ఇటు అలీ అటు పవన్ మధ్యలో...జగన్ ?

రాజకీయాలకు ఉండే ‘పవరే’ అలాంటిది..మంచి మిత్రులనే కాదు, భార్యా భర్తలను, తండ్రీ కొడుకులను, ఆన్పదమ్ములను,అక్క చెల్లెళ్ళను, వారినీ వీరిని అని ఏముంది, చివరకు అవిభక్త కవలలను సైతం  విడదీయగల మహమ్మారి రాజకీయం. సినిమా ఇండస్ట్రీతో ఏ కొంచెం పరిచయం ఉన్న ఎవరికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. అలీ పవన్ ప్రాణమిత్రులు, జిగ్నీ దోస్తులు అన్నా కొలత సరిపోదు. బియాండ్ దట్ అంతకంటే ఎక్కువైనది ఆ ఇద్దరి స్నేహం అంటారు, సినిమా రంగంలోని ఆ ఇద్దరి మిత్రుల మిత్రులు. ‘తొలి ప్రేమ’ మొదలు ‘కాటం రాయుడు’ వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ స్టోరీ డిమాండ్ చేసినా చేయక పోయినా, ‘అలీ’ కి ఓ పాత్ర ఉంటుంది. అదొక, ‘రాజ్యాంగ’ నిబంధన. అందుకే, కథకు అవసరం ఉన్నా లేకున్నా, అలీ కోసం ఓ పాత్రను సృష్టించిన దర్శకులు ఉన్నారు. ఇక్కడ అప్రస్తుతమేమో కానీ, అలాంటి జోడీ ఇంకొకటి కూడా వుంది. దర్శకుడు తివిక్రం శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ, హాస్య నటుడు సునీల్ కు ఒక పాత్ర ఉటుంది. అది కష్టాల్లో ఒకే గదిలో కలిసున్న స్నేహానికి చిహ్నం అంటారు.    కట్ చేస్తే ... ఈ మధ్య కమెడియన్ ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం జరిగింది. ఆ వివాహానికి, మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరయ్యారు. నాగార్జున, అమల జంట వచ్చి అక్షింతలు వేశారు. ఇంకా చాలా మంది సినిమా పెద్దలు, చిన్నలు చాలా మంది పెళ్ళికి వెళ్లి అలీతో సరదాగా, సందడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జంటగా కాదు కదా కనీసం ఒంటరిగా అయినా పెళ్ళికి వెళ్ళలేదు. అదేమిటి, అంత జిగ్నీ దోస్త్ కూతురు పెళ్ళికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్ళలేదు?ఈ ప్రశ్న పెళ్ళికి వెళ్ళిన వారినే కాదు, వెళ్లని వారినీ వెంటాడుతూనే వుంది. సోషల్ మీడియాలో అయితే అందుకే వెళ్ళలేదంటూ ఎన్నో కథలు. ఆ ఇద్దరి మధ్య రాజకీయమే చిచ్చు పెట్టిందని, చాలా చాలా కథలు షికార్లు చేస్తున్నాయి.ఒకరు, అసలు అలీ పిలవనే లేదంటే, ఇంకొందరు, అలీ పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్లలేదని అంటారు. ఏది నిజమో, ఏది రాజకీయమో... ఎవరికీ తెలియక పోవచ్చును.  అయితే,అలీ కొంచెం చాలా నింపాదిగా,పవన్ కళ్యాణ్ రాకపోవడానికి, అందరు అనుకుంటున్నట్లుగా  రాజకీయ విభేదాలు కారణం కాదు అని ఒక వివరణ ఇచ్చారు. చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవ్వడం వలన చేతనే పవన్ కళ్యాణ్ పెళ్లికి హాజరు కాలేకపోయారని, అలీ వివరణ ఇచ్చారు. అలాగే,  ఎప్పుడైనా కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటే చెప్పు.. అప్పుడు వస్తాను అని అన్నారనీ, అన్నారు. అయితే, అయన ఇచ్చిన వివరణ నమ్మేటట్టు లేదని సోషల్ మీడియాలో కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి.  సరే, పెళ్లికి రావడానికి ఫ్లైట్ మిస్ కథ చెప్పారు బాగుది. పోనీ అదే నిజం అనుకున్నా, పెళ్లి తర్వాత గుంటూరులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా.. ఆ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా.. చాలా మంది రాజకీయ ప్రముఖులు హజరయ్యారు,కదా .. మరి రిసెప్షన్ కు అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు?  అంటూ లా పాయింట్స్ లాగే వాళ్ళు లాగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో, పవన్ కళ్యాణ్ ఎందుకని ఆలీ ఆయన్ని పెళ్ళికి మాత్రమే పిలిచి రిసెప్షన్కు పిలవ లేదా? ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో తాను పాల్గొనడం ఎందుకని, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? అంటూ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఆలీ, ఎప్పుడో తీరిగ్గా సమాధానం ఇస్తే, ఇవ్వవచ్చును. ఇవ్వక పోతే ఇవ్వక పోనూవచ్చును. ఇచ్చిన ఐవ్వక పోయిన భేతాళ ప్రశ్న మాత్రం ఎప్పటికీ చెరిగి పోదు. చెట్టెక్కదు. అయితే  అలీ ఇంట పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళ లేదనే చర్చకు చుక్కపెట్టి, అయన చెప్పిందే నిజం అని అనుకున్నా,రాజకీయాలు స్నేహ సంబంధాలనే కాదు,రక్త సంబంధాలను రక్తసిక్తం చేస్తాయి అనేది, నిజం.  అందులోను జగన్ రెడ్డితో వ్యవహారం అంటే ఇక వేరే చెప్పనక్కరలేదు.జగన్ రెడ్డి సొంత బాబాయ్  వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏమి జరుగుతోందో చూస్తున్నాం.  వివేకానంద రెడ్డి కుమార్తె, ఇతర బంధువులు జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల విశ్వాసం లేక కేసు విచారణను, పొరుగు రాష్ట్రానికి బదిలీచేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఈ మధ్యనే  తీర్పు నిచ్చింది.  ఇక ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన సొంత సోదరి  వైఎస్ షర్మిల విషయంలో ఏమి జరుగుతోందో కూడా చూస్తూనే ఉన్నాం.పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి, వేధింపులకు గురిచేస్తున్నా, జగన్ రెడ్డిలో చలనం లేదు. చెల్లినే కాదు, తల్లినీ తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కాలు కదల కుండా కట్టిపడేసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. సో .. ఆలీ చెప్పినా చెప్పక పొయినా, పవన్ – అలీ మధ్య అడ్డుగోడగా నిలిచింది ఎవరో కాదు.రాజకీయమే. అందుకే ..రాక్షసీ నీ పేరు రాజకీయమా ? అన్నారు, హాస్య రచయిత ఆదివిష్ణు. అవును అని చూపించారు హాస్య నటుడు అలీ .. అదీ విషయం.

వరంగల్ టీఆర్ఎస్ లో రోడ్డుకెక్కిన వర్గ విభేదాలు

వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గు మన్నాయి. ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ బాస్కర్ దిష్టి బొమ్మ దగ్ధం వరకూ పరిస్థితి దిగజారింది. పార్టీ ఘనంగా జరుపుకుంటున్న దీక్షా దివస్ ఉత్సవాలలో విభేదాలు భగ్గు మనడంలో తెరాసలో ఐక్యత మేడి పండు చందమేనని బయటపడిపోయింది. విషయం ఏమిటంటే..దీక్షా దివస్ సందర్భంగా    తెరాస వరంగల్ లో చేపట్టిన 11 రోజుల ఉత్సవాలు మూడో రోజునే  రోజే రసాభాసగా మారాయి. దిక్షా దివస్ సందర్భంగా గత నెల 29 నుంచి 11 రోజుల పాటు కార్యక్రమాలను షెడ్యూల్ చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 29న కాళోజీ సెంటర్​ లో దీక్ష దివస్ ప్రారంభించారు, 30న  జయశంకర్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక డిసెంబర్ 1న బైక్ ర్యాలీ నిర్వహించారు.  శుక్రవారం (డిసెంబర్ 2)న వరంగల్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తెరాసలో విభేదాలు భగ్గు మన్నాయి. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి గళం బలంగా లేచింది. ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్లిన మెహరున్నీసా ఫొటోకు  ఆ ఎగ్జిబిషన్ లో  స్థానం కల్పించకపోవడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం రసాభాసగా మారింది. దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ఫొటోలను చింపేసి మొహరున్నీసా ఆందోళనకు దిగారు. నిజమైన ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వకుండా దిక్షాదివస్ నిర్వహించడమేమిటంటూ దాస్యం వినయ్ భాస్కర్ ను నిలదీశారు. ఒక దశలో వినయ్ భాస్కర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కూడా దిగారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడినట్లైంది. తెరాస ముందస్తు ప్రణాళికలు జోరుగా రచిస్తున్న సమయంలో అత్యంత కీలకమైన వరంగల్ లో పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో టీఆర్ఎస్ వర్గాలలో ఆందోళన మొదలైంది. అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైన దిక్షా దివస్ ఉత్సవాల మూడో రోజుకే ఇలా విభేదాలు రచ్చకెక్కి కార్యక్రమం  రచ్చరచ్చగా మారడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ అధినాయకత్వం పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’ చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా విభేదాల కారణంగా తెరాస ప్రతిష్ట మసకబారుతోందని పరిశీలకులు అంటున్నారు. అసలే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో డిఫెన్స్ లో పడిన తెరాస ఇప్పుడు కీలకమైన వరంగల్ జిల్లాలో రచ్చకెక్కిన విభేదాలతో  కొత్త తలనొప్పి మొదలైనట్లేనని అంటున్నారు. ఉద్యమ కారులకు తెరాసలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమ కారులు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి వైదొలుగుతుండటానికి కారణం వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవడమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. దానికి తోడు ఉద్యమ సమయంలో సమైక్య వాదులుగా ముద్ర పడిన పలువురు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉండటాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన వారికి ఇసుమంతైనా గుర్తింపు లేకుండా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ విషయంలో మొహరున్నీసా నిరసన గళమెత్తి వినయ్ బాస్కర్ పై విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా ఉద్యమ కారుల ఫొటో ఎగ్జిబిషన్ లో ఉన్న కొన్ని ఫొటోలను చింపేసి ఆందోళనకు దిగడం పార్టీకి ఒకింత ఇబ్బంది కరమేనని చెప్పక తప్పదు.  ఎన్నికల వేళ రచ్చకెక్కతున్న విభేదాలు పార్టీ నాయకత్వంలో ఆందోళనకు కారణమౌతున్నాయి. 

తెరాస ఆఖరి అస్త్రం.. తెర పైకి సమైక్య వాదం!

ఇటునుంచి కాకపోతే, అటునుంచి నరుక్కు రమ్మన్నారు, పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో చకచకా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తే, అధికార తెరాస నాయకత్వం, కమ్ముకోస్తున్న ‘కారు’ మబ్బుల్లోంచి బయట పడేందుకు,  సమైక్య కుట్రల పేరున సెంటిమెంట్’ను శరణు వేడడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని,రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు వాకిళ్లపై ఐటీదాడులు,ఆ తర్వాత డైరెక్ట్ గా, ఢిల్లీ మద్యం కేసులో, తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు పైకి రావడంతో, తెరాస నాయకత్వానికి  మరోమార్గం లేక  సెంటిమెంట్  గుర్తుకొచ్చింది.  నిజానికి, 2014లో అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఇకపై ఎంత మాత్రం  ఉద్యమ పార్టీ కాదని తేల్చి చెప్పారు. అలాగే  తెరాస ఇక పై ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా రాజకీయాలే చేస్తుందనీ కుండ బద్దలు కొట్టారు. నిజానికి  ప్రభుత్వంలో, తెలంగాణ రాజకీయాల్లో  ఉద్యమ స్పూర్తి కాదు, కనీసం ఉద్యమ వాసనలు అయినా లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారందరినీ సాగనంపారు. వైఎస్సార్, ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ సబితా ఇంద్రా రెడ్డి  సహా తెరాస ఉద్యమ నాయకత్వం ఉద్యమ ద్రోహులుగా ప్రకటించిన  తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి వంటి వారందరికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదేమంటే, ఉద్యమంలో పాల్గొన్నవారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ సెంటిమెంట్ ను ఉద్దేశపూర్వకంగా పలుచన చేశారు.  అయితే ఇప్పుడు  మారిన పరిస్థితులలో  తెరాస నాయకత్వానికి సెంటిమెంటే శ్రీరామ రక్షగా కనిపిస్తోంది. అందుకే, అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను సొంత చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా పరిణామాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, ప్రాంతీయ వాదాన్ని, తెరపైకి తెచ్చే ప్రయత్నం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అరెస్ట్  వెనక ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఉందని  అందుకే కేసీఆర్ కుమార్తె కవిత మొదలు తాజగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వరకు, అనేక మంది మంత్రులు, ఇతర నాయకులు, ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ఆమె పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టి సంవత్సరం పైగా అయిన తర్వాత ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నించడం వెనక  సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వైఎస్ షర్మిల మనసులో ఏముందో ఇందుకోసం ఆమె పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారో ఏమో కానీ, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి  పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ఈ దశలో ఆమె యాత్ర మీద దాడి జరగటం, ఆపై నాటకీయ పరిణామలు నడుమ ఆమెను  అరెస్ట్ చేయడం  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యయాయి.ఇక ఇదే సమయంలో గులాబీ నాయకులు వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని  సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు. అయితే  ఇక్కడ తెరాస అసలు టార్గెట్  షర్మిల కాదని, ప్రధాన లక్ష్యం స్వీయ రక్షణ అయితే బీజేపీకి సమైక్య ముద్ర వేసే ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, తెరాసను, తెరాస నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలను అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు కెసిఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర  తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కెసిఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  నిజానికి, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్’ ఆశించిన విధంగా రక్తి కట్టక పోవడం, అదే సమయంలో సర్దుకుందనుకున్న ఢిల్లీ మద్యం స్కాం లో లో కవిత రోల్ ఒక్కసారిగా దూసుకు రావడం, ఈ అన్నిటినీ మించి కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి మొదలు  మంత్రులు, సామంతులు, ఎంతమంది ఎంతగా గగ్గోలు పెట్టినా  సామాన్య తెలంగాణ ప్రజలు స్పందించక పోవడంతో  తెరాస నాయకత్వం సెంటిమెంట్ అస్త్రాన్ని మరోమారు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే, సమైక్యవాదం మాటున తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరమీదకు తేవడం అయ్యేపని కాదని పరిశీలకులు అంటున్నారు.నిజానికి, సమైక్యవాదానికి బట్టలు తొడిగితే ఎలా ఉంటుందో, అలా ఉండే ఉండవల్లి అరుణ కుమార్ కు పూర్ణ కుంభంతో ప్రగతి భవన్ లోకి  స్వాగతం పలికిన తెలంగాణ నాయకత్వం, ఇప్పడు సమైక్య వాదం, సమైక్య వాదుల కుట్రల గురించి  మాట్లాడితే ప్రజలు నమ్మరని, నవ్వుతారని  పరిశీలకులు అంటున్నారు.

భారత్ జోడో యాత్రలో తారల తళుకు బెళుకులు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. ఇంతవరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా నడిచిన రాహుల్ యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో సాగుతోంది. రేపో మాపో రాజస్థాన్ లో ప్రవేశిస్తుంది. నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు. సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీ లు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. అయితే, ఈ యాత్ర వలన అంతిమంగా ఏమి జరుతుగుంది, ఏమి జరగదు అనేది పక్కన పెడితే, రాహుల్ యాత్ర పాదయాత్రల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అయితే, చెప్ప వచ్చును.  రాహుల్‌ గాంధీ మొదలుపెట్టిన భారత్‌ జోడో యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయినిలో రాహుల్ గాంధీ వెంట స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనండి.. మన దేశం కోసం నిలబడండి అని స్వరా భాస్కర్ పిలుపునిచ్చారు. అంతే కాదు, రాహుల్ గాంధీకి, ఆమె ప్రేమ పూర్వకంగా రోజా పూలిచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు, ఇందుకు సంబందించిన ఫొటోలను కాంగ్రెస్‌  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.  రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూనమ్‌ కౌర్‌, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ కుసాక్‌ కూడా రాహుల్‌కు ట్విటర్‌ వేదికగా మద్దతు ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఇదలా ఉంటే,భారత్ జోడో యాత్రపై, కొందరు సీనియర్ నాయకులు కొంత అసంతృప్తి వ్యక పరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి.ప్రస్తుతం రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండగా.. షెడ్యూల్ కఠినంగా రూపొందించడంపై కమల్ నాథ్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ మిశ్రా అనే పండితుడితో ఆయన మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నం.. ఇక్కడ రెండే నిబంధనలు ఉన్నాయి. ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభించాలి. రోజులో కనీసం 24 కిలోమీటర్లు నడవాలి. అంతే కాకుండా మధ్యప్రదేశ్ లో యాత్రకు రాహుల్ ముందే మూడు కండీషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భీల్ జన్మస్థలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించాలని షరతు పెట్టారు అని కమల్ నాథ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇటీవల పాదయాత్రలో దిగ్విజయ్ సింగ్ జారిపడిన నేపథ్యంలో కమల్ నాథ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.  నిజానికి రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన  జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్లు ప్రయాణించి కశ్మీర్ చేరుకునేలాప్లాన్ చేశారు. ఈ యాత్ర ఇప్పరికే  సగం దూరం దాటేసింది. ఈరోజు (శుక్రవారం) 84వ రోజుకు చేరింది.మరో 1200 కిలోమీటర్లు నడిస్తే, యాత్ర పూర్తవుతుంది.యాత్ర పూర్తవుతుంది కానీ  యాత్ర లక్ష్యం అది భారతీయలను కులాలు, మతాలకు అతీతంగా ఏకం చేయడమే అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే అయినా, 2024 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని మోడీకి సమ ఉజ్జీగా నిలపడమే అయినా నెరవేరుతుందా? ఇప్పడు యాత్రలో పాల్గొంటున్న నాయకులనే కాదు కాంగ్రెస్ నేతలు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

షర్మిల గాయం ఏదీ లేదే.. గాయబ్..పోయిందే!

వైఎస్సార్ టీపీ అధినేత్రి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె పాదయాత్ర పై రాళ్లదాడి, కాన్వాయ్ లోని వామనం దగ్ధం ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఆమె తన గడ్డం, పెదవిపై తగిలిన గాయాలను మీడియాకు చూపించి రాజశేఖరరెడ్డి బిడ్డను, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న మహిళను తెరాస ప్రభుత్వం ఈ విధంగా గాయపరుస్తుందా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది గడిచి రెండు రోజులు అయ్యింది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంపై గాయమే కాదు.. ఆ గాయం తాలూకు మచ్చ కూడా కనిపించలేదు. దీంతో ఆమె నిజంగా గాయపడ్డారా అన్న అనుమానాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. గాయం పేరుతో మీడియా ముందు ఆమె సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విమర్శించారు. అయినా గాయాలు అంత తొందరగా మానిపోయే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా  అని సెటైర్ వేశారు. ఇప్పటికైనా షర్మిల  వ్యక్తిగత విమర్శలు మానుకుని బుద్ధిగా పాదయాత్ర చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

బంగ్లా టూర్ కు పంత్ ఔట్

రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న టీమ్ ఇండియా క్రికెటర్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అవుతాడా? అతడి పేరును సెలక్టర్లు బంగ్లా  టూర్ కు దూరం పెట్టేయాలని డిసైడయ్యారా? అంటే క్రికెట్ నిపుణులు ఔననే అంటున్నారు. అయితే గాయం కారణంగానే పంత్ బంగ్లాటూర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమ్ ఇండియా ఆటగాళ్లు చెబుతున్నారు. పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా అతడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తోందంటున్నారు. అద్భుత మైన టాలెంట్ ఈ యువ క్రికెటర్ సొంతమని చెబుతున్నారు. అందుకే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా పంత్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. అయితే కివీస్ తో రెండు రోజుల కిందట జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్ కేవలం పది పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు. కానీ ఆ తరువాత అతడు స్ట్రెచర్ పై పడుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ గాయపడ్డాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంత్ బంగ్లా టూర్ కు దూరం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.   

కుక్కపై అత్యాచారం..!

కామాతురాణాం.. న భయం.. న లజ్జ అన్నారు. అంటే కామంతో కళ్లు మూసుకు పోయిన వాళ్లకు భయం, సిగ్గు ఉండవని. అయితే ఉచ్ఛం, నీచం కూడా తెలియదని, మనిషికీ, పశువుకీ కూడా తేడా తెలియదనీ  పంజాబ్ లో జరిగిన ఒక సంఘటన రుజువు చేసింది. పక్కింటి వారిపెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన పంజాబ్ లోని శిమ్లాపురిలో జరిగింది. తమ పెంపుడు కుక్కను ఇంటికి కాపలాగా వదిలి ఏదో ఫంక్షన్ ఉంటే ఇంటిల్లి పాదీ బయటకు వెళ్లారు. ఇదే అదునుగా పక్కింటి వ్యక్తి వారింట్లోకి జొరబడి ఆ పెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు. అది కాస్తా బయటకు వచ్చింది. యానిమల్ రైట్స్ గ్రూప్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు. 

కరి లక్ష్మికి కార్డియాక్ అరెస్టు! కడసారి చూపుకోసం పోటెత్తిన భక్త జనం

లక్ష్మి కార్డియాక్ అరెస్టుతో మరణించింది. 27 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించిన లక్ష్మిని కడసారి చూసేందుకు భక్త జన సందోహం తరలి వచ్చింది. తమిళనాడులోని  మనాకుల వినాయకర్ ఆలయంలో లక్ష్మి దశాబ్దాల సేవలతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రురాలైంది. అందరి అభిమానాన్నీ చూరగొంది. అలాంటి లక్ష్మి మార్నింగ్ వాక్ చేస్తూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించిందని తేల్చారు. ఈ వార్త తెలియగానే భక్త జనసందోహం ఆలయానికి వచ్చింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారంతా లక్ష్మి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. ఇంతకీ లక్ష్మి ఎవరు, ఆమె మరణిస్తే భక్తులు కంటతడి పెట్టడమేమిటి అనుకుంటున్నారు. లక్ష్మి ఒక ఏనుగు. గత రెండున్నర దశాబ్దాలుగా వినాయకర్  ఆలయంలో సేవలందిస్తోంది. భక్తులందరికీ ఏనుగు లక్ష్మి ఒక కుటుంబ సభ్యురాలిగా దగ్గరైపోయింది. దాని హుందాతనం, దాని కలివిడి తనం, పిల్లలు పెద్దలూ అన్న తేడా లేకుండా దగ్గరకు వచ్చిన వారందరినీ తొండంతో దీవెనలు అందచేసే మంచితనంతో ఆలాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. దీంతో లక్ష్మి మరణ వార్త భక్తులను కలచి వేసింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారిలో భక్తులూ కాదు.. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

ఉచితానికి ప్రలోభ పడి.. ఎంగిలిప్లేట్లు కడిగి..!

పిలవని పేరంటానికి వెళ్లిన పెద్ద ముత్తయిదువ అగ్రతాంబూలం ఇవ్వాల్సిందేనని గొడవ పెట్టుకుందట.. అయితే వాయినం మాట అటుంచి ఆమెను ‘మర్యాద’గా బయటకు సాగనంపారు. సరిగ్గా అలాంటి మర్యాదే ఓ ఎంబీఏ విద్యార్థికి ఎదురైంది. పేరంటానికి వెళ్లినందుకు కాదు. ఆహ్వానం లేకండా పెళ్లి విందుకు హాజరై సుబ్బరంగా తిన్నందుకు. ప్రస్తతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ విందు భోజన అనంతర మర్యాదకు సంబంధించిన సంఘటన జబల్పూర్ లో జరిగింది. సాధారణంగా ఫంక్షన్ హాళ్లలో జరిగే వివాహ వేడుకలు, రిసెప్షన్లకు ఆహ్వానితులు మాత్రమే హాజరౌతారన్న గ్యారంటీ ఏమీ లేదు. కొందరు పనీ పాటా లేకుండా ఏదో కాలక్షేపం చేసి అల్పాహారం, విందు భోజనం లాగించేద్దాం అనే ఉద్దేశంతో వచ్చే వాళ్లూ ఉంటారు. ముఖ్యంగా  వేరే ఊళ్ల నుంచి చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన వారు.. హాస్టళ్లలో, హోటళ్లలో ఫుడ్ తిని తిని విసిగిపోయి..ఇదుగో ఇలా ఎక్కడైనా వివాహ విందు జరుగుతుంటే ఆహ్వానం లేకపోయినా వెళ్లి విందారగించి, వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేస్తుంటారు. అంతా బాగా జరిగి.. ఎవరూ గుర్తించి అడ్డగించకపోతే ఓకే.. కానీ పెళ్లివారిలో ఎవరికైనా అనుమానం వచ్చి నిలదీసి నిగ్గ దీస్తే మాత్రం కష్టాలే. సరిగ్గా అలాంటి కష్టాలే జబల్పూర్ లో ఓ ఎంబీయే విద్యార్థికి అనుభవంలోకి వచ్చాయి. జబల్పూర్ లో ఓ వివాహ విందుకు ఈ జబల్పూర్ విద్యార్థి ఆహ్వానం లేకపోయినా మాంచి వివాహ భోజనంబు ఆరగించేద్దామని వెళ్లాడు. హాయిగా విందు భోజనం భుజించాడు. ఇక బయటకు వచ్చేద్దామనుకుంటుండగా పెళ్లి వారికి అనుమానం వచ్చింది. అడ్డగించి నిలదీశారు. వాస్తవం తెలుసుకుని మంచి భోజనం చేశారుగా అందుకు తగ్గ పని కూడా చేయడం అంటే మర్యాద చేశారు. ఆ ఎంబీయే విద్యార్థి చేత ఎంగిలి ప్లేట్లు కడిగించారు. అతగాడా పని చేస్తుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ వీడియోయే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దొరికిపోయి జబల్పూర్ పరువు తీశావు సోదరా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా నేను చాలా సార్లు చేశాను, కానీ ఎప్పుడూ దోరకలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొసమెరుపేమిటంటే... దొరికి పోయి ఎంగిలి ప్లేట్లు కడిగిన ఎంబీయే విద్యార్ధి కూడా ఆ వీడియోపై తన కామెంట్ పెట్టాడు. ఉచితంగా ఏదైనా పొందాలనుకోవడం దురాసే కదా.. అందుకే శిక్ష అనుభవించాను అన్నది అతగాడి కామెంట్.  ఉచిత ప్రలోభాలకు లొంగి ఓట్లు గుద్దేసే ప్రజలకు కూడా ఉచితాలకు ఆశపడితే శిక్ష తప్పదన్న జ్ణానోదయం ఎప్పుడౌతుందో కదా.

ముందస్తు ముచ్చట్లు ఎవరి ‘గోల్’వారిదే.. ఎవరి గోల వారిదే!

ముందస్తు ఎన్నికలు డైలీ సీరియల్ లో మరో ఎపిసోడ్ మన ముందుకొచ్చింది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు, మీడియా కథనాలు ఎలా ఉన్నా, అధికార తెరాసలోనూ అదే గందరగోళం, ఒక విధమైన ఊగిసలాట కనిపిస్తోంది. ఎదుకో తెలియదు కానీ తెరాస నాయకులే ముందస్తు ముచ్చట్లు డైలీ సీరియల్ లా సాగదీస్తున్నారు. ఒకరు ఇటు, ఒకరు అటు నిలపడి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. అది కూడా  ఏదో చిన్నాచితక నాయకులు, హాఫ్ టికెట్ గాళ్లు అసలే కాదు.  అలాంటి వారు  ఏదో అన్నారంటే అర్థం చేసుకోవచ్చును. కానీ, పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా, పూటకో మాట, నోటికో మాట అన్నట్లుగా మాట్లాడడంతో రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతోంది. నిజానికి, ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరిగినా  ప్రజలకు ప్రత్యేకించి జరిగే మేళ్ళు  పెద్దగా ఉండవు.  అయినా, ఇప్పడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా  అదే చర్చ. ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా? వస్తే ఎందుకు వస్తాయి, రావంటే ఎందుకు రావు ఇదే చర్చ జరుగుతోంది.  అయితే  రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయ వేడి చల్లారకుండా, ముందస్తు ముచ్చట్లు వదులుతున్నారని అంటున్నారు. ఇతర సమస్యల నుంచి మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, విచారణలలో వెలుగు చూస్తున్న ఇబ్బందికర పరిస్తితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార పార్టీ ముఖ్య నాయకులు  ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నారని పరిశీలకులు విశ్లేస్తిస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం తెరాస కీలక నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, బోయినపల్లి వినోద్ కుమార , సమయం లేదు మిత్రమా... ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు, ఆరేడు నెలల్లోనే నగారా మోగుతుంది, ‘గెట్ రెడీ  అంటూ  క్యాడర్ ను  హెచ్చరించారు. అందుకు ఒక రోజు అటూ ఇటుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెరాస కీలక నేత, ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో మామకు మించిన అల్లుడిగా చెప్పుకునే  మంత్రి హరీష్ రావు, ముందస్తు లేదు వెనకస్తు లేదు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలని తేల్చి చెప్పారు. మరో వంక మీడియా చర్చల్లో పాల్గొనే, తెరాస నాయకులు,ఎమ్మెల్యేలు అటూ ఇటూ కాకుండా, అవునని కాదని రెండు మాటలూ ఒకరే చెపుతున్నారు. అదలా ఉంటే ఇప్పడు తాజాగా  ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ టూ పొజిషన్’లో ఉన్న ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుట్ల తారక రామా రావు, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని ప్రకటించారు. నిజానికి, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. అలాగే ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో ప్రధాన సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని కేటీఆర్ ప్రజలకు మాటిచ్చారు.   అయితే ఫలితాలు వచ్చి 15 రోజులు  కాదు ఇంచు మించుగా నెల రోజులు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మునుగోడులో కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగ లేదు సరికదా ఎన్నికల ప్రకటనకు ముందు హడావిడిగా మొదలు పెట్టిన పనులు కూడా  ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిజానికి, ఎన్నికలకు ముందు అడుక్కో ఎమ్మెల్యే, గజానికో మంత్రి అన్నట్లుగ మునుగోడును చుట్టేసిన తెరాస నాయకులు  ఎవరూ ఈ నెలరోజుల్లో అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. చివరకు గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కనిపిచడం లేదని ప్రజలు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రి కేటీఆర్ మరో నలుగురు మంత్రులు  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మునుగోడు వెళ్లి అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గతంలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్, ఇప్పడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒకేసారి ఆరేడు నెలల్లో పూర్తి చేస్తామని  అలాగే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పనులు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో రాబోయే 10, 12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని,  ఆలోపే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అంటే, పనులు ప్రాజెక్టుల విషయం ఎలా ఉన్నా ముందస్తుకు వెళ్ళేది లేదని, కేటీఆర్ చెప్పకనే చెప్పారు. అయితే ఇంతటితో ముందస్తు ముచ్చట్లు ఆగుతాయా  అంటే అబ్బే అదేం లేదు. అదదే ఇదిదే... అంతే.. ఎవరి గోల వారిదే ..ఎవరి ‘గోల్’వారిదే.

తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో వికెట్ డౌన్?

తెలంగాణ కాంగ్రెస్ కు ఏదో అయ్యింది. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా.. ఆ మేరకు కాంగ్రెస్ పుంజుకోవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు.. సరికదా ఉన్న పట్టును కూడా కోల్పోయి రోజు రోజుకూ మరింత బలహీనమౌతోంది. పార్టీ  నాయకులు ఒక్కరొక్కరుగా దూరమౌతున్నారు. ఉన్న వారు కూడా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు అవకాశాలున్నప్పటికీ, పరిస్థితులు కూడా కలిసివచ్చేలా ఉన్నప్పటికీ  నాయకత్వంలో ఐక్యతా లోపం ఆ అవకాశాలను వినియోగించు కోలేక పోవడమే కాకుండా చేజార్చుకుని రోజు రోజుకూ బలహీనమైపోతోంది.  ఇక ఇప్పటి దాకా గట్టి పట్టు ఉందని అంతా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. గ్రేటర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. అలా దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని చెప్పుకుం టున్న కమలం గూటికి చేరుతున్నారు. అసలు గ్రేటర్ కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చేది పిజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వీరిద్దరికీ అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ గా విశేష గుర్తింపు ఉండేది. సరే పీజేఆర్ ఇప్పుడు లేరు. కానీ ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా నిన్న కాక మొన్న కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా తన తండ్రికి స్నేహితుడైన మర్రి శశిథర్ రెడ్డి వెంటే కమలం గూటికి చేరనున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కూడా మర్రిశశిథర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు అందుకున్న తరువాత పార్టీలో ముఖ్యంగా గ్రేటర్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందన్న భావన అందరిలోనూ ఉంది. అన్నిటికీ మించి తన సోదరి విజయారెడ్డిని తన అభీష్ఠానికి వ్యతిరేకంగా, కనీసం తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లోనే తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయనలో అదే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే పీజేఆర్ వారసుడిగా ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోందంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ద్వారానే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. 

కేసీఆర్ చెక్కులు చెల్లలేదా!?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ సీఎం ఆర్థిక సహాయం అంటూ పంపిణీ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయా? ఆ చెక్కులు చెల్లలేదా? అంటే ఔననే అంటున్నాయి ఆ చెక్కులు తీసుకున్న రైతు కుటుంబాలు.      కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీంతో కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేసి మరీ పంపిణీ చేసిన చెక్కులు చెల్లనివా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఆరంభమైంది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతు బాంధువుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ చేసిన ఆర్థిక సహాయం ప్రచారార్భాటం కోసమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.   మేలో కేసీఆర్ ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ 1010 చెక్కులను పంపిణీ చేశారు. అవే ఇప్పుడు చెల్లలేదంటూ కొందరు మీడియాకు తెలిపారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేసీఆర్ పంపిణీ చేసిన 1010 చెక్కులలో 814 చెక్కులకు నగదు చెల్లింపులు పూర్తయ్యాయని స్పష్టం చేసింది. అంటే మిగిలిన చెక్కులు చెల్లలేదని ప్రభుత్వమే అంగీకరించినట్లైంది. అయితే ఆ చెక్కులు చెల్లక పోవడానికి ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని టీఆర్ఎస్ వివరణ ఇస్తోంది.  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనీ, అలా చేయకపోవడం వల్లనే  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదనీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి చెక్కులకు కూడా చెల్లింపులుచేయాలని తాము ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇంకా ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే   ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రాంసింగ్ ను సంప్రదించాలని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే అయినా.. పరాయి రాష్ట్రంలో వారికి ఆర్థిక సహాయం కింద చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో మాత్రం లేదని ప్రభుత్వం చెబుతోంది.  మొత్తం మీద కేసీఆర్ చెక్కులు చెల్లలేదంటూ వచ్చిన వార్తలు కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టాయి. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఇచ్చిన చెక్కులన్నీ చెల్లుబాటు అవుతాయని  ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సాంకేతిక పొరపాటుతోనే కొన్ని చెల్లుబాటు కాలేదని సర్కారు చెప్పుకుంది. రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ ఏడాది మే 22న 1010 చెక్కులను పంపిణీ చేసిన సంగతి విదితమే.  ఈ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని తాజాగా మీడియాలో వార్తలు రావడంతో   తెలంగాణ ప్రభుత్వం తక్షణం   విచారణ జరిపించింది. ఆ విచారణలో  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం   చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్  చేయకపోవడం వల్ల  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదని తేలింది.  వాటిని రీవాలిడేట్ చేసి నగదు చెల్లింపులు పరపాలని  ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. . 

గోదావరి జిల్లాల్లో సైకిల్ స్పీడ్.. బాబు పర్యటనకు జన సునామీ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా అంటే తెలుగుదేశం శ్రేణులు సహజంగానే ఔనని అంటాయి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న జన సందోహాన్ని చూసి పరిశీలకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనలోనైనా, గత రెండు రోజులుగా గోదావరి జిల్లాలలో పర్యటనకైనా జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారేమీ తరలిస్తే వచ్చిన జనం కాదు. చంద్రబాబు పర్యటన ఐదారు షెడ్యూల్ కంటే ఐదారు గంటలు ఆలస్యమైనా జనం ఓపికగా వేచి చూస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. వైసీపీపై ఆయన విమర్శలకు చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారు. గతంలో అంటే తన హయాంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ఔను నిజమే అని ఆమోదం తెలుపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వాతావరణమే పరిశీలకులు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం తధ్యమన్నఅంచనాకు వచ్చేలా చేశాయి. అన్నిటికీ మించి  గోదావరి జిల్లాల దీవెన ఏ పార్టీకి లభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. గత ఎన్నికలలో వైకాపీ అధికారంలోకి వచ్చిందంటే గోదావరి జిల్లాలలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడమే కారణం. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ  స్థానాలలో విజయం సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నది ఇప్పటి వరకూ రుజువౌతూ వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత గోదావరి జిల్లాల పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి వస్తుండటంతో వైసీపీలో కలవరం కనిపిస్తోంది. జనం చంద్రబాబు రాకకోసం గంటల తరబడి వేచి చూడటమే ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో  ఎత్తి చూపుతోంది.  ఈ పరిస్థితి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్న మొన్నటి వరకూ పొత్తులు, పొడుపులుపై జరిగిన చర్చ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. జనం తెలుగుదేశం అధినేత పర్యటనలకు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే.. రాష్ట్రం పురోగమించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అన్న నిర్ణయానికి వారు వచ్చేశారా అనిపించక మానదు. తెలుగుదేశంలో కూడా అదే ధీమా కనిపిస్తోంది.  పొత్తులతో సంబంధం లేకుండానే  అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో విజయం ఖాయమన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు జనం నీరాజనాలు పలుకుతుండటంతో తిరుగులేదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 2019 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు పెట్టని కోటగా ఉండేవి. అయితే 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ పై చేయి సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 29 స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం కేవలం ఐదు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబూ అంటూ జనం బాధపడేలా చేశారని అంటున్నారు.   ఈ పరిస్థితి ఒక్క గోదావరి జిల్లాల్లోనే  కాదు రాష్ట్రమంతటా ఉందని కూడా చెబుతున్నారు. ఆఖరికి రాయలసీమలో కూడా ఈ సారి అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెబుతున్నారు. పరిశీలకులు సైతం ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్ల సునామీగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రంగంలో జనసేన వంటి పార్టీలు ఉన్నా..ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబే గట్టెక్కించగలరని ప్రజలు భావిస్తున్నారని రాజకీయవర్గాలలో సైతం చర్చ నడుస్తోంది. 

పిల్లల స్కూలు బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు

సమాజం ఎటుపోతోంది. పిల్లల్లో పెడపోకడలు పెచ్చరిల్లుతున్నాయి. సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగులలో ఏం ఉంటాయి. పెన్నులు, పెన్సిళ్లు, చిరు తిండ్లు, ఇంకా చెప్పుకోవాలంటే పుస్తకాల పేజీల మధ్యలో నెమలీకలు. కర్నాటక రాజధాని బెంగళూరులో పిల్లల స్కూలు బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు దొరికాయి. అంతేనా వారి వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇటీవల పాఠశాల విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్ లు తీసుకువస్తున్నారన్న సమాచారంతో కర్నాటక  ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (కేఏఎంఎస్‌) పిల్లల బ్యాగులను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు   పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసిన టీచర్ల షాక్ అయ్యారు. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లు, అధిక మొత్తంలో నగదు కనిపించాయి. కొందరు విద్యార్థుల వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్‌) లభించాయి.  దాంతో  స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చాయి. పిల్లల భవిష్యత్ కోసం సంపాదనలో పడి ప్రస్తుతం వాళ్లు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకోకపోవడం వల్లే పిల్లలు పెడపోకడలకు పాల్పడుతున్నారని నిపుణులు అంటున్నారు. కాగా పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు ఉండటం కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  తమ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు దొరికాయని తెలిసి తల్లిదండ్రులు సైతం నివ్వెరపోయారు. ఇవేవీ తమకు తెలీదన్నారు.  

కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు..లోకేష్

వైసీపీ నేతల బెదరింపులు, హెచ్చరికలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో తెలుగుదేశం దూకుడు పెంచింది. ఇప్పటి వరకూ చిన్న పాటి విమర్శకు కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయి బూతుల పంచాంగంతో విరుచుకుపడి ఎదురుదాడికి దిగేవారు. అయితే గత కొన్ని రోజుల నుంచీ సీన్ మారిపోయింది. వైసీపీ నేతల విమర్శలపై తెలుగుదేశం నాయకులు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. భాష మర్యాద దాటకుండానే పంచ్ లతో, సెటైర్లతో దుమ్ము దులిపేస్తున్నారు. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలకు తాజాగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే అన్నో, తమ్ముడో నన్ను చంపేస్తాడంట..కానీ మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు, కేసులకు భయపడే బెదిరింపులకు, కేసులకు మేం పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ.. నేను నీలాగా కాదు అంటూ లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై జగన్ సర్కార్ హత్యాయత్నం, ఎస్సీఎస్టీ  అట్రాసిటీస్ సహా 15 కేసులు పెట్టిందన్నారు.  మేం సవాల్ చేస్తే నోరెత్తని వైసీపీ నేతలు చంపేస్తామంటూ బెదరించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 

టెస్టు మ్యాచే..టి20 కాదు.. పాక్ తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ పరుగుల సునామీ

ఇంగ్లాండ్ వీర బాదుడు.. టెస్ట్ మ్యాచ్ లో టి20ని మించిన దూకుడుతో చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్ లో ఒకే రోజులో 506 పరుగులు చేసింది. అసలు జరుగుతున్నది టెస్ట్ మ్యాచా టి20 మ్యాచ్చా అన్న అనుమానం కలిగేలా ఆడింది. ఇంగ్లాండ్ పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అదీ పాకిస్థాన్ గడ్డపై. ఇంగ్లాండ్ పాకిస్థాన్ లో సిరిస్ ఆడి 17 ఏళ్లయ్యింది. అంటే 17 ఏళ్ల విరామం తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్లు తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే సిరీస్ ఎలా ఉండబోతోందో రుచి చూపించేసింది. అసలు ఇటీవలి కాలంలో అంటే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ దూకుడుకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిపోతోంది.   టీ20ల్లోనే కాదు టెస్టుల్లో కూడా ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు బాదుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా  సిక్స‌ర్లు, ఫోర్లు బాదేస్తూ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన మ‌జాను అందిస్తున్నారు.  ఇక  రావ‌ల్పిండి వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు బెన్ డ‌కెట్‌(107; 110 బంతుల్లో 15 ఫోర్లు), జాక్ క్రాలే (122 ; 111బంతుల్లో 21 ఫోర్లు), వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ ఓలీపోప్‌(108; 104 బంతుల్లో 14 ఫోర్లు), హ్యారీ బ్యూక్‌(101 నాటౌట్; 81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు, వీళ్ల వీర బాదుడుతో జరుగుతున్నది టెస్ట్ మ్యాచా లేక టి20 మ్యాచా అన్న అనుమానం కలిగింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల ధాటికి పాక్ బౌల‌ర్లు, ఫీల్డర్లు కూడా ప్రేక్షకుల్లా మారిపోయారు. ప్రేక్షక పాత్ర‌కే ప‌రిమితం అయ్యారు. సౌద్ ష‌కీల్ వేసిన 68 ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్ 6 బంతుల‌ను ఫోర్లుగా మ‌లిచాడు. ఆట ఆఖ‌ర్లో కెప్టెన్ బెన్‌స్టోక్స్‌(34; నాటౌట్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) విరుచుకుప‌డ్డాడు. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో ఒక్క జో రూట్‌(23; 31 బంతుల్లో 3 ఫోర్లు) మిన‌హా అంద‌రూ రాణించారు.  

సిట్ డీలా.. ఈడీ దూకుడు

తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కంటే కూడా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మథ్య యుద్ధం జోరుగా సాగుతోంది. మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఐటీ, ఈడీలు రాష్ట్రంలో దూకుడు పెంచితే.. వాటికి బ్రేక్ వేయడానికా అన్నట్లుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఈడీ, సీబీఐని మించి ఆరంభంలో సిట్ దూకుడుగా ముందుకు సాగింది. రాష్ట్రం దాటి వెళ్లి మళ్లీ కొనుగోలు బేరసారాల గుట్టుమట్టు ఛేదించేస్తున్నామన్నంత బిల్డప్ ఇచ్చింది. బీజేపీలో కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసింది. ఏదో బ్రహ్మాండం బద్దలైపోతోందా అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సిట్ దూకుడు ముందు ఈడీ, సీబీఐల దూకుడు తేలిపోయిందా అన్న అభిప్రాయం ఏర్పడేలా చేసింది. అయితే రోజులు గడిచే కొద్దీ సిట్ ది ఆరంభ ఆర్భాటమేనని తేలిపోతే.. ఈడీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ కుమార్తె జోలికి రాని ఈడీ తాజాగా అరోరా రిమాండ్ రిపోర్టులో వంద కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని పేర్కొంది. అదే సమయంలో సిట్ ఎన్ని నోటీసులు జారీ చేసినా, లుక్ ఔట్ నోటీసులంటూ హడావుడి చేసినా తెలంగాణ బయట వ్యక్తులను ఒక్కరిని కూడా విచారణకు రప్పించలేకపోయింది. లుకౌట్ నోటీసులతోనూ సిట్ ఏమీ సాధించలేకపోయింది. అయితే సిట్ హడావుడిపై నిందితులుగా చెప్పబడుతున్న వారే కాదు.. సామాన్య జనం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలతోనే గతంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతిని ప్రస్తావిస్తూ.. అప్పట్లో పెద్ద మొత్తంలో సొమ్ము లభ్యమైందనీ, ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ చేబుతున్నా ఎక్కడా డబ్బు దొరకకపోవడమే ఈ స్టింగ్ ఆపరేషన్ అంటే కేసీఆర్ అండ్ కో చెబుతున్న కహానీలో చాలా లొసుగులున్నాయని పరిశీలకులు అంటున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య పోటీలో సిట్ వెనుకబడిపోయిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు   కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు  బంధాలు పడుతున్నాయి. బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ   ప్రణాళికాబద్దంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరా ను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం… ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు. ఇప్పుడ వారికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది.  ఇక సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో… హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొదటికే మోసం తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అరెస్టు చేసుకుంటారా చేసుకోండి.. భయపడేదే లే.. కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. తొలి నుంచీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ సీబీఐ, ఈడీ విచారణ్లలోనూ ఇప్పటి వరకూ కవిత పేరు బయటకు రాలేదు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయంగా కేసీఆర్ కుటుంబాన్ని అప్పతిష్టపాలు చేయడానికే నంటూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు వాస్తవమేనా అని అనుమానాలు సైతం రాజకీయ వర్గాలలో వ్యక్తం అయ్యాయి.   అయితే ఈడీ దర్యాప్తులో భాగంగా కవితకు సన్నిహితులుగా పేరొందిన అభిషేక్ రావు అరెస్టుతో మళ్లీ కవిత లక్ష్యంగా విమర్శలు గుప్పుమన్నాయి. ఆ తరువాత మళ్లీ చల్లబడ్డాయి. తొలుత ఈ స్కాంలో తనపై ఆరోపణలు చేయకుండా కవిత కోర్టుకు వెళ్లారు కూడా. అయితే ఇప్పుడు  ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి అందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు  ప్రస్తావించింది. . సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని, ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది.. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవితలు ప్రధానంగా సూత్రధారులు కాగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కో ఆర్డినేట్ చేశారనీ ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.   ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చేశారనీ ఈడీ ఆరోపించింది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. అనంతరం వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఓ చార్జిషీటు.., ఈడీ ఓ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ రెండు చార్జిషీట్లలోనూ కూడా   కవిత పేరు లేదు.  ఇప్పుడు.. దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇహనో ఇప్పుడో కవితకు నోటీసులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.  కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో  నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానిగా మోదీ అధికారంలో వచ్చాకా ఇప్పటి వరకూ   తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో ఆయా రాష్ట్రాలలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని కవిత అన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు ఎన్నికల సంవత్సరంలో ఈడీ వెళుతుండటం ఈ ఎనిమిదేళ్ల కాలంలో మామూలైపోయిందన్నారు.  మోడీ దేశంలోని బీజేపీ యేతర ప్రభుత్వాల కూల్చివేతలకు కుట్రలు పన్నడమే పాలన అనుకుంటున్నారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రానికి ఈడీ వచ్చిందని కవిత అన్నారు.   తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని... వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని అన్నారు. జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని... పెట్టుకో అని కవిత అన్నారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు.  

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కారల్ మార్క్స్. అయితే ఆయన అన్నది ఒక అర్ధంలో అయితే అనుబంధాలకే అర్ధం మారిపోయిన ఈ కలికాలంలో ఆర్థిక ప్రయోజనాల కోసమే మానవ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారా అన్నట్లుగా ఉంటోది కొందరి తీరు. రాజస్థాన్ లో కట్టకున్న భార్యను అత్యంత కిరాతకంగా కారుతో తొక్కించి హత్య చేశాడో మృగాడు. కారణమేమిటో తెలుస్తే ఇంత దారుణమా అనక మానరు ఎవరైనా. రాజస్థాన్ లో మహేష్ చంద్ అనే వ్యక్తి తన భార్య షాలును కారుతో తొక్కించి దారుణంగా హతమార్చాడు. కేవలం భార్యపేరున ఉన్న రూ. కోటి 90 లక్షల బీమా సోమ్ము కోసమే అతడీ దారుణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 5వ తేదీన ఈ హత్య జరిగింది. తన కజిన్ తో కలిసి ఆలయానికి బైక్ పై వెళుతున్న షాలూను ఓ స్పోర్ట్స్ వెహికిల్ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో షాలూ అక్కడికకడే మరణించింది. ఆమె కజిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తొలుత అంతా ఇది యాక్సిడెంటే అనుకున్నారు. అయితే షాలూ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. భార్య పేరు మీద ఉన్న బీమా సొమ్ముల కోసం భర్తే ఈ యాక్సిడెంట్  చేశాడని తేలింది. భార్యను హత్య చేయడానికి మహేష్ చంద్ రౌడీ షీటర్ తో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.  2015లో మహేశ్-షాలు ల వివాహమవ్వగా.. ఒక కుమార్తె ఉంది. రెండేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో షాలు తన పుట్టింట్లోనే ఉంటోంది. 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల షాలు పేరుపై ఇన్సూరెన్స్ చేయించిన చందు.. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు. తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. భర్తపై గుడ్డి  నమ్మకమే ఆమె ప్రాణాలు హరించింది. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు, ఎస్ యూవీ యజమాని, సోనులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహేశ్, మరోకరి కోసం గాలిస్తున్నారు.