అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, బార్లు ఓపెన్.. కేసీఆర్ బాటలో జగన్ లిక్కర్ స్కీమ్
posted on Dec 31, 2021 @ 2:55PM
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి కనిపిస్తొంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు జనాలు సిద్ధమవుతున్నాయి. మందుబాబుల హడావుడి అయితే మాములుగా లేదు. అయితే కొవిడ్ ఆంక్షలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. తాగినోడికి తాగినంత మందు దొరుకుతుందా లేదా అన్న భయాలు కొందరిలో ఉన్నాయి. అయితే అలాంటి మందుబాబులకు గుడ్ న్యూస్ చేసింది వైసీపీ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా ఏపీలో బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్.
వైన్ షాపులు, బార్ల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రెగ్యులర్ సమయం కంటే మరో గంటసేపు సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ తో పాటు, పర్యాటక లైసెన్సులు పొందిన హోటళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతిని ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి నిచ్చింది. ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు డిసెంబర్ 31 నుంచి చేపట్టింది.ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు12 వందలు దాటేశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కొత్త వేరియంట్ విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో కఠిన ఆంక్షలు విధించాయి. చాలా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. ఢిల్లీ సర్కార్ ఏకంగా సినిమా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. కేరళ సర్కార్ కూడా న్యూఇయర్ వేడుకలపై నిఘా పెట్టింది.
అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మద్యం అమ్మకాల వేళలు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవడంపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాగినోళ్లకి తాగినంత మందు అందుబాటులో ఉంచడమే జగన్ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఒమిక్రాన్ భయపెడుతున్నా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమైన్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు.