కారు కమలం మధ్య కాదేదీ కయ్యానికి అనర్హం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీల మధ్య, యుద్ధం నడుస్తోంది. నిజమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు తలెత్తడం, అదే విధగా కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీల మధ్య రాజకీయ విబేధాలు తలెత్తడం సహజమే. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న,తెరాసల మధ్య అదీ ఇదీ కాకుండా ఫలితం ఉందని ‘మూడో’ రకం యుద్ధం నడుస్తోంది.
నిజానికి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస ఒకేసారి, 2014లో అధికారంలోకి వచ్చాయి. అలాగే, అక్కడ కమలం,ఇక్కడ కారు, వరసగా రెండవసారి, (కారు 2018లో కమలం 2019లో) అధికారంలోకి వచ్చాయి. అయినా, తొలి ఐదేళ్ళలో కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నా, రెండు పార్టీల మధ్య రాజకీయ, సిద్ధాంత విబేధాలున్నా,రెండు పార్టీల నడుమ శతృమిత్ర సంబంధాలు అంతగా గీత దాట లేదు. ఒక విధంగా హనీమూన్ జంటలా కమలం,కారు కలిసిమెలిసి ప్రేమ ప్రయాణం సాగించాయి. 2018లో తెలంగాణ శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరిగినా, 2019 సార్వత్రిక ఎన్నికల వరకు, ఆ తర్వాత కూడా, తెరాస కేంద్ర ప్రభుత్వంతో సమోధ్య కొనసాగించింది. ఎన్ఆర్సీ,సిఎఎ, వ్యవసాయ చట్టాలు సహా, జీఎస్ టి, పెద్ద నోట్లరద్దు సహా అనేక కీలక బిల్లులకు రాజ్యసభలో ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇచ్చింది.
అయితే, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. ఇప్పడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అంతే కాదు, ఇప్పడు, కాదేదీ కయ్యాని అనర్హం అన్నట్లుగా, అయిన దానికి కాని దానికీ బీజేపీ, తెరాస నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సరేసరి, ఇప్పడు ఆ స్థాయి దాటి, ఒక వంక భౌతిక దాడులు, మరో వంక కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల పరస్పర దాడులు, న్యాయ పోరాటాలు వరకు పరిస్థితి, దిగజారింది. తమల పాకుతో నువ్వొకటంటే, తపులుపు చెక్కతో నేను నాలుగంటా అన్నట్లుగా కారు, కమలం నేతల మధ్య వివాదాల పరంపర కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఇప్పడు కొత్తగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనకి కొత్త తగువొకటి తెర మీదకు వచ్చింది. ఈ దాడికి సంబంధించి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య గత కొంత కాలంగా సాగుతున్న యుద్ధం, మరో మలుపు తిరిగింది. ఈ దాడికి ఎమ్మెల్సీ కవిత కారణమని ఆరోపిస్తున్న అరవింద్, కవిత తనను చంపేస్తానంటూ చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించారు. కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపుతానంటూ మీడియా వేదికగా బహిరంగంగా కామెంట్లు చేసిన కవితపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.
కాగా, ఎంపీ అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం(నవంబర్ 29) హైకోర్టులో విచారణ జరిగింది. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లో అద్దాలు, ఫర్నీచర్, వస్తువులు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు తనను చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కవితపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.వివాదం వివరాలోకి వెళితే, ఇందులో అంతగా రెచ్చిపోయే విషయం ఏదీ లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ.
నిజానికి, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తేనె తుట్టెను కదిల్చారు. కొద్ది రోజుల క్రితం, బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ కవితని తమ పార్టీలోకి రావాలని వత్తిడి చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో, అయన భాషలో ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన అరవింద్, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోను ద్వారా చర్చలు జరిపారని, కవిత పార్టీ ఫిరయింపునకు సంబదించి మరో ‘రహస్యాన్ని’ మీడియా ముందు తెర మీదకు తెచ్చారు.
అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్ ద్వంసం చేశారు.ఈ ఘటన జరుగుతుండగానే కవిత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అర్వింద్‌పై విరుచుకుడ్డారు. అర్వింద్‌ను నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ ఘాటుగా స్పందించారు. ఇంకో అడుగు ముందుకేసి అరవింద్ ను చంపేస్తామంటూ కవిత తీవ్ర హెచ్చరిక చేశారు, ఇప్పడు అరవింద్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయనేది పక్కన పెడితే, రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో తెరాస సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత, బీజేపీ అభ్యర్ధి అరవింద్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి, ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా, ఇప్పడు తాజగా మళ్ళీ అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే, తాను అక్కడ నుంచే పోటీ చేసి అరవింద్ ను ఓడిస్తాని కవిత శపధం కూడా చేశారు. సో... బీజేపీ, తెరాస మధ్య జరుగతున్న ముగింపు లేని యుద్ధంలో మరో అధ్యాయానికి తెర లేచింది. చూస్తూనే ఉండండి.