోయాయి. భయంకరమైన దుర్వాసన వస్తుండడంతో బాధితులు గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలం, గోకివాడలో ఈ ఘటన కలకలం రేపుతోంది. అంగన్‌వాడి కేంద్రంలో వెలుగుల చక్రరావు పాపకు ఇచ్చిన గుడ్లు పగులగొట్టగా కుళ్లిన వాసన వచ్చింది. దీంతో ఆయన విషయాన్ని సర్పంచ్‌కు ఫిర్యాదు చేశాడు.
-------
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ధూంధామ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లొ పాల్గొని వైసిపి నేతలతో కలిసి చిందులేసారు ప్రభుత్వ అధికారి. కొవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముందస్తు న్యూ ఇయర్ వేడుకల్లొ ఈ సంఘటన చోటుచేసుకుంది. బుచ్చి రెడ్డి పాళెం తహసీల్దారు స్వయంగా అమ్మాయితొ చిందేసి తెగ సంబరాలు చెసుకున్నారు.
-----
నూతన సంవత్సర వేడుకల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు చెప్పింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించింది. వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారని గుర్తు చేసింది. తెలంగాణలో మొదటి డోసు వంద శాతం పూర్తయిందని న్యాయస్థానం చెప్పింది. అయితే, కరోనాపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది.
--------
కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 437 వార్డుల్లో విజయం సాధించింది. జేడీఎస్ 45, స్వతంత్రులు 204 చోట్ల గెలిచారు.కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బీజేపీ 36.9 శాతం, జేడీఎస్ 3.8 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులకు 17.2 శాతం ఓట్లు లభించాయి.
------
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కొత్త వైరస్ విజృంభణతో దేశంలో కొత్త కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. గురువారం 16 వేలకుపైగా చేరాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 16,764 కొవిడ్ కేసులు నమోదు కాగా.. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270. ఒక్క రోజులోనే కొత్త వేరియంట్ కేసులు 30 శాతం మేర పెరిగాయి.
--
ముస్లిం మహిళకు సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు మొదటి భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది.ఏ వ్యక్తి కూడా ఒక మహిళ లేదా తన భార్యతో సహజీవనం చేయడం ద్వారా దాంపత్య హక్కులను సొంతం చేసుకోలేడని కోర్టు పేర్కొంది.
---