ఒమిక్రాన్ ను ఉపేక్షిస్తే మూల్యం తప్పుదు
posted on Jan 1, 2022 @ 6:25PM
దేశంలో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. థర్డ్ వేవ్ వచ్చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే, అధికారికంగా ప్రకటించక పోయినా, థర్డ్ వేవ్ వచ్చినట్లేనని, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య వేగంగా పరుగులు తీస్తోంది. కేసులే కాదు, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగానే వుంది. పాత సంవత్సరం పోతూ పోతూ చివరి రోజు దేశవ్యాప్తంగా 400 పైగా పైగా కొవిడ్ రోగుల ప్రాణాలను పట్టుకు పోయింది. అదే రోజున 22వేలకు పైగా కొత్త కేసుల పెరిగాయి, 400 మందికి పైగా మరణించారు. అలాగే, క్రితం రోజుతో పోలిస్తే డిసెంబర్ 31న ఓమిక్రాన్ కేసులు దాదాపు 200 పెరిగాయి. మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1431కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్ సోకగా.. డిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
అయితే, పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా ఒమిక్రాన్ ఉదృతిని గమనించిన దాఖలాలు కన్పించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరుగానున్న ఐదు రాష్ట్రాల్లో పీఎం మొదలు ప్రియంకా వాద్రావరకు ప్రతి ప్రముఖ నాయకుడు, నాయకురాలు ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పెళ్ళికి, చావుకు ఇంత మంది మించి హాజరు కారాదని ఆంక్షలు విధించిన నాయకులు, అధికారులు రాజకీయ పార్టీల ర్యాలీలకు వేలమంది కాదు, లక్షల మంది పాల్గొన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే కాదు, ప్రజలు కూడా ఇంటింటా విషాదాన్ని నిమ్పిన్ సెకండ్ వేవ్’ని అప్పుడే మరిచి పోయారా, అన్నట్లుగా కనీసం ముఖానికి మాస్క్ అయినా లేకుండా విచ్చల విడిగా విహార యాత్రలు చేస్తున్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు.
‘కొత్త సంవత్సరం తొలి పొద్దున్న జమ్ముకశ్మీర్‌లో మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓ వంక వైరస్ పంజా విసురుతున్న సమయంలో, భౌతిక దూరం అమలులో ఉన్న వేళ దేవాలయంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 12మంది చనిపోయారు. మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. దేశంలో ఫై నుంచి క్రింది వరకు నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఏ స్థాయికి చేరిందో తెలుసుకునేందుకు ఈ విషాద ఒక్కటి చాలని పిస్తోంది. సాధరణ పరిస్థితిలో తొక్కిసలాట జరిగిందంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చును. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ ఉరుముతున్న సమయంలో తొక్కిసలాట జరగటం, జరిగిన విషాద సంఘటన కంటే చాలా చాలా విషాదం. ఇదొకటే కాదు, కొత్త సంవత్సరం సందర్భంగా దేశ వ్యాప్తంగా పబ్బులు, క్లబ్బులు, బార్లు కిటకిటలాడి పోయాయి.ఈ ప్రభావం ఏమిటో ... ఒమిక్రాన్ కేసులు ఏమేరకు పెరుగుతాయో ముందు ముందు గానీ తెలియదు.
అన్ని జాగ్రత్తలు తీసుకుని మొత్తం సభ్యుల్లో సగం మంది కూడా సభకు హాజరు కాకపోయినా, ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందుకే కావచ్చు మహారాష్ట్ర ప్రభుత్వం, చేతులు కాలిన తర్వాత న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఇంకా చేతులు అంతగా కాలని, తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆంక్షలను కూడా తీసేసి ‘ఎంజాయ్’ చేయమంది.అదెలా, ఉన్నా ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చిందని, ఇంకా ఉపేక్ష వహిస్తే అందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.