Read more!

ఇదేం పని.. ఐటీ ఉద్యోగుల కష్టాలు పగోడికి కూడా వద్దు!

విపరీతమైన పని ఒత్తిడి, నెత్తిమీద వేలాడుతున్న రిట్రెంచ్ మెంట్ కత్తి.. మొత్తానికి ఐటీ కొలువు చేసేవారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.  దీంతో ఐటీ ఉద్యోగుల పరిస్థితి కుడితిలో పడ్ట ఎలుకలా కొట్టుకుంటున్నట్లు ఉంది. వేళా పాలా లేదు.. సమయం సందర్భం లేదు.. పని పని.. సెలవు కావాలంటే కొలువు వద్దంటారన్న భయం. చెప్పిన పని చెప్పిన వెంటనే చేయకుంటే.. ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నిత్య నరకంగా మారిపోయింది ఐటీ ఉద్యోగుల జీవితం.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం.. ఐటీ ఉద్యోగుల పాలిట కరోనాను మించిన మహమ్మారిగా మారిపోయింది. కరోనా వీడిపోయి మామూలు పరిస్థితులు ఏర్పడినా ఐటీ ఉద్యోగులకు మాత్రం ఆఫీసుకు వెళ్లి రావడంతో కొలువు ఆ రోజుకు అయిపోయినట్లు కాదు.. ఇంట్లో కూడా పని చేయకతప్పని అనివార్య పరిస్థితులు వచ్చి పడ్డాయి. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగులకు కంపెనీలు ఉద్వాసన పలుకుతున్న కారణంగా ఏం అంటే ఏమౌతుందోనన్న భయంతో యాజమాన్యం ఏం చెబితే అది, ఎలా చెబితే అలా పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

దీంతో ఐటీ ఉద్యోగులకు ఒత్తిడే ఉద్యోగంగా మారిపోయింది. అదిగో అలాంటి స్థితిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. పెళ్లి పీటల మీద కూర్చుని కూడా ఆఫీసు పనిని తదేక దీక్షతో చేస్తున్న ఆ యువకుడి పరిస్థితి ఐటీ ఉద్యోగుల దురవస్థకు అద్దం పడుతోంది. సమయం, సందర్భం అంటూ లేకుండా 24 గంటలూ పని చేస్తేనే కొలువు భద్రం అన్న భావనను ఉద్యోగులలో కల్పించి మరీ యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి ఐటీ కొలువులు చేస్తున్న వారందరికీ పెళ్లి పీటల మీదా పనితో కుస్తీపడుతున్న ఈ యువకుడి వీడియో బాగా కనెక్టయ్యింది. సెలవులు లేవు, శాలరీ హైకులు లేవు.. పని మాత్రం అంతులేకుండా ఉంటుంది.  ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు బాబోయ్ అని నెటిజన్లు అంటున్నారు.