మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో భగ్గుమంటున్న విభేదాలు
posted on Jan 1, 2022 @ 3:18PM
వైసీపీలో పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తున్నకోవర్టులున్నారా? ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్దుల గెలుపు కోసం పనిచేసిన నాయకులు ఇంకా పార్టీలోనే కొనసాగుతూ పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారా? అంటే, పార్టీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు జిల్లా నగిరి శాసన సభ్యురాలు ఆర్కే రోజా అవుననే అంటున్నారు. అంతే కాదు, పార్టీలో కోవర్టులుగా పనిచేస్తున్న వారు, అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దేబ్బతీస్తున్నారని, ఆమె ఆరోపిస్తున్నారు. ఇలాంటి కోవర్టుల వలన పార్టీ, ప్రభుత్వంతో పాటు స్థానిక మంత్రికి కూడా చెడ్డపేరు వస్తోందని అలాంటి కోవర్టులపై చర్యలు తీసుకోవాలని, ఆమె, పార్టీకి కాకుండా, ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికీ నగరి నియోజక వర్గం వైకాపాలో రచ్చరచ్చగా మారిన విబేధాలు ఇప్పుడు మరింత భగ్గు మంటున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. నిన్న (శుక్రవారం) వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోజా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో మీడియా మాట్లాడారు.
సహజంగా పార్టీలో కోవర్ట్ ఆక్టివిటీ జరుగుతున్నా, లేదా నాయకుల మధ్య అంతర్గత విబేధాలుంటే, పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారు. కానీ, రోజా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఫిర్యాదులో కానీ, ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మట్లాడిన సందర్భంలో కానీ, ఎక్కడా ఆమె ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేరును మాత్రం ప్రస్తావించారు. కోవర్టుల వలన పార్టీ, ప్రభుత్వంతో పాటు స్థానిక మంత్రి (పెద్దిరెడ్డి)కి కూడా చెడ్డపేరు వస్తోందని, ఫిర్యాదులో పేర్కొన్న రోజా, తాను, తన కుటుంబ సభ్యులు అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నామని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న కోవర్టులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే, నగరి నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఇది వరకే మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశామని, మరోసారి మంత్రిని కలిసి వివరిస్తామని రోజా తెలిపారు.
నిజానికి, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో, పెద్దిరెడ్డి రామచండ్రా రెడ్డికి, ఎమ్మెల్యే రోజాకు మధ్య విభేదాలున్న విషయం జగమెరిగిన సత్యం. నియోజక వర్గంలో రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే కుమార్ వర్గానికి మంత్రి మద్దతు ఉందనేది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను రెండు వర్గాలు పోటాపోటీగా నిర్వాహించాయి. ఒకరి ఫెక్సీలు ఒకరు చించుకున్నారు. ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భంగా ఒకరి నొకరు మీడియా ముందు దూషించుకున్నారు. రోజా ప్రత్యర్ధి వర్గం ఫ్లెక్సీలో మంత్రి రామచంద్రా రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారు. ఇటీవల కేజే కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని కలిశారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా స్మగ్లింగ్ పై ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు తెలుస్తోంది.ఈనేపధ్యంలో రోజా పోలీసులకు ఫిర్యదు చేయడం పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ చేయడంతో, నగరి నియోజక వర్గం వైసీపీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్ల్యే వార్ పతాక స్థాయికి చేరిందని అనుకోవచ్చని అంటున్నారు.