సార్లు కావాలి సార్.. ఏపీలో రోడ్డెక్కిన విద్యార్ధులు
posted on Jan 1, 2022 @ 1:58PM
వైసీపీ ప్రభుత్వం సర్కారీ స్కూల్స్’కు రంగులు బానే అద్దింది .. నాడు నేడు’ అనీ ఇంకొకటని మేకప్పులు చేసింది. అలాగే, ప్రాధమిక స్థాయినుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి తెలుగు పిల్లలు తెలుగు మరిచి పోయి ఇంగ్లీష్’లో మాట్లాడేలా చేస్తామని ఆశలు రేపింది. పిల్లలలను చదివించే తల్లులకు సంవత్సరానికి పిల్లాడికి రూ.15000 వంతున ఇచ్చే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది. సరే, ఆ పథకం ఎంత సుందర ముదనష్టంగా అమలవుతోంది చెప్పనే అక్కర లేదు. అది వేరే విషయం. అదలా ఉంటే, ఇప్పుడు సర్కారీ బడుల్లో చదువుతున్న పిల్లలు, పంతుళ్ళు కావాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలుచేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ‘టీచర్లను నియమించండి, క్లాసులు నిర్వహించండి’ అని తల్లి తండ్రులు ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నారు. సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఆ స్థాయికి చేరింది.
వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది అయినా ఇంత వరకు సింగిల్ టీచర్ నియామకం కూడా జరగలేదు. 2018 లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీనే చివరి డీఎస్సీ.ఆ తర్వాత ఈ రెండున్నర మూడేళ్ళ కాలంలో డీఎస్సీ లేదు. ఉపాధ్యాయ నియామకాలు లేవు. పదవీ విరమణలే గానీ.. కొత్త నియామకాలు జరగనే లేదు. అనేక చోట్ల ఒకే ఒక్క ఉపాధ్యాయుడు నాలుగైదు తరగతులను నెట్టుకొస్తున్నారు. అంతే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వం, దేశంలోనే ‘డిస్టిక్షన్’ కూడా సాధించింది. దేశం మొత్తం మీద ‘సింగిల్ టీచర్’ స్కూల్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఏపీ సెకండ్ ప్లేస్’లో ఉంది.
రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ని మొత్తం స్కూల్స్’లో 18.94 శాతం ‘సింగిల్ టీచర్’ స్కూల్స్ ఉన్నాయి. ఇండి జాతీయ సగటు(6.80%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అరుణాచల్‌ప్రదేశ్ (21.85 శాతం) తర్వాత అత్యధిక ‘సింగిల్ టీచర్’ స్కూల్స్ ఉన్న స్టేట్ ఏపీ. నూతన విద్యా విధానం ప్రకారం 250 మీటర్ల దూరంలోని 2,663 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వీటిలో సగానికిపైగా ఏకోపాధ్యాయ బడులే. దీంతో ఇక్కడి నుంచి పిల్లలే తప్ప ఉపాధ్యాయులు రావడం లేదు. ఫలితంగా హైస్కూళ్లపై ఒత్తిడి పెరుగుతోంది.
నిజానికి, వైసీపీ ప్రభుత్వం గడచిన రెండున్నర సంవత్సరాలలో అన్నివ్యవస్థలను ఒకలానే చూసింది అన్ని వ్యవస్థలను సమానంగానే నాశనం చేసింది. అందుకు విద్యావ్యవస్థ మినహాయింపు కాదు. అందుకే, ప్రాధమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన విధానం మొదలు అమ్మఒడి వరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, అనాలోచిత నిర్ణయమే అంటున్నారు విద్యారంగ నిపుణులు. ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఉపాధాయులు లేక ఇంగ్లీష్ మీడియం విధ్యార్ధులను తెలుగు మీడియం విధ్యార్ధులతో కలిపేశారు. దీంతో విద్యార్ధుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైందని విద్యార్ధులు , ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు వాపోతున్నారు. ముందస్తు ప్రణాలిక ప్రాధాన్యతలు తెలియకుండా విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, దేవుడులేని గుళ్ళు..ఒకటే. కానీ, ఏపీలో అదే పరిస్థితి వుందని, అంటున్నారు.