హ్యాంగోవర్ అయిందా.. అయితే ఇలా చేయండి!
posted on Jan 1, 2022 7:58AM
న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారా.. రాత్రంతా ఫుల్లుగా మందు తాగి చిందేశారా.. ఉదయం లేవగానే తల పట్టేసిందా... ఫుల్లుగా లిక్కర్ తాగిన వాళ్లకు ఇది కామన్. దాన్నే మనం హ్యాంగోవర్ అని కూడా అంటాం. ఎక్కువ తాగేసిన ప్రతిసారి ఈ హ్యాంగోవర్ సమస్య తప్పదు. తలనొప్పి, దాహం, గొంతు ఎండిపోవడం, అలసట, వాంతులు, వికారం ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే. మీరు అతిగా తాగి హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి ఉపశమనం లభిస్తుంది.
మద్యం శరీరంలో ఉన్న నీటిశాతాన్ని పీల్చేస్తుంది. అందుకే తలనొప్పి, వికారం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజంతా మంచినీళ్లు తాగితే.. హ్యాంగోవర్ వల్ల వచ్చిన డీహైడ్రేషన్ తగ్గిపోతుంది.అరటి, పీనట్ బటర్, మామిడి, పాస్తా, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తీసుకుంటే రక్తంలో.. ఆల్కహాల్ నెమ్మదిగా కరుగుతుంది. నిమ్మకాయ రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు.. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నిమ్మరసం తాగితే హ్యాంగోవర్ తగ్గుతుంది. తేనెలోని ఫ్రక్టోజ్ బాడీ నుంచి ఆల్కహాల్ ను తొందరగా బయటకు పంపేలా చేస్తుంది. హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు తేనే తీసుకోండి.
మీ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు ఉండేలా జాగ్రత్త పడండి. ప్రోటీన్‌లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి తొందరగా బయట పడొచ్చు. చాలామంది ముల్లును ముల్లుతోనే తీయాలన్న ట్రెండ్ ఫాలో అవుతూ.. ఉదయాన్నే హ్యాంగోవర్ పెగ్ తాగితే తలనొప్పి తగ్గుతుందనుకుంటారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. పైగా.. మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడంలో విటమిన్-సి బాగా పనిచేస్తుంది. హ్యాంగోవర్ తో సతమతమవుతున్నప్పుడు ఆరెంజ్, నిమ్మ జ్యూస్ తీసుకోండి. ఇది కాలేయం మీద ఆల్కహాల్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్కహాల్ తాగే ముందు ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తింటే చాలావరకు హ్యాంగోవర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.