వంగవీటి ఎపిసోడ్ లో వైసీపీకి షాక్..
posted on Jan 2, 2022 @ 11:41AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో రాజకీయ పండితులకు సైతం ఉహకు అందడం లేదని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పొలిటికల్ టెంపరేచర్లు పెంచేస్తోంది. ఓ వంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముందస్తుకు మేము రెడీ, అంటూ ప్రకటించారు. మరోవంక బీజేపీ నాయకులు వివాదస్పద వ్యాఖ్యలతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వంక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, బీజేపీ పొత్తు విషయంలో స్పష్టత ఇస్తూనే సందేహాలకూ అవకాశం కలిపోస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, రాష్ట్రంలో రాజకీయ, కుల సమీకరణలలో మార్పుకు సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రధాన అధికార అధిపత్య కులాలలో, సంఖ్యాపరంగా ప్రధమ స్థానంలో, అధికార పదవుల్లో అట్టడుగు స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది. ఇతర బీసీకులాలను కలుపుకుని,ముదుకు సాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్ని పార్టీలలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులు ఏకమయ్యే లేదా ఏకంచేసే ప్రయత్నాలు మరో మారు తెరమీదకు వచ్చాయి.అయితే, పీరియాడికల్’గా పుష్కరానికోసారి లేదా పదేళ్ళకోమారు కాపుల్లో ‘టెంపరరీ’ చైతన్యం రావడం, ఆ తర్వాత సర్దుకు పోవడం చూస్తూనే ఉన్నామని, అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి.
అయితే,రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు వైసీపీ, తెలుగు దేశం కాపు ఓటును తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుతం టాక్ అఫ్ ది స్టేట్’ గా చర్చ జరుగతున్న వంగవీటి రాధా ‘ రెక్కి’ వ్యహరంలో ఇటు వైసీపీ, అటు తెలుగు దేశం పార్టీలు, చాకచక్యంగా పావులు కదుపుతున్నాయి. రాధా తండ్రి రంగాకు కాపు సామాజిక వర్గంలో ఈనాటికీ ఉన్న పట్టును సొంతం చేసుకునేందుకు, వైసీపీ, తెలుగు దేశం ...పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈపోటీలో వైసీపీ ముందడుగు వేసినా, నేరుగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో,సీన్ రివర్స్ అయిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. మంత్రి కొడాలి నానీ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమకు వంగవీటి రాధాతో ఉన్నా వ్యక్తిగత స్నేహాన్ని ఉపయోగించుకుని ఆయన్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో కలసి పాల్గొన్నారు. అయితే అదే సభలో రాధా తన హత్యకోసం రెక్కీ జరిగిందని సంచలన కామెంట్లు చేయడంతో.. కథ కొత్తమలుపు తిరిగింది. విషయం ముఖ్యమంత్రి కోర్టుకు చేరింది. మంత్రి నాని చొరవతోనే కావచ్చు ముఖ్యమంత్రి రాధాకు గన్ మెన్ల సంఖ్యను పెంచేలా సీఎం ఆదేశాలిచ్చారు. అయితే రాధా తనకు గన్ మెన్లు వద్దని తిప్పి పంపించేశారు. మరో వంక రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది వైసీపీ కీలక నేత అనుచరుడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు, వ్యూహాత్మకంగా పావులు కదిపి, రాధా తెలుగు దేశం పార్టీ వీడి వైసీపీలోకి వాలుతున్నారు అనే పుకార్లకు బ్రేక్ వేశారు. ముందు రాధాతో ఫోనులో మాట్లాడారు ... అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాధ ఇంటివద్ద రెక్కీ’ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని నేరుగా డీజీపీకి లేఖ రాశారు. చివరకు రాధా ఇంటికి వెళ్లి రెక్కీ వ్యవహరం పూర్వా పరాలు అన్నీ తెలుసుకున్నారు. రెక్కీ చేసినవారెవరో తేల్చాలని, వారిని అరెస్ట్ చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పార్టీలో రాధా రాజకీయ భవిష్యత్’కు సంబంధించి గట్టి హమీ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీలో ఆయనకు కచ్చితంగా గౌరవం ఉంటుందని.. బాధ్యతలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి కీలక పదవిపై కూడా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అధినేత స్వయంగా వచ్చి హామి ఇవ్వడంతో వంగవీటి రాధా ఇక టీడీపీని వీడే అవకాశం లేనట్టే..అంటున్నారు. దీంతో, రాధా ఎపిసోడ్’లో చంద్రబాబు పైచేయి సాధించారు.