నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. మంత్రి బొత్స కాళ్లు మొక్కిన ఐఏఎస్
posted on Jan 2, 2022 @ 11:41AM
అధికారులు దిగజారిపోతున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నామన్న విషయాన్ని మర్చి చిల్లరగా వ్యవహరిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేంటంటూ.. కార్యకర్తల్ని మించి నేతల పట్ల భక్తి చాటుకుంటున్నారు. తాజాగా గౌరవప్రదమైన స్థానంలో ఓ ఐఏఎస్ అధికారి ఉన్న దిగజారి వ్యవహరించాడు. ఓపెన్ గానే ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కాడు. సదరు సివిల్ సర్వెంట్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం వివాదాస్పదమైంది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిశోర్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు. అంతకుముందు మంత్రికి విషెస్ చెప్పిన జేసీ దఫేదారు సంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్పగా.. ఓ అత్యున్నత అధికారి అయి ఉండి జేసీ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిస్వార్ధంగా ఉండే ఐఏఎస్‌లు ఇలా మంత్రులకి భజన చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీడర్ పుట్టిన రోజు వేడుకల్లో కేడర్ హడావుడి చేయడం మామూలే. అయితే ఇప్పుడా పని పోలీసులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కడపజిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బర్త్ డే వేడుకలు గత నెల 20న జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తల్లా మారిపోయారు. ఎమ్మెల్యేకి బొకేలు ఇచ్చి అభిమానాన్ని, దండలు వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. నిజానికి ఇక్కడెవరూ కార్యకర్తలు లేరు. అన్నీ తామై నడిపించారు పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోలీసుల అత్యుత్సాహం పీక్‌కి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తండ్రి రామస్వామిని ఘనంగా సన్మానించారు. ఏ ప్రొటోకాల్ లేని రామస్వామికి సీఐ, ఎస్సైలు సెల్యూట్ చేశారు. దండలు వేసి, ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఎమ్మెల్యే ఫాదర్‌ని ఫిదా చేశారు. కేక్ కటింగ్ చేసి వీర విధేయత ప్రదర్శించారు.