రాధాపై రెక్కీ చేసిందెవరు? అసలు దోషులను తప్పిస్తున్నారా?
posted on Jan 1, 2022 @ 6:59PM
తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన ప్రకటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాధా ప్రకటనతో బెజవాడలో అలజడి రేగగా.. రాధా కార్యాలయంలో సమీపంలో అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండటం మరింత కలకలం రేపింది. దీంతో వంగవీటిపై ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాధాపై రెక్కీ నిర్వహించారంటూ పలువురిపై ప్రచారం జరుగుతోంది. విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న నేతపై ఆరోపణలు వచ్చాయి.
వంగవీటి రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాపై రెక్కీ జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. రాధాతో మాట్లాడి రెక్కీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని పేర్కొన్నారు.
పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు చంద్రబాబు. "రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంలేదు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదు" అని స్పష్టం చేశారు రాధా హత్యకు రెక్కీపై చంద్రబాబు ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.