Read more!

ట్విస్టులేమీ లేవు... జవహర్ రెడ్డే ఏపీ కొత్త సీఎస్

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం  నవంబర్ 30 (బుధవారం)తో ముగిసింది. ఆయన పదవీ విరమణ చేశారు.  ఈ నేపధ్యంలో  డిసెంబరు 1(గురువారం)న బాధ్యతలు చేపట్టబోయే కొత్త సీఎస్ ఎవరు అన్న సందిగ్ధతకు జగన్ సర్కార్ నవంబర్ 29(మంగళవారం) సాయంత్రం ఫుల్ స్టాప్ పెట్టేసింది.  కొత్త సీఎస్ విషయంలో పలు పేర్లు ప్రస్తావనలోకి వచ్చినట్లు పెద్దగా ప్రచారం జరిగినా.. చివరి నిముషంలో ట్విస్టులంటూ కొత్త పేరును తెరమీదకు తీసుకువచ్చినా చివరకు ఏపీ సీఎం జగన్ తానేం అనుకున్నారో అదే చేశారు.

 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కెఎస్‌ జవహర్‌రెని  ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి, ఏపీ సీఎస్‌గా 2024 జూన్‌ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. అంటే వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకూ ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డే ఉంటారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త సీఎస్ అన్న చర్చ వచ్చినప్పటి నుంచీ రేసులో ముందున్నది జవహర్ రెడ్డే. అయితే చివరి నిముషంలో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చినా.. అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో  పునరాలోచన చేయడం వెనక ఉన్న కారణం ఏమిటనే విషయంలో  మీడియాలో అయితేనేమి, రాజకీయ వర్గాల్లో అయితేనేమీ బారీ చర్చే జరిగింది.

ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకోవడం వెనక ( నిజంగా మార్చుకోలేదనుకోండి)   జవహర్ ‘రెడ్డి’ పేరే కారణం అంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనే కాక రాజకీయ వర్గాలలో కూడా పలు విశ్లేషణలు తెరమీదకు వచ్చాయి.  ప్రభుత్వంలో రెడ్డి డామినేషన్ అంటే వస్తున్న విమర్శల నుంచి బయటపడేందుకు జగన్ కొత్త సీఎస్ నియామకం విషయంలో పునరాలోచనలో పడ్డారని పలువురు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందుకు ఉదాహరణగా పార్టీ పదవుల విషయంలో  ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో  ఒకింత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయితే జగన్ విమర్శలకు వెరవరనీ, ఎవరేమనుకున్నా పట్టించుకోరనీ జవహర్ రెడ్డినే అంటే తాను ముందు నుంచీ అనుకుంటున్న వ్యక్తినే ఏపీ కొత్త సీఎస్ గా నియమించారు.

ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నారు.. సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం విషయంలో పునరాలోచనలో పడ్డారంటూ వ్యక్తమైన అభిప్రాయాలలో మరో ముఖ్యమైనది ఏమిటంటే.. మోడీ జగన్ పై నజర్ పెట్టారు.. ఇంత కాలం ఇచ్చిన మద్దతు అండ ఇకపై ఉండదనడానికి నిదర్శనగానే కేంద్రం గిరిధర్ అమరణే పేరును తెరమీదకు తీసుకువచ్చింది.  అయతే ఎవరెన్ని విధాల విశ్లేషణలు చేసినా జగన్ జవహర్ రెడ్డి నియామకం విషయంలో మొదటి నుంచీ అదే అభిప్రాయంతో ఉన్నారు. పునరాలోచనలో పడలేదని నిర్దారణ అయిపోయింది.   జవహర్ రెడ్డి నియామకం కోసం జగన్ సర్కార్ బారీ కసరత్తే చేసింది.  మూడు బ్యాచ్‌లను కాదని, 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని ఎంపిక చేసింది. నిజానికి 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌,  1988 క్యాడర్‌కు చెందిన పూనం మాలకొండయ్య,  1989 బ్యాచ్‌కు చెందిన కరికల్‌ వలెవన్‌ను కాదని,  జవహర్‌రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేసింది.  అయితే ఇదేం కొత్త కాదు, ఇదే తొలి సారీ కాదు.. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సీనియర్లను కాదని.. తమకు నచ్చిన వారిని సీఎస్‌లుగా నియమించిన సంఘటనలు ఉన్నాయి. సంప్రదాయమూ ఉంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని, జగన్‌ ప్రభుత్వం కొనసాగించింది.

కాగా సీఎంఓలో ప్రస్తుతం జవహర్‌రెడ్డి స్థానాన్ని, సీనియర్‌ ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య భర్తీ చేయనున్నారు. నిజానికి ఆమె కూడా సీఎస్‌ పదవి ఆశించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న పూనం, ఎవరు చెప్పినా వినరన్న ప్రచారం అధికారవర్గాల్లోనే కాదు జనసామాన్యంలో కూడా  ఉంది. నిజాయితీ పరురాలైన అధికారిణిగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది. అందుకే సీఎస్ గా పూనం మాలకొండయ్య పేరును జగన్ కన్సిడర్ చేయలేదంటున్నారు.