అసెంబ్లీ బరిలో పోటీకి ఓడి గెలిచిన ఎంపీలు రెడీ?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అంబర్‌పేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2019 ఎన్నికల్లో అదే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్కీ గా గెలిచారు. అనూహ్యంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అమిత్ షా సరసన స్థానం సంపాదించారు. అంతలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినేట్  స్థానం దక్కించుకున్న తొలి మంత్రిగా, ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతే కాదు,ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నుంచి బీజేపీ సారధ్యంలోని  ఎన్డీఎ ( అప్పటి వాజపేయి, ఇప్పటి మోడీ) ప్రభుత్వాలలో కేబినేట్ హోదా పొందిన తొలి తెలుగోడుగా మరో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి 2019 లోక్ సభ ఎన్నికల్లో లక్కీ’ గెలిచింది ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కాదు, బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధింగారు.అయితే ఈ లక్కీ’ ఎంపీలు అందరిలో కిషన్ రెడ్డి త్రీ ఫోర్  టైమ్స్ ఎక్కువ లక్కీ.  అదలా ఉంటే’ ఓడి గెలిచిన ఎంపీలతో పాటుగా, బీజేపీ ఎంపీలు నలుగురిలో ముగ్గురు, కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు లేక లేక పోలేదని తెలుస్తోంది. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్) మధ్యనే పోటీ జరిగింది. కానీ 2023 ఎన్నికలలో సత్తచాటేందుకు, కాంగ్రెస్’తో పాటుగా బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే, తెరాస, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే, కాంగ్రెస్, బీజేపీ బలమైన నాయకుల అందరీని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేయాలని అలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని సమాచారం.    కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మళ్ళీ  గత ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల నుంచే తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. రేవంత్ కొడంగల్‌ నుంచి, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి...హుజూర్‌నగర్‌ నుంచి, భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి...నల్గొండ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.  కేంద్ర మంత్రి  సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోతెచేసి ఓడిన అంబర్‌పేట నుంచి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిన కరీమానగర్ అసెంబ్లీ స్థానం నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారు. అయితే బీజేపీ నాలుగో ఎంపీ (నిజామాబాద్) ధర్మపురి అరవింద్...మాత్రం మళ్ళీ లోక్ సభకే పోటీ చేస్తారని, పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి తుది నిర్ణయం ఉంటుదని అంటున్నారు.

బీజేపీ కార్యాలయం గేట్లు బద్దలు.. తలకు గాయమైనా బండి సంజయ్ అరెస్ట్

కరీంనగర్ లో రాత్రి తీవ్ర ఉద్రిక్తత తలెత్తంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం  ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  అరెస్టులతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసిన పోలీసులు కిటీకీల గుండగా లోపల దీక్ష చేస్తున్న వారిపై ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లారు. ఆ తర్వాత తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది.  అరెస్ట్ చేసిన సంజయ్‌ను మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించారు. దీక్ష భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు, ‘‘నువ్వు జైలుకెళ్లే సమయంలో నీ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుతో ఇలాగే ఇబ్బంది పడతారు’’ అని కేసీఆర్‌ను హెచ్చరించారు.  తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యం చేసిన పోలీసులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తలపులు బద్దలుగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కూడా సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు.

పట్టపగలు NTR విగ్రహం ధ్వంసం.. వైసీపీ నేత దుశ్చర్యతో మాచర్లలో హై టెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లాలో పట్టపగలు తెలుగు దేశం పార్టీ వ్యవస్థపాకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు  ఓ వ్యక్తి యత్నించాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన పల్నాడులో తీవ్ర అలజడి రేపింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి గ్రామానికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. సమాచారమందుకున్న దుర్గి ఎస్‌.ఐ పాల్‌ రవీందర్‌ ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు. విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.  ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించిన కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.  వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతల శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేశాడని లోకేశ్ వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

13 జిల్లాల్లోనూ అదే సీన్.. నేతలపై కేడర్ తిరుగుబాట్లు.. వైసీపీలో ఎందుకీ కల్లోలం! 

మూడు గ్రూపులు.. ఆరు ఘర్షణలు.. 12 రాజీనామాలు. ఇదీ ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అధికారం ఇంకా రెండున్నర ఏండ్లు ఉన్నా అప్పుడే వైసీపీలో అంతర్గత పోరు భగ్గమంటోంది. అన్ని జిల్లాల్లోనూ వర్గ పోరు ముదిరి రోడ్డున పడుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. వైసీపీ ప్రజా ప్రతినిధులపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిరగబడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇందులో మంత్రులకు కూడా మినహాయింపు లేదు. ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులకు వైసీపీ కార్యకర్తల నుంచి సెగ తప్పడం లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీలో కల్లోలం కనిపిస్తోంది.  ఇదంతా జగన్ రెడ్డి పాలన వల్లేనని తెలుస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలవుతుందనే చర్చ జనాల్లో సాగుతోంది. రాష్ట్ర పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో దివాళా తీసే పరిస్థితి ఉందనే భయాలు జనాల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్ని చూస్తున్న వైసీపీ ద్వితియ శ్రేణి నేతలకు భవిష్యత్ చిత్రం కనిపించిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడం అసాధ్యమని భావించి ఇలా తిరుగుబాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. పూర్తిగా ప్రజల్లో చులకన కాకముందే ఎవరి దారి వాళ్లు చూసుకునే పనిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే మంత్రులపైనా తిరగబడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడచూసినా అధికార పార్టీలో అసంతృప్తి గళాలే వినిపిస్తున్నాయి.  ప్ర‌కాశం జిల్లాలో ఓ వైపు తెలుగుదేశం బ‌లం పుంజుకుంటుంటే వైసీపీ రోజుకో గ్రూపు..పూట‌కో వివాదంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పూర్తిగా పార్టీకి దూరం అయ్యారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీతో త‌న‌కు సంబంధ‌మే లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే త‌న గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి ఫోన్ల‌కి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. చీరాల‌లో టిడిపి నుంచి వ‌చ్చిన క‌ర‌ణం బ‌ల‌రాం..అంత‌కుముందే వైసీపీలో చేరిన ఆమంచి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి కూడా వేయ‌కుండా భ‌గ్గుమంటోంది. ఇక జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న బావ‌మ‌రిది బాలినేని శ్రీనివాస‌రెడ్డి మ‌ధ్య వైరం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్ష‌ణంలోనైనా రాజీనామా చేయొచ్చ‌ని హింట్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్ర‌శ్నిస్తే చాలు సొంత పార్టీ వారైనా లోప‌లేయిస్తున్నార‌ని వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైసీపీ నేత‌ల‌దీ ఇదే మాట‌. పెద్దిరెడ్డి బ‌స్సుల్లో ఓట్లు త‌ర‌లించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడ‌గొడుతున్నారు.న‌గ‌రి ఎమ్మెల్యే రోజాది మ‌రీ దారుణ‌మైన ప‌రిస్థితి. త‌న‌కు పోటీగా ఎదుగుతున్నార‌ని వైసీపీ నేత‌ల్ని స‌స్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో సొంతంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌లు మ‌ధ్య వైరం తీవ్రం అవుతోంది. ఎంపీ రంగ‌య్య‌, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన‌ప‌డ్డాయి. క‌దిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప‌ద‌వులు అమ్ముకున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డంతో వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి... త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో లోక‌ల్ మాఫియాలు దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు- మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అస్స‌లు పొస‌గ‌డంలేదు.  గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్‌ క్యాడర్‌ నేతలు ఆరోపించారు. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట‌కి మ‌ధ్య వివాదం కేసుల వ‌ర‌కూ చేరింది. గుంటూరు జిల్లాలో న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినితో విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి. కృష్ణ‌దేవ‌రాయ‌లు పూర్తిగా పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో వున్నార‌ని స‌మాచారం. వైసీపీలో  మొద‌టి నుంచీ ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై వైరాగ్యంతో తిరిగి న్యాయ‌వాదిగా ప్రాక్టీసుకి వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాప‌ట్ల ఎంపీ సురేష్ మ‌ధ్య వాటాల తేడాతో గొడ‌వ‌లు ముదిరి రోడ్డున‌ప‌డ్డాయి. శ్రీదేవిని హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావాల‌ని అధినేత ఆదేశించార‌ని వైసీపీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరిన టిడిపి నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో ఒక‌రినొక‌రు త‌మ‌కే సాధ్య‌మైన పాత‌త‌రం పాలిటిక్స్‌తో త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు....దేవినేని అవినాష్‌ని టార్గెట్ చేసి మ‌రీ కొట్టారు. వంగ‌వీటి రాధ హ‌త్య‌కి అవినాష్ ఆంత‌రంగికుడు అర‌వ స‌త్యం రెక్కీ నిర్వ‌హించ‌డంతో పార్టీలో లుక‌లుక‌లుని బ‌య‌ట‌పెట్టింది. మ‌రోవైపు పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి.ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌, ఎమ్మెల్యే ఎలీజా మ‌ధ్య ఉన్న గ్యాప్ స్థానికసంస్థ ఎన్నిక‌ల్లో బ‌ట్ట‌బ‌య‌లైంది. మంత్రి ఆళ్ల‌నానితోనూ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు బాగా దూరం పెరిగింది. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రినొక‌రు ఎప్పుడు దెబ్బ‌కొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు.  విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బ‌కి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారు. ఇటీవ‌లే వైసీపీ జెండా క‌ప్పుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్ అల‌క‌బూనారు. అలాగే మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో వున్నారు. పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి స్థానిక వైసీపీ నేత‌ల‌కి మ‌ధ్య చాలారోజుల్నించి వివాదాలు న‌డుస్తూనే వున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన కృష్ణ‌దాసు వ‌ర్గం, త‌మ్మినేని వ‌ర్గం, సీదిరి స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతూ...ఇది మునిగిపోయే ప‌డ‌వ‌...మీ దారి మీరు చూసుకోండ‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం.విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వాకి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న‌శ్రీనుని జ‌గ‌న్ పావులా వాడుకోవ‌డంతో ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లులా రాజుకుంటోంది రాజ‌కీయం.   

వైసీపీలో వర్గ పోరు.. ముందస్తు ముచ్చట.. కేటీఆర్ కోవర్టు కాడట.. శ్రీవారి అలర్ట్.. టాప్ న్యూస్@7PM

పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజలపై లేదని అన్నారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తానన్న జగన్ మాటతప్పారని, దశల వారీగా అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పర్యటనలో 2 కిలోమీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారని... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యన కూడా ఇంత ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేయరని ఎద్దేవా చేశారు.  ------- ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై వైసీపీ యువ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. ------ పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఎమ్మెల్సే బాబూరావు తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమన్నారు. ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతల పాదయాత్రకు చేశారు. ఎంసీటీసీ బొలిశెట్టి గోవింద్‌ ఆధ్వర్యంలో పెద్దగుమ్ములూరు దగ్గర పాదయాత్ర చేశారు. బాబూరావు వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు --------- విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వద్ద జుంబా డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా డ్యాన్స్ చేశారు. టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబుతో కలిసి ఆయన జుంబా డ్యాన్స్ చేశారు. యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూ వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ------- తాను కేటీఆర్ కోవర్టునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కేటీఆర్ ను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని అన్నారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు. ---- ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తుండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ సీపీని డిమాండ్ చేశారు. ----- శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని, మాజీ సీఎం వైఎస్‌ హయాంలో 426 జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి.. ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే ఇతర మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. -------- ఈసారి జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ  వెల్లడించింది. ఈసారి వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠద్వార దర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. వీఐపీలకు నందకం, వకుళమాత వసతి భవనంలో గదులు కేటాయిస్తామని, తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. --- ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు సునీత త్రిపాఠి(ఒడిషా), శివ(హైదరాబాద్)గా గుర్తించారు. సునీత త్రిపాఠి.. పిక్‌నిక్ కోసం ఒడిషా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.  ----------- ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్, దాని పరిసర ప్రాంతాలు స్వతంత్ర భారత దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్నారన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భరత మాత ముద్దు బిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన గడ్డ మీరట్ అని పేర్కొన్నారు.  కొద్ది నెలల క్రితం క్రీడా రంగంలో దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు --

పీసీసీ చీఫ్ రేవంత్ కు సీనియర్స్ సెగ పెడుతున్నారా?

అసమ్మతి నుంచి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నుంచి అసమ్మతిని వేరు చేసి చూడడం కుదరదు. అసమ్మతి, అంతర్గత ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్  పార్టీకి సహజ కవచ కుండలాలు. నిజానికి ఒకప్పుడు, ఇతర పార్టీల నుంచి అంతగా పోటీలేని రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే డబుల్ రోల్ ప్లే చేసింది. ఇప్పడు ఆ పరిస్థితి అదికాదు. కాంగ్రెస్ పార్టీనే లోక్ సభలో డబుల్ డిజిట్ పడిపోయింది.అధికారం దూరమైంది. ప్రతిపక్షంగా అది కూడా గుర్తింపులేని ప్రతిపక్షంగా మాత్రమే కాంగ్రెస్ మిగిలింది. అయినా, ఓల్డ్ హబిట్స్ డై హార్డ్ ..  పాత వాసనలు పాత అలవాట్లు అంత త్వరగా వదలవులా వుంది. అందుకే, పార్టీలో అసమ్మతి, ముఠా కుమ్ములాటలు అప్పటిలానే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి.  నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్ లో  ఎన్నికల ప్రచార సారధి, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంతటి నాయకుడు అమ్మతి దెబ్బకు తట్టుకోలేక చేతులు ఎత్తేశారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించడం తమ వల్ల కాదని కాడి దించేశారు. చివరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చారు. పంజాబ్’ విషయం అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దూ వర్గాల మధ్య విభేదాలు, వివాదాలు డైలీ సీరియల్స్ ను తలపిస్తున్నాయి.  ఇక ఇప్పడు తెలంగాణ విషయానికి వస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రత్యర్ధి పార్టీలు తెరాస, బీజేపీలతో పాటుగా, సొంతపార్టీలోని సీనియర్ నాయకులతోనూ పోరాడవలసి వస్తోంది.   ఆయనకు సీనియర్లకు మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అంతే కాదు ప్రత్యర్ధి పార్టీలను ఆయన  ధీటుగా ఎదుర్కుంటున్న రేవంత్ సొంతపార్టీ సీనియర్లను సమాధాన పరచలేక పోతున్నారనిపిస్తోంది. సీనియర్లతో సయోధ్యత  ఆయనతో అయ్యే  పనిలా కనిపించడం లేదని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నారు.నిజానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే, అందరినీ కలుపుకుపోయే పని ప్రారంభించారు. అయినా, సీనియర్ నాయకుల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి చల్లారలేదు.అప్పుడప్పుడు ఇలా భగ్గు మంటూనే వుంది.  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ నాయకుల  సమక్షంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక సారి భగ్గుమన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పరిస్థితిని  సమీక్షించిన అధిష్ఠానం, అసమ్మతి నేతలకు అక్షింతలు వేసింది.  విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చెయ్యాలని స్పష్టం చేసింది. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు కూడా చేసింది.దాంతో గతకొంత కాలంగా అసమ్మతి కార్యక్రమాలు కొంత మేరకు సర్డుమణిగాయి. అయితే పైకి కలిసికట్టుగా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడుతాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డిల మధ్య గత నాలగైదు రోజులుగా సాగుతున్న ‘రచ్చబండ’ వివాదం,సీనియర్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడికి మధ్య ఉన్న విభేదాలు సమసి పోలేదని స్పష్టం చేస్తున్నాయి  ఇక విషయంలోకి వస్తే గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమంవిషయానికి సంబంధించి తనకు సమాచారం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో అగ్గిరాజేశారు. ఆ విధంగా అసమ్మతి రాగం, అంతలోనే  శ్రుతిమించి ..రచ్చ రచ్చగా మారింది. దీంతో, గతంలో ఎప్పుడో రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శశి థరూర్’ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇతర పాత పురాణాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విభేదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తనకు తెలియకుండా రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పీఏసీ సమావేశంలో చర్చించిన తర్వాతనే పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు.ఆ అధికారం నాకు ఉంది..ఇదే సమయంలో పీఏసీతో సంబంధం లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు చేసేందుకు నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రథసారథి అయినప్పటికీ స్థానిక నాయకత్వానికి సమాచారం లేకుండా పార్టీ సమావేశంలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా నివేదిస్తామని జగ్గారెడ్డి తమదైన స్టైల్లో  స్పష్టం చేశారు.   

రూ. 10 నుంచి లక్ష విలువైన వస్తువులు.. దేశంలోనే అతిపెద్ద నాంపల్లి ఎగ్జిబిషన్ కు 85 ఏళ్లు..

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన.. ఎగ్జిబిషన్‌. ఈ పేరు వింటేనే హైదరాబాద్ వాసులకు పండగ. ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. వేల సంఖ్యలో స్టాళ్లు..ఇతర రాష్ట్రాల వస్తువులు..వినోదానికి పెద్దపీట..కోట్ల రూపాయల వ్యాపారంతో నుమాయిష్ కు దేశవ్యాప్తంగా పేరుంది. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచే నుమాయిష్‌కు  85 ఏళ్ల క్రితం బీజం పడింది.  అప్పట్లో హైదరాబాద్‌ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్‌..నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా మారింది. 80 స్టాల్స్‌తో దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్‌..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 50 లక్షల మంది సందర్శకులతో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా గుర్తింపు సాధించింది.  నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్‌ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్‌ అక్బర్‌ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు సమకూరుతాయని వారు వివరించారు.  అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌కు పంపించారు. దీంతో ఉస్మాన్‌అలీ ఖాన్‌ నుమాయిష్‌ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. నుమాయిష్‌ ఎక్కడ..ఎలా నిర్వహించాలనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పట్టభద్రుల సంఘం వివిధ పనులకు కమిటీలు ఏర్పాటు చేసింది. తొలుత పరిశ్రమలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసే కర్మాగారాలు, అప్పట్లో ఉన్న పెద్ద దుకాణాల నిర్వాహకులు, యజమానులను సంప్రదించి నూమాయిష్‌ ఆవశ్యకతను వివరించారు.అటు జంట నగర ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వేతికారు. చివరికి బాగేఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.చివరకు తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్‌ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్‌ నిర్వహించారు.  1946 వరకు పబ్లిక్‌ గార్డెన్స్‌లో నుమాయిష్‌ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. స్థాపించిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రజాదరణ పెరిగింది. నుమాయిష్‌లో స్టాల్స్‌ పెరగడంతో పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. చివరికి నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. 1946లో హైదరాబాద్‌ అప్పటి ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. నేటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది.  నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రత్యేకత ఎమిటేంటే..ఇక్కడ రూ.10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తుంటాయి. నగర, రాష్ట్ర, దేశ విదేశీ పరిశ్రమల్లో తయారు చేసిన దాదాపు 10 లక్షలకుపైగా వైరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఫుడ్‌ ఐటమ్స్‌తో పాటు సంస్కాృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వినోదం కోసం రకరకాల ఐటమ్స్‌ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. అందుకే దీన్ని దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా గుర్తిస్తున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్‌ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్‌ పేరును ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ గతేడాది వరకు విరామం లేకుండా ప్రతి ఏటా కొనసాగింది. గతేడాది కరోనాతో నుమాయిష్‌ను మూసివేసారు. ఈ ఏడాది కేవలం 1500 స్టాల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు.   

న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగతనం చేసిన పోలీసులు..

కంచే చేను మేస్తే.. రక్షించాల్సిన వాడు భక్షిస్తే.. ఇక చెప్పుకోవడానికి ఏమి ఉండదు. పోలీసులు అంటేనే సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే వీరులు. అలాంటి పోలీసులే వక్ర మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి కూడా మరీ చండాలంగా ఉంటుంది కదూ. కాని అలాంటి పోలీసులే పాడు పని చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏకంగా ఒక రైతు మేకను దొంగిలించి దావతు చేసుకున్నారు.  న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 అందరిలాగే పోలీసులు కూడా పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఆ విధంగానే రెండు మేకలను కోసి మరి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. అయితే దావుతు కోసం మేకలను కొనలేదు... కొట్టుకొచ్చారు. అవునండి మీరు విన్నది నిజమే. పోలీసులు దొంగల్లా మరి మేకలను కాజేసి పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే దాన్ని కోసి విందు పార్టీ చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపినవిషయం ప్రకారం సిండికేల గ్రామానికి చెందినటువంటి సంకీర్తన గురు అనే వ్యక్తి మేకలను మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే ఆయన 31 వ రోజు మేకలను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఆ మందలో రెండు మేకలు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ కనిపించలేదు. వీరు మేకలను మేపే దగ్గరనే పోలీస్ స్టేషన్ ఉంది. వీరు వెతికే క్రమంలో గురు కూతురు స్టేషన్ లో రెండు మేకల కోస్తుండగా చూసింది.వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది. గురు వారి యొక్క గ్రామస్తులను వెంట తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిబ్బందిని నిలదీశారు. మా మేకలను దొంగిలించి కోసుకుంటారా.. అని ప్రశ్నించాడు. కానీ వారు పట్టించుకోలేదు. గురునే బెదిరించారు.  ఈ విషయం కాస్త మీడియా దృష్టికి వెళ్లింది. వెంటనే జిల్లా ఎస్పీ నితిన్ శుక్లకర్ స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి పోలీసులు తప్పు అని తేల్చారు. ఎస్ఐ సుమన్ మాలిక్ ను సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయం  సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజలు పోలీసులు ఇలా చేస్తే  దొంగలు ఏ విధంగా చేస్తారని దుమ్మెత్తిపోస్తున్నారు.

మహిళలతో కలిసి అసభ్యకర డ్యాన్సులు! ఏపీ బీజేపీ ఆఫీసులో రచ్చ రంభోలా.. 

అది కాలేజీ స్టూడెంట్స్ ఫంక్షన్ కాదు.. పాత విద్యార్థులంతా చాలా రోజుల తర్వాత సరదాగా కలుసుకుని ఆడి పాడే పార్టీ కూడా కాదు. అయినా అక్కడ అంతా చిందులేశారు. అది కూడా ఎప్పుడు సంప్రదాయం, సంస్కృతి అని మాట్లాడే పార్టీ కార్యాలయంలోనే ఇది జరిగింది. గౌరవ మర్యాదలు, దేశభక్తి గుర్తించి జనాలకు గొప్పగా లెక్చర్లు ఇచ్చే పార్టీ ఆఫీసులో తీన్మార్ స్టెప్పులు వేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా రాజకీయ పార్టీ ఆఫీసుల్లో కేక్ కటింగులు ఇప్పుడు కామన్ గా మారాయి. అందులో భాగంగా ఏపీ బీజేపీకి చెందిన విజయవాడ పార్టీ ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంతోషంలో పాత పాటల్ని ప్లే చేశారు. ఒకప్పటి సూపర్ హిట్ పాట.. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ను ప్లే చేశారు. పార్టీ ఆఫీసులో ఆ పాట ప్లే చేయడమే సరికాదంటే.. ఆ తర్వాత మరో అరాచకం జరిగింది. కమలం నేతలు ఆ పాటకు వేదిక మీద డ్యాన్సులు వేశారు. మహిళా నేత ఒకరు బీజేపీ నేతతో కలిసి తీన్మార్ స్టెపుల్లేసింది. ఒక జాతీయ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు ఇలా పాటలకు పార్టీ కార్యాలయంలో స్టెప్పులు వేస్తున్న వీడియోను చూసి జనాలు విస్తుపోతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నాయకుల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. 50 రూపాయలకే లిక్కర్‌ అందిస్తామని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన నవ్వులపాలైంది. వీర్రాజు ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వివాదం కొనసాగుతుండానే తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హంగామాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

వివేకా కేసులో సీబీఐకి షర్మిల సాక్ష్యం! వైఎస్ భారతీ జగన్ రెడ్డి బుక్కైనట్టేనా? 

2022 సంవత్సరంలో ఏపీ సీఎంకు చుక్కలు కనిపించబోతున్నాయా? జగన్ రెడ్డి పదవికి గండమేనా? అంటే వైసీపీ వర్గాల నుంచే అవుననే సమాధానమే వస్తోంది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు జగన్ హాజరుకావాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలుంటాయి. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వ్యతిరేక తీర్పు వచ్చినా జగన్ పదవికి గండమే. ఒకవేళ హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు ఎంపీ రఘురామ. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరమే.  ఇక వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అంటున్నారు. ఫ్యామిలీలో జగన్ ఒంటరి అయ్యారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయకు వెళ్లిన జగన్... కుటుంబంతో కాకుండా సింగిల్ గానే వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ కూడా ఆయనతో కనిపించలేదు. ఇడుపుల పాయ గెస్ట్ హౌజ్ లో జగన్ తో షర్మిల గొడవ పడ్డారని, రాత్రికి రాత్రే అక్కడినుంచి వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఆస్తి విషయంలో కొన్ని రోజులుగా జగన్ తో గొడవ పడుతున్న షర్మిల.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందుకే అన్న సంగతి తేలుస్తానంటూ ఆమె శపథం చేస్తుందని తెలుస్తోంది. షర్మిలకు తల్లి విజయమ్మతో పాటు వైఎస్ కుటుంబం మద్దతు ఉందని అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ను ఫిక్స్ చేసే అవకాశం షర్మిలకు లభించిందని తెలుస్తోంది. ఈ కేసులో ఆమెను సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని సమాచారం. వివేకా హత్య కేసులోకి భారతీరెడ్డిని షర్మిల లాగేసిందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. భారతీరెడ్డికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలను సీబీఐకి చెప్పేందుకు షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.నదీంతో  వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందుూ, జగన్ అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశ ఉందంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం త్వరలోనే తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. ఈడీ కేసుల్లో తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన తర్వాత సీఎం చాయిస్‌గా భారతీరెడ్డిని జగన్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె జోక్యం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే షర్మిలకు మాత్రం ఇది ఇష్టం లేదట. అందుకే ఆమె భారతీరెడ్డిది కాదని సీఎం జగన్ తల్లి విజయలక్ష్మికి తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. జగన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారతీరెడ్డికి చాన్స్ ఇవ్వకూడదని తల్లి విజయలక్ష్మికే అవకాశం ఇవ్వాలని షర్మిల పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే వివేకా హత్య కేసులో భారతీ రెడ్డిని ఇరికించేలా షర్మిల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఏపీలో సంచనలం జరగడంతో పాటు వైఎస్ కుటుంబంలోనూ కీలక పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2022లో జగన్ రెడ్డికి చిక్కులు తప్పవనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. 

మోడీ, అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి జగన్.. ఆ ఎన్నికల కోసమేనా? 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని నూతన సంవత్సం రోజున ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తుల పైనా ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించిన మరుసటి రోజే చంద్రబాబు ముందస్తు ఎన్నికల మాట మాట్లాడటం చర్చగా మారింది. ఈ ఈ సమయంలో సడెన్ గా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుండటం మరింత ఆసక్తిగా మారింది.  సోమవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారని సమాచారం. ఏపీ పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు..అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారో వివరించి.. వాటిని సాధించుకొనే క్రమంలో ఈ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. భారీ వర్షాలు - వరదల కారణంగా ఏపీలోని మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి. దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిట్లింది.అయితే రెండు రోజుల క్రితం కేంద్రం వరదల కారణంగా నష్టపోయిన ఇతర రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఏపీ ఊసెత్తలేదు. ప్రధాని హామీ ఇచ్చారని .. సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా స్పందన లేదు. ఈ అంశం పైనా సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.  గత నెలలో తిరుపతి వచ్చిన అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అమరావతి సహా కీలక అంశాలపై ఆ సమావేశం చర్చ జరిగిందని ప్రచారం జరిగింది. ఆ సమావేశం తరువాత కొద్ది రోజులకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంది. అమరావతికి మద్దతుగా బీజేపీ సైతం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్దిక పరిస్థితులతో పాటు పోలవరం, మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్.. కేంద్రంలోని ముఖ్యులతో చర్చిస్తారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల పై ప్రచార వేళ తాజాగా  నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఈ అంశం పైన సీఎం చర్చించే అవకాశం ఉంది.  రాజకీయ అంశాల పైన సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని స్వయంగా అమిత్ షా ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలో జమిలి ఎన్నికల పైనా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికల అంశం పైన అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మద్దతు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలతో పాటు జమిలి ఎన్నికలపై కేంద్రం పెద్దలతో జగన్ మాట్లాడవచ్చని అంటున్నారు. ఉక త్వరలో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఆ ఎన్నికలకు అభ్యర్ధులను నిలబెట్టే అంశం పైన తమతో సఖ్యతగా ఉన్న పార్టీల నేతలతో కేంద్రంలోని ముఖ్య నేతలు సంప్రదింపులు ప్రారంభించారు. ఇదే అంశం పైన సీఎం జగన్ తోనూ వారు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

వంగవీటి ఎపిసోడ్ లో  వైసీపీకి షాక్..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో రాజకీయ పండితులకు సైతం ఉహకు అందడం లేదని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పొలిటికల్ టెంపరేచర్లు పెంచేస్తోంది. ఓ వంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముందస్తుకు మేము రెడీ, అంటూ ప్రకటించారు. మరోవంక బీజేపీ నాయకులు వివాదస్పద వ్యాఖ్యలతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వంక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, బీజేపీ పొత్తు విషయంలో స్పష్టత ఇస్తూనే సందేహాలకూ అవకాశం కలిపోస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.   ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, రాష్ట్రంలో రాజకీయ, కుల సమీకరణలలో మార్పుకు సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రధాన అధికార అధిపత్య కులాలలో, సంఖ్యాపరంగా ప్రధమ స్థానంలో,   అధికార పదవుల్లో అట్టడుగు స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది. ఇతర బీసీకులాలను కలుపుకుని,ముదుకు సాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్ని పార్టీలలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు ఏకమయ్యే లేదా ఏకంచేసే ప్రయత్నాలు మరో మారు తెరమీదకు వచ్చాయి.అయితే, పీరియాడికల్’గా పుష్కరానికోసారి లేదా పదేళ్ళకోమారు కాపుల్లో ‘టెంపరరీ’ చైతన్యం రావడం, ఆ తర్వాత సర్దుకు పోవడం చూస్తూనే ఉన్నామని, అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి.   అయితే,రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు వైసీపీ, తెలుగు దేశం కాపు ఓటును తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం టాక్ అఫ్ ది స్టేట్’ గా చర్చ జరుగతున్న వంగవీటి రాధా ‘ రెక్కి’  వ్యహరంలో ఇటు వైసీపీ, అటు తెలుగు దేశం పార్టీలు, చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. రాధా తండ్రి రంగాకు కాపు సామాజిక వర్గంలో ఈనాటికీ ఉన్న పట్టును  సొంతం  చేసుకునేందుకు, వైసీపీ, తెలుగు దేశం ...పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈపోటీలో వైసీపీ ముందడుగు వేసినా, నేరుగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో,సీన్ రివర్స్ అయిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. మంత్రి  కొడాలి నానీ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమకు వంగవీటి రాధాతో ఉన్నా వ్యక్తిగత స్నేహాన్ని ఉపయోగించుకుని ఆయన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో కలసి పాల్గొన్నారు. అయితే అదే సభలో రాధా తన హత్యకోసం రెక్కీ జరిగిందని సంచలన కామెంట్లు చేయడంతో.. కథ కొత్తమలుపు తిరిగింది. విషయం ముఖ్యమంత్రి కోర్టుకు చేరింది. మంత్రి నాని చొరవతోనే కావచ్చు ముఖ్యమంత్రి రాధాకు గన్ మెన్ల సంఖ్యను పెంచేలా సీఎం ఆదేశాలిచ్చారు. అయితే రాధా తనకు గన్ మెన్లు వద్దని తిప్పి పంపించేశారు. మరో వంక రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది వైసీపీ కీలక నేత  అనుచరుడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు, వ్యూహాత్మకంగా పావులు కదిపి, రాధా తెలుగు దేశం పార్టీ వీడి వైసీపీలోకి వాలుతున్నారు అనే పుకార్లకు బ్రేక్ వేశారు. ముందు రాధాతో  ఫోనులో మాట్లాడారు ... అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాధ  ఇంటివద్ద రెక్కీ’ నిర్వహించిన వారిపై  చర్యలు తీసుకోవాలని నేరుగా డీజీపీకి లేఖ రాశారు. చివరకు రాధా ఇంటికి వెళ్లి రెక్కీ వ్యవహరం పూర్వా పరాలు అన్నీ తెలుసుకున్నారు. రెక్కీ చేసినవారెవరో తేల్చాలని, వారిని అరెస్ట్ చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో  పార్టీలో రాధా రాజకీయ భవిష్యత్’కు సంబంధించి గట్టి హమీ ఇచ్చారని తెలుస్తోంది.  పార్టీలో ఆయనకు కచ్చితంగా గౌరవం ఉంటుందని.. బాధ్యతలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి కీలక పదవిపై కూడా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అధినేత స్వయంగా వచ్చి హామి ఇవ్వడంతో వంగవీటి రాధా ఇక టీడీపీని వీడే అవకాశం లేనట్టే..అంటున్నారు. దీంతో, రాధా ఎపిసోడ్’లో చంద్రబాబు పైచేయి సాధించారు.     

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. మంత్రి బొత్స కాళ్లు మొక్కిన ఐఏఎస్

అధికారులు దిగజారిపోతున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నామన్న విషయాన్ని మర్చి చిల్లరగా వ్యవహరిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేంటంటూ.. కార్యకర్తల్ని మించి నేతల పట్ల భక్తి చాటుకుంటున్నారు. తాజాగా గౌరవప్రదమైన స్థానంలో  ఓ ఐఏఎస్ అధికారి ఉన్న దిగజారి వ్యవహరించాడు. ఓపెన్ గానే ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కాడు. సదరు సివిల్ సర్వెంట్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  వివరాల్లోకి వెళితే ఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం వివాదాస్పదమైంది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిశోర్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు. అంతకుముందు మంత్రికి విషెస్ చెప్పిన జేసీ దఫేదారు సంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్పగా.. ఓ అత్యున్నత అధికారి అయి ఉండి జేసీ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిస్వార్ధంగా ఉండే ఐఏఎస్‌లు ఇలా మంత్రులకి భజన చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీడర్‌ పుట్టిన రోజు వేడుకల్లో కేడర్‌ హడావుడి చేయడం మామూలే. అయితే ఇప్పుడా పని పోలీసులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కడపజిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి బర్త్ డే వేడుకలు గత నెల 20న జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తల్లా మారిపోయారు. ఎమ్మెల్యేకి బొకేలు ఇచ్చి అభిమానాన్ని, దండలు వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. నిజానికి ఇక్కడెవరూ కార్యకర్తలు లేరు. అన్నీ తామై నడిపించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోలీసుల అత్యుత్సాహం పీక్‌కి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తండ్రి రామస్వామిని ఘనంగా సన్మానించారు. ఏ ప్రొటోకాల్‌ లేని రామస్వామికి సీఐ, ఎస్సైలు సెల్యూట్‌ చేశారు. దండలు వేసి, ఫ్లవర్‌ బొకేలు ఇచ్చి ఎమ్మెల్యే ఫాదర్‌ని ఫిదా చేశారు. కేక్ కటింగ్‌ చేసి వీర విధేయత ప్రదర్శించారు.

ప్రశ్నిస్తే వైసీపీ నేతలను వదలరా! పెద్దిరెడ్డి ఇలాఖాలో జడ్పీటీసీ భర్త అరెస్ట్..

మూడు కేసులు... ఆరు అరెస్టులు. ఏపీలోని జగన్ రెడ్డి పాలన గురించి అడిగితే జనాల నుంచి వస్తున్న సమాధానం ఇది. జగన్ పాలనలో ప్రశ్నించడమే పాపంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా, జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన పోలీసులు కేసులు పెడుతున్నారు. ఏ అర్ధరాత్రి పూటే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికే వందలాది మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ సామాన్య కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులను కూడా వదల్లేదు. అయితే తాజాగా ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలే కాదు... సొంత పార్టీ నేతలను వదలడం లేదు. ఇటీవలే ఇద్దరు వైసీపీ మంత్రు తీరుపై కామెంట్లు చేసిన సుబ్బారావు గుప్తాపై మంత్రి అనుచరుడు దాడి చేయడం దుమారం రేపింది. తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లిపల్లి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ భర్తను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.  చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై గీతారెడ్డి అనే జడ్పీటీసీ భర్త కొండ్రెడ్డి తిరుగుబాటు చేశారు. ఆయన నియోజకవర్గంలో తాలిబన్ పాలన చేస్తున్నారని… పెద్దిరెడ్డి అనుచరులు ఆడవాళ్లను చెరపడుతున్నారని.. తప్పుడు కేసులతో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత ఏం జరిగిందో కానీ చిత్తూరు జిల్లా పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఓ నొటోరియస్ క్రిమినల్‌ను పట్టుకున్నామని … మీడియా సమావేశం పెట్టి వివరాలు చెబుతామన్నారు. అందరూ వెళ్లారు. ముసుగు వేసిన ఓ వ్యక్తిని నిలబెట్టి.. అతని చుట్టూ ముగ్గురు పోలీసుల్ని నిలబెట్టారు. ఇద్దరు అధికారులు కూర్చుని వివరాలు చెప్పారు. అతని పేరు మద్దిరెడ్డి కొండ్రెడ్డి అని చెప్పే సరికి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు.  ఎప్పుడో 1996నుంచి కొండ్రెడ్డిపై చాలా కేసులు నమోదయ్యాయని 2008లో ఇళ్ల పట్టాల పేరుతో ఏడుగుర్ని మోసం చేశారన్న కేసులు నమోదయ్యాయని అందుకే రాత్రికి రాత్రి విచారణ జరిపి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఎప్పటి కేసులో ఇప్పుడు చూపించి.. ఇంత అవమానకరంగా అరెస్ట్ చూపించిన ఆ క్రిమినల్… వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన ఆ నేత ఒక్కరే. ఆయనే కొండ్రెడ్డి. సొంత పార్టీ అని .. కనీసం సొంత సామాజికవర్గం అని కూడా చూడకుండా తాలిబన్ పాలన ఎలా ఉంటుందో చూపించారనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల్ని వాడుకుని రాజకీయం చేయడంలో పెద్దిరెడ్డి సోదరులు ఎలా వ్యవహరిస్తారో ఇదే అతి పెద్ద ఉదాహరణ అని చిత్తూరు జిల్లా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సుబ్బారావు గుప్తా.. ఇవాళ కొండ్రెడ్డి. ఎవరైనా సరే వైసీపీని విమర్శిస్తే సహించే ప్రశ్నే లేదని సందేశం పంపించేరని అంటున్నారు. 

నిమిషానికి 18 వేల ఫుడ్ ఆర్డర్లు.. స్విగ్గీ, జోమాటో ఆల్ టైమ్ రికార్డ్

కొత్త సంవత్సరం సంబరాల్లో ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్‎ల పంట పండింది. ఒమిక్రాన్ భయంతో ఈసారి చాలా మంది ఇళ్లలోనే సంబురాలు జరుపుకున్నారు. హోటళ్ల నుంచి తమకు ఇష్టమైన వంటకాలను తెప్పించుకున్నారు. దీంతో స్విగ్గీ, జోమాటోకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం  నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. స్విగ్గీ యాప్‌కు నిమిషానికి 9వేల డెలివరీలు రాగా.. జొమాటోకు నిమిషానికి 8వేల పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయా కంపెనీలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా 2 మిలియన్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గతేడాది స్విగ్గీకి నిమిషానికి 5500 ఆర్డర్లు రాగా ఇప్పుడు ఆ సంఖ్య 9049కి పెరిగింది. అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా ఎప్పటిలానే బిర్యానీ నిలిచిందని స్విగ్గీ వెల్లడించింది. నిమిషానికి 1229 బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. చికెన్‌ బిర్యానీ, బటర్‌ నాన్‌, మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌కు తర్వాత అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. జొమాటోలోనూ ఆర్డర్ల జోరు కొనసాగింది. నూతన సంవత్సరం వేళ ఈ యాప్‌ నుంచి కూడా 20లక్షలకు పైగా మంది ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్నారని ఆ కంపెనీ తెలిపింది. నిమిషానికి 8000లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఒక రోజులో 20లక్షలకు పైగా ఆర్డర్లు రావడం ఇదే తొలిసారి అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్ ట్విటర్‌ వేదికగా తెలిపారు

12 ఏళ్ల లోపు చిన్నారులకు ఫ్రీ! త్వరలో ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలు నష్టాల్లో పని చేస్తున్నాయి. లాభాల పట్టేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే నూతన సంవత్సరంలో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోంది. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1 నాడు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు శాశ్వత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కుతారని వివరించారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ ఆక్యుపెన్సీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ చేసే అవకాశం కల్పించాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయిందని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు. 

రాధాపై రెక్కీ చేసిందెవరు? అసలు దోషులను తప్పిస్తున్నారా?

తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన ప్రకటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాధా ప్రకటనతో బెజవాడలో అలజడి రేగగా.. రాధా కార్యాలయంలో సమీపంలో అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండటం మరింత కలకలం  రేపింది. దీంతో వంగవీటిపై ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాధాపై రెక్కీ నిర్వహించారంటూ పలువురిపై ప్రచారం జరుగుతోంది. విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న నేతపై ఆరోపణలు వచ్చాయి.  వంగవీటి రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాపై రెక్కీ జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. రాధాతో మాట్లాడి రెక్కీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని పేర్కొన్నారు. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు చంద్రబాబు. "రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంలేదు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదు" అని స్పష్టం చేశారు  రాధా హత్యకు రెక్కీపై చంద్రబాబు ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.  

ఒమిక్రాన్‌ ను ఉపేక్షిస్తే మూల్యం తప్పుదు

దేశంలో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. థర్డ్ వేవ్ వచ్చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే, అధికారికంగా ప్రకటించక పోయినా, థర్డ్ వేవ్ వచ్చినట్లేనని, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య వేగంగా పరుగులు తీస్తోంది. కేసులే కాదు, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే  వుంది. పాత సంవత్సరం పోతూ పోతూ చివరి రోజు దేశవ్యాప్తంగా  400 పైగా పైగా  కొవిడ్  రోగుల ప్రాణాలను పట్టుకు పోయింది. అదే రోజున  22వేలకు పైగా కొత్త కేసుల పెరిగాయి, 400 మందికి పైగా మరణించారు. అలాగే, క్రితం రోజుతో పోలిస్తే  డిసెంబర్ 31న ఓమిక్రాన్ కేసులు దాదాపు 200 పెరిగాయి. మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1431కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా.. డిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా ఒమిక్రాన్‌ ఉదృతిని గమనించిన దాఖలాలు కన్పించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరుగానున్న ఐదు రాష్ట్రాల్లో పీఎం మొదలు ప్రియంకా వాద్రావరకు ప్రతి ప్రముఖ నాయకుడు, నాయకురాలు ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పెళ్ళికి, చావుకు ఇంత మంది మించి హాజరు కారాదని ఆంక్షలు విధించిన నాయకులు, అధికారులు రాజకీయ పార్టీల ర్యాలీలకు వేలమంది కాదు, లక్షల మంది పాల్గొన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే కాదు, ప్రజలు కూడా ఇంటింటా విషాదాన్ని నిమ్పిన్ సెకండ్ వేవ్’ని అప్పుడే మరిచి పోయారా, అన్నట్లుగా కనీసం ముఖానికి మాస్క్ అయినా లేకుండా  విచ్చల విడిగా విహార యాత్రలు చేస్తున్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు.  ‘కొత్త సంవత్సరం తొలి పొద్దున్న జమ్ముకశ్మీర్‌లో మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓ వంక వైరస్ పంజా విసురుతున్న సమయంలో, భౌతిక దూరం అమలులో ఉన్న వేళ దేవాలయంలో  తొక్కిసలాట జరిగి ఏకంగా 12మంది చనిపోయారు. మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. దేశంలో ఫై నుంచి క్రింది వరకు నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఏ స్థాయికి చేరిందో తెలుసుకునేందుకు ఈ విషాద ఒక్కటి చాలని పిస్తోంది. సాధరణ పరిస్థితిలో తొక్కిసలాట జరిగిందంటే కొంత వరకు  అర్థం చేసుకోవచ్చును. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ ఉరుముతున్న సమయంలో తొక్కిసలాట జరగటం, జరిగిన విషాద సంఘటన కంటే చాలా చాలా విషాదం. ఇదొకటే కాదు, కొత్త సంవత్సరం సందర్భంగా దేశ వ్యాప్తంగా పబ్బులు, క్లబ్బులు, బార్లు కిటకిటలాడి పోయాయి.ఈ ప్రభావం ఏమిటో ... ఒమిక్రాన్ కేసులు ఏమేరకు పెరుగుతాయో ముందు ముందు గానీ తెలియదు.   అన్ని జాగ్రత్తలు తీసుకుని మొత్తం సభ్యుల్లో సగం మంది కూడా సభకు హాజరు కాకపోయినా, ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందుకే కావచ్చు మహారాష్ట్ర ప్రభుత్వం, చేతులు కాలిన తర్వాత  న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఇంకా చేతులు అంతగా కాలని, తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆంక్షలను కూడా తీసేసి ‘ఎంజాయ్’ చేయమంది.అదెలా, ఉన్నా ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చిందని, ఇంకా ఉపేక్ష వహిస్తే అందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు 

వైసీపీలో పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తున్నకోవర్టులున్నారా? ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్దుల గెలుపు కోసం పనిచేసిన నాయకులు ఇంకా పార్టీలోనే కొనసాగుతూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారా? అంటే, పార్టీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు జిల్లా నగిరి శాసన సభ్యురాలు ఆర్కే రోజా అవుననే అంటున్నారు. అంతే కాదు, పార్టీలో కోవర్టులుగా పనిచేస్తున్న వారు, అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దేబ్బతీస్తున్నారని, ఆమె ఆరోపిస్తున్నారు. ఇలాంటి కోవర్టుల వలన పార్టీ, ప్రభుత్వంతో పాటు స్థానిక మంత్రికి కూడా చెడ్డపేరు వస్తోందని అలాంటి కోవర్టులపై చర్యలు తీసుకోవాలని, ఆమె, పార్టీకి కాకుండా, ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికీ నగరి నియోజక వర్గం వైకాపాలో రచ్చరచ్చగా మారిన విబేధాలు ఇప్పుడు మరింత భగ్గు మంటున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. నిన్న (శుక్రవారం) వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోజా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో మీడియా మాట్లాడారు. సహజంగా పార్టీలో కోవర్ట్ ఆక్టివిటీ జరుగుతున్నా, లేదా  నాయకుల మధ్య అంతర్గత విబేధాలుంటే, పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారు. కానీ, రోజా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఫిర్యాదులో కానీ, ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మట్లాడిన సందర్భంలో కానీ, ఎక్కడా ఆమె ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేరును మాత్రం  ప్రస్తావించారు. కోవర్టుల వలన పార్టీ, ప్రభుత్వంతో పాటు స్థానిక మంత్రి (పెద్దిరెడ్డి)కి కూడా చెడ్డపేరు వస్తోందని, ఫిర్యాదులో పేర్కొన్న రోజా, తాను, తన కుటుంబ సభ్యులు అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నామని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న కోవర్టులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే, నగరి నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఇది వరకే మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశామని, మరోసారి మంత్రిని కలిసి వివరిస్తామని రోజా తెలిపారు.  నిజానికి, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో, పెద్దిరెడ్డి రామచండ్రా రెడ్డికి, ఎమ్మెల్యే రోజాకు మధ్య విభేదాలున్న విషయం జగమెరిగిన సత్యం. నియోజక వర్గంలో రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే కుమార్‌ వర్గానికి మంత్రి మద్దతు ఉందనేది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను రెండు వర్గాలు పోటాపోటీగా నిర్వాహించాయి. ఒకరి ఫెక్సీలు ఒకరు చించుకున్నారు. ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భంగా ఒకరి నొకరు మీడియా ముందు దూషించుకున్నారు. రోజా ప్రత్యర్ధి వర్గం ఫ్లెక్సీలో మంత్రి రామచంద్రా రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారు. ఇటీవల కేజే కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని కలిశారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా స్మగ్లింగ్ పై ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు తెలుస్తోంది.ఈనేపధ్యంలో రోజా పోలీసులకు ఫిర్యదు చేయడం పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ చేయడంతో, నగరి నియోజక వర్గం వైసీపీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్ల్యే వార్ పతాక స్థాయికి చేరిందని అనుకోవచ్చని అంటున్నారు.