మోడీ, అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి జగన్.. ఆ ఎన్నికల కోసమేనా?
posted on Jan 2, 2022 @ 12:16PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని నూతన సంవత్సం రోజున ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తుల పైనా ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించిన మరుసటి రోజే చంద్రబాబు ముందస్తు ఎన్నికల మాట మాట్లాడటం చర్చగా మారింది. ఈ ఈ సమయంలో సడెన్ గా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుండటం మరింత ఆసక్తిగా మారింది.
సోమవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారని సమాచారం. ఏపీ పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు..అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారో వివరించి.. వాటిని సాధించుకొనే క్రమంలో ఈ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. భారీ వర్షాలు - వరదల కారణంగా ఏపీలోని మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి. దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిట్లింది.అయితే రెండు రోజుల క్రితం కేంద్రం వరదల కారణంగా నష్టపోయిన ఇతర రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఏపీ ఊసెత్తలేదు. ప్రధాని హామీ ఇచ్చారని .. సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా స్పందన లేదు. ఈ అంశం పైనా సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.
గత నెలలో తిరుపతి వచ్చిన అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అమరావతి సహా కీలక అంశాలపై ఆ సమావేశం చర్చ జరిగిందని ప్రచారం జరిగింది. ఆ సమావేశం తరువాత కొద్ది రోజులకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంది. అమరావతికి మద్దతుగా బీజేపీ సైతం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్దిక పరిస్థితులతో పాటు పోలవరం, మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్.. కేంద్రంలోని ముఖ్యులతో చర్చిస్తారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల పై ప్రచార వేళ తాజాగా నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఈ అంశం పైన సీఎం చర్చించే అవకాశం ఉంది.
రాజకీయ అంశాల పైన సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని స్వయంగా అమిత్ షా ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలో జమిలి ఎన్నికల పైనా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికల అంశం పైన అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మద్దతు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలతో పాటు జమిలి ఎన్నికలపై కేంద్రం పెద్దలతో జగన్ మాట్లాడవచ్చని అంటున్నారు. ఉక త్వరలో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఆ ఎన్నికలకు అభ్యర్ధులను నిలబెట్టే అంశం పైన తమతో సఖ్యతగా ఉన్న పార్టీల నేతలతో కేంద్రంలోని ముఖ్య నేతలు సంప్రదింపులు ప్రారంభించారు. ఇదే అంశం పైన సీఎం జగన్ తోనూ వారు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.