Read more!

జగన్ తో మాకు సంబంధం లేదన్న విజయమ్మ.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒకే రోజు రెండు విషయాలలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే రెండోది కన్న తల్లి విజయమ్మ జగన్ తో మాకేంటి సంబంధం అంటూ వ్యాఖ్యానించడం. ఈ రెండూ కూడా జగన్ ప్రతిష్టను మసకబార్చే సంఘటనలే.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతిని జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోందంటూ వివేకా కుమార్తె, జగన్ సోదరి డాక్టర్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సునీత చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలంటూ ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా సుప్రీం కు నివేదించింది. దీంతో కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదలీ చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం(నవంబర్ 29) ఉత్తర్వులు వెలువరించింది. సుప్రీం నిర్ణయం కచ్చితంగా ఏపీ సర్కార్ ప్రతిష్టకు, స్వయంగా జగన్ ప్రతిష్టకు మచ్చే అనడంలో సందేహం లేదు.

ఈ తీర్పుపై స్పందిస్తూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగన్ రెడ్డీ తలెక్కడ పెట్టుకుంటావ్ అంటూ విపక్ష నేత చంద్రబాబు నిలదీశారు. బాబాయ్ కేసు హైదరాబాద్ కు అబ్బాయ్ చంచల్ గూడ జైలుకూ అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. అచ్చన్నాయుడు, బోండా ఉమ తదితరులు ఈ తీర్పు వివేకా హత్య కేసు నీరుగార్చడంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని నిర్ద్వంద్వంగా తేలిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఫేస్ సేవింగ్ కోసం సకల శాఖల మంత్రి సజ్జల మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య కేసు తెలంగాణకు మారడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు ఏం భంగం కాదని చెప్పుకున్నారు అది వేరే సంగతి.  

వివేకా హత్య కేసు విషయంలో సుప్రీం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే సీఎం జగన్ కన్నతల్లి విజయమ్మ.. తన కుమారుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తో మాకేంటి సంబంధం అన్నారు. ఈ మాటలు ఆమె మీడియా ముందే బహిరంగంగా చెప్పారు. ఆమె జగన్ కు స్వయాన తల్లి, ఇటీవలి కాలం వరకూ వెసీపీ గౌరవాధ్యక్షురాలు అలాంటి విజయమ్మ  జగన్ మోహన్ రెడ్డితో.. ఆంధ్ర రాష్ట్రంతో  మాకేంటి అని వ్యాఖ్యానించారు.  మాట రావడం చర్చనీయాంశమైంది.  తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) అధినేత్రి షర్మిలను మంగళవారం(నవంబర్ 29) పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు ఆమెను పోలీసు స్టేషన్ కు రానీయకుండా అడ్డుకోవడంతో ఇంట్లోనే విజయమ్మ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె జగన్ తో, ఏపీతో మనకేంటి సంబంధం అని ఒక విలేకరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. సొంత తల్లే కొడుకుతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం చూస్తే..జగన్ తీరు పట్ల ఆమె ఎంతగా విసిగిపోయారో అర్ధం అవుతుంది. ఏపీలో జగన్ అధికారం చేపట్టేందుకు కుమార్తె షర్మిలతో కలిసి విజయమ్మ చేసిన ప్రచారం, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపి నిలబెట్టిన తీరును ఇప్పుడు వైసీపీ శ్రేణులే గుర్తు చేసుకుంటూ.. విజయమ్మ వ్యాఖ్యలు జగన్ తల్లి సోదరి పట్ల వ్యవహరించిన తీరుకు అద్దం పడుతున్నాయని చర్చించుకుంటున్నాయి.