పట్టపగలు NTR విగ్రహం ధ్వంసం.. వైసీపీ నేత దుశ్చర్యతో మాచర్లలో హై టెన్షన్
posted on Jan 2, 2022 @ 8:11PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లాలో పట్టపగలు తెలుగు దేశం పార్టీ వ్యవస్థపాకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన పల్నాడులో తీవ్ర అలజడి రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి గ్రామానికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. సమాచారమందుకున్న దుర్గి ఎస్.ఐ పాల్ రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు. విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించిన కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతల శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేశాడని లోకేశ్ వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.