పీసీసీ చీఫ్ రేవంత్ కు సీనియర్స్ సెగ పెడుతున్నారా?
posted on Jan 2, 2022 @ 5:47PM
అసమ్మతి నుంచి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నుంచి అసమ్మతిని వేరు చేసి చూడడం కుదరదు. అసమ్మతి, అంతర్గత ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి సహజ కవచ కుండలాలు. నిజానికి ఒకప్పుడు, ఇతర పార్టీల నుంచి అంతగా పోటీలేని రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే డబుల్ రోల్ ప్లే చేసింది. ఇప్పడు ఆ పరిస్థితి అదికాదు. కాంగ్రెస్ పార్టీనే లోక్ సభలో డబుల్ డిజిట్ పడిపోయింది.అధికారం దూరమైంది. ప్రతిపక్షంగా అది కూడా గుర్తింపులేని ప్రతిపక్షంగా మాత్రమే కాంగ్రెస్ మిగిలింది. అయినా, ఓల్డ్ హబిట్స్ డై హార్డ్ .. పాత వాసనలు పాత అలవాట్లు అంత త్వరగా వదలవులా వుంది. అందుకే, పార్టీలో అసమ్మతి, ముఠా కుమ్ములాటలు అప్పటిలానే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి.
నిన్నగాక మొన్న ఉత్తరాఖండ్ లో ఎన్నికల ప్రచార సారధి, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంతటి నాయకుడు అమ్మతి దెబ్బకు తట్టుకోలేక చేతులు ఎత్తేశారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించడం తమ వల్ల కాదని కాడి దించేశారు. చివరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చారు. పంజాబ్’ విషయం అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దూ వర్గాల మధ్య విభేదాలు, వివాదాలు డైలీ సీరియల్స్ ను తలపిస్తున్నాయి. ఇక ఇప్పడు తెలంగాణ విషయానికి వస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రత్యర్ధి పార్టీలు తెరాస, బీజేపీలతో పాటుగా, సొంతపార్టీలోని సీనియర్ నాయకులతోనూ పోరాడవలసి వస్తోంది. ఆయనకు సీనియర్లకు మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అంతే కాదు ప్రత్యర్ధి పార్టీలను ఆయన ధీటుగా ఎదుర్కుంటున్న రేవంత్ సొంతపార్టీ సీనియర్లను సమాధాన పరచలేక పోతున్నారనిపిస్తోంది. సీనియర్లతో సయోధ్యత ఆయనతో అయ్యే పనిలా కనిపించడం లేదని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నారు.నిజానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే, అందరినీ కలుపుకుపోయే పని ప్రారంభించారు. అయినా, సీనియర్ నాయకుల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి చల్లారలేదు.అప్పుడప్పుడు ఇలా భగ్గు మంటూనే వుంది.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ నాయకుల సమక్షంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక సారి భగ్గుమన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పరిస్థితిని సమీక్షించిన అధిష్ఠానం, అసమ్మతి నేతలకు అక్షింతలు వేసింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చెయ్యాలని స్పష్టం చేసింది. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు కూడా చేసింది.దాంతో గతకొంత కాలంగా అసమ్మతి కార్యక్రమాలు కొంత మేరకు సర్డుమణిగాయి. అయితే పైకి కలిసికట్టుగా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడుతాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డిల మధ్య గత నాలగైదు రోజులుగా సాగుతున్న ‘రచ్చబండ’ వివాదం,సీనియర్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడికి మధ్య ఉన్న విభేదాలు సమసి పోలేదని స్పష్టం చేస్తున్నాయి
ఇక విషయంలోకి వస్తే గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమంవిషయానికి సంబంధించి తనకు సమాచారం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో అగ్గిరాజేశారు. ఆ విధంగా అసమ్మతి రాగం, అంతలోనే శ్రుతిమించి ..రచ్చ రచ్చగా మారింది. దీంతో, గతంలో ఎప్పుడో రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శశి థరూర్’ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇతర పాత పురాణాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విభేదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తనకు తెలియకుండా రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పీఏసీ సమావేశంలో చర్చించిన తర్వాతనే పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు.ఆ అధికారం నాకు ఉంది..ఇదే సమయంలో పీఏసీతో సంబంధం లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు చేసేందుకు నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రథసారథి అయినప్పటికీ స్థానిక నాయకత్వానికి సమాచారం లేకుండా పార్టీ సమావేశంలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా నివేదిస్తామని జగ్గారెడ్డి తమదైన స్టైల్లో స్పష్టం చేశారు.