Read more!

జగనన్నా.. ఎక్కడన్నా!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదీకూడా.. ఆమె కారులో ఉండగా.. కారును క్రేన్ తో  లాక్కెళ్లి మరీ ఆమెను  పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను గట్టి భద్రత నడుమ సంకెళ్లు వేసి.. పీఎస్‌లోకి పట్టుకెళ్లారు.    

అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైయస్ షర్మిల సొంత సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కనీసం స్పందించకపోవడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ విస్మయం వ్యక్తమౌతోంది.  దేశంలో ఎక్కడో కాదు... పక్క రాష్ట్రంలో.. అదీ మరో తెలుగు రాష్ట్రంలో సొంత చెల్లికి ఇంత అన్యాయం జరుగుతోంటే.. జగన్.. ఇలా ఉలుకు పలుకు లేకుండా... బెల్లం కొట్టిన రాయిలా ఉండడం ఏమిటని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. ఒకటి.. రెండు కాదు.. దాదాపు 16 నెలలు చంచల్ గూడ జైలులో ఉంటే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. సోదరుడు   జగన్ కోసం వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడమే కాదు.. జగన్ అధికారంలోకి రావడం కోసం బస్సు యాత్ర సైతం చేశారనీ.. అలాగే జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం అంటూ..  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంటి సాగనంపండని ప్రజలకు బై బై బాబు అనే కొత్త స్లోగన్‌ అందించి..... తన సోదరుడు వైయస్ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే వరకు అలుపెరగకుండా ఆమె ఓ విధమైన దీక్ష బూనారనీ.. అలాంటి తొబుట్టువు షర్మిల పట్ల సొంత సోదరుడిగా వైయస్ జగన్ ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించడంపై ఏపీ ప్రజలే కాదు..  వైసీపీ శ్రేణులు...   వైయస్ఆర్ టీపీలోని ముఖ్య నేతలు ఔర ఔర అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత..  ఆయన తల్లి  విజయమ్మ, సోదరి  షర్మిలలు... పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయి.. కొత్త పార్టీ స్థాపించారు.   షర్మిల.. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోనేందుకు.. ఓ వైపు పాదయాత్ర చేస్తూ... మరో వైపు రైతులు, విద్యార్థుల సమస్యలపై ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఆమె చాలా బలంగా గళం విప్పుతున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై ఒకటికి రెండు సార్లు ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లి.. సీబీఐ, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేసి వచ్చారు.   

అలాగే ఆమె పాదయాత్రలో కూడా.. ఆయా ప్రాంతాల్లోని అధికార టీఆర్ఎస్  ఎమ్మెల్యేల అవినీతిపై ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఆ క్రమంలో వైయస్ షర్మిలపై దాడి జరిగింది. అలాంటి వేళ.. సొంత చెల్లికి ఇంతలా అన్యాయం జరుగుతోంటే.. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పందించకపోవడం పట్ల  జగన్‌పై తెలుగు ప్రజలు మండిపడ్డుతున్నారు.

అయితే గతంలో   జగన్ పాదయాత్ర సందర్బంగా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా వారు మరోసారి గుర్తు చేస్తున్నారు. అక్క చెల్లెమ్మలకు అంటూ.. నాడు ప్రతిపక్ష నేతగా  జగన్ ఒకటికి వంద సార్లు చెప్పారని.. కానీ నేడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. పక్క రాష్ట్రంలో సొంత చెల్లి, తల్లికే దిక్కు లేకుండా పోయిందనే ఓ చర్చ అయితే తెలుగు ప్రజల్లో వాడి వేడిగా  సాగుతోంది.

అంతేకాదు.. సొంత చెల్లికి ఇంత  అన్యాయం జరుగుతోంటే.. సోదరుడు   జగన్ ఎక్కడ? అనే ఓ ప్రశ్న   సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ఏమైనా ఇవాళ కాకుంటే.. రేపు అయినా.. షర్మిల అంశంలో జగన్ జోక్యం చేసుకుంటారని తెలుగు ప్రజలు తెగ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారోనని తెలుగు  ప్రజలంతా తెగ ఆతృతగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనే ఓ చర్చ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా   నడుస్తోంది.