మార్చి పోతే సెప్టెంబర్ ఉంది.. రాజకీయాల్లో వైఫల్యంపై జనసేనాని!

విద్యార్థులు పరీక్షలో ఫెయిలై బాధపడుతుంటే.. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు ఓదారుస్తారు. మార్చిలో ఫెయిలైతే ఏమైంది సెప్టెంబర్ ఉందిగా శ్రద్ధగా పట్టుదలగా చదివి ఈ సారి పాసవుదువుగాని లే అంటారు. అదే ఆ విద్యార్థే తాను ఫెయిలయ్యాననీ, ఈ సారి గట్టిగా చదివి పాసౌతాననీ అంటే.. ఏంత నిర్లక్ష్యం.. సరిగా ప్రిపేర్ కాకుండా ఎందుకు ఉన్నావు. ఒక ఏడాది నష్టపోవడమంటే కెరీర్ లో ఎంత వెనుకబడిపోతావు అంటూ అక్షింతలు వేస్తారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 తన వైఫల్యాన్ని అంగీకరించడం కూడా విద్యార్థి పరీక్ష ఫెయిలవ్వడం లాంటిదేనని చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో తాను విఫలమయ్యాననీ, అయితే పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు.  హైదరాబాద్ శిల్పకళా వేదికలో  చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించిన ఆయన జీవితంలో కష్టాలు, ఓటములను అధిగమించాలని చెప్పారు. చార్జెడ్ అక్కౌంట్స్ ఎంత కష్టమో తనకు తెలుసునన్నారు. అందుకే ఫెయిలయినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తననే ఉదాహరణగా చెప్పారు. రాజకీయాలలో తాను విఫలమయ్యానన్నారు. అయితే పట్టు వదలకుండా మళ్లీ ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. 2019లో తాను ఫెయిలయ్యానని.. కానీ నిరాశ చెందకుండా.. పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాన్నారు.  వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూడాలన్నారు. తాను సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాననీ, అయితే అందుకోసం ఏమీ చేయకుండా కూర్చునే రకం తాను కాదనీ అన్నారు.  తాను విఫల  రాజకీయ నేతనన్న విషయాన్ని స్వయంగా అంగీకరించడానికి తనకేం అభ్యంతరం లేదనీ, ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్ విజయానికి పునాదులనీ పవన్ అన్నారు.  మార్చి పోతే సెప్టెంబర్.. సెప్టెంబర్ పోతే మార్చి.. ఇలా అవకాశాలు వస్తూనే ఉంటాయన్నారు. వైఫల్యం  విజయానికి   బాట వేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు తానే తానొక విఫల రాజకీయవేత్తనని పవన్ కల్యాణ్ చెప్పుకోవడం రాజకీయవర్గాలనే కాకుండా జన శ్రేణులను కూడా విస్మయ పరిచింది.  విద్యార్థులలో స్ఫూర్తి నింపడం అన్న పేరుతో పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వెరైటీ వెడ్డింగ్ కార్డ్

నలుగరికీ నచ్చినదీ నాకసలే నచ్చదులే..అన్నట్లు ఇటీవలి కాలంలో   కొత్త కొత్త థీమ్ లతో పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచే జంటల సంఖ్య ఎక్కువ అవుతోంది. థీమ్ లనే కాకుండా పెళ్లి డెకరేషన్ ల నుంచి బరాత్ ల వరకూ అన్నీ వెరైటీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య అప్పగింతల సమయంలో పెళ్లి కూతురు బుల్లెట్ బండెక్కి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఓ పెళ్లి కొడుకు సైకిల్ మీద మంటపానికి వచ్చి నెటిజన్ల మన్ననలు పొందాడు. అలాగే ఎన్నో ఎన్నెన్నో వెరైటీ పెళ్లిళ్లు. అయితే పెళ్లి విషయంలోనేనా వెరైటీ.. పెళ్లి పత్రికలో కూడా తమదైన ప్రత్యేకత చూపాలనుకున్నారో జంట. అందుకే ఒకింత క్రేజీగా ఆలోచించారు. థీమ్ మ్యారేజెస్ మాత్రమే కాదు.. థీమ్ వెడ్డింగ్ ఇన్వినేషన్ తో సర్ ప్రైజ్ చేయాలనుకున్నారు. వారి సృజనకు పదును పెట్టి స్టాక్ మార్కెట్ థీమ్ తో వెడ్డింగ్ కార్డ్ రూపొందించారు. మహారాష్ట్రకు చెందిన ఓ జంట తన వెడ్డింగ్ ఇన్విటేషన్ ను వెరైటీగా డిజైన్ చేశారు. స్టాక్ మార్కెట్ థీమ్ తో రూపొందించిన ఆ వెడ్డింగ్ కార్డులో ఆహ్వానితులను ప్రమోటర్లుగా, ఆహ్వానితులన ఇన్వెస్టర్లుగా పేర్కొన్నారు. ఇక ఐపీవో ఇన్విటేషన్ ఆఫ్  ప్రిషియస్ అకేషన్, వివాహ వేడుకలను అంటే వివాహతేదీ, రిసెప్షన్ వంటివాటిని బిడ్డింగ్ డేట్స్ గా ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. కల్యాణ వేదిక అయితే ఏకంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ గా అభివర్ణించారు. వివాహ విందును మధ్యంతర డివిడెంట్ పే ఔట్ గా పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్ సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంతకీ తమ పెళ్లికి ఇంత వెరైటీగా, ఇన్నోవేటివ్ గా వెడ్డింగ్ కార్డు రూపొందించిన జంట ఏ ఇన్వెస్టర్లో, స్టాక్ బ్రోకర్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ వెడ్డింగ్ కార్డును వెరైటీగా ప్లాన్ చేసిన ఆ జంట వైద్య జంట. మొత్తం మీద తమ పెళ్లి కార్డుతోనే ఈ జంట నెట్టింట పాపులర్ అయిపోయింది.

షర్మిల తాకారంటూ అమరవీరుల స్థూపానికి పాలాభిషేకంతో శుద్ధి

 రాజకీయ విభేదాలు శత్రుపూరిత వైరుధ్యాలకు దారి తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా తెరాసపై విమర్శల దూకుడు పెంచారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఘటన అనంతరం షర్మిల ప్రగతి భవన్ ముట్టిడికి వెళుతున్న సందర్బంగా ఆమెను అరెస్టు చేయడం... వాహనంలో ఆమె ఉండగానే టోయింగ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించడం వంటి ఘటనల తరువాత తెరాస, వైఎస్సార్టీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ వరుస సంఘటనలు జరగడానికి ముందు వరకూ తెరాసపై షర్మిల తెరాస అగ్రనేత సహా నాయకులపై విమర్శలతో మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఎప్పుడూ ఎక్కడా తెరాస నుంచి ప్రతిఘటన రాలేదు. ఆమె విమర్శలను దీవెనగా తీసుకుంటున్నారా అన్నట్లుగా తెరాస వ్యవహార తీరు ఉంటూ వచ్చింది. మరి హఠాత్తుగా పరిస్థితిలో ఎందుకు మారింది అన్నదానికి పరిశీలకులు పలు విధాల విశ్లేషణలు చేస్తున్నారు అది వేరే సంగతి. ఇక తెరాస, వైఎస్సాటీపీ అధినేత్రి మధ్య ప్రత్యర్థి అన్న సరిహద్దు చెరిగిపోయింది. శత్రువైరుధ్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ గన్ పార్క్ లోని  అమరవీరుల స్ఫూపాన్ని షర్మిల తాకారంటూ టీఆర్ఎస్ ఓయూ విద్యార్థి సంఘం ఆ స్ఫూపాన్ని పశుపుతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. షర్మిల తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తెలంగాణ రాకుండా అడ్డుకున్నారనీ, ఇప్పుడు ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో కుట్రలు చేస్తున్నారనీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. 

తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు ఉన్నట్లా లేనట్లా?

తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గత ఆగస్టులోనే రద్దు చేసినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం అక్టోబర్ నెల చివరిలో బయటపెట్టింది. అందుకు కారణం పెద్దగా ఊహాతీతమైనదేమీ కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను రక్షించడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత సీబీఐ బోనులో నిలబడకుండా కాపాడుకునేందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుందన్న చర్చ అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా సాగింది.   అయితే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో సోదాలు నిర్వహించింది. కవిత సన్నిహితుడు బోయనపల్లి అభిషేక్ రావును అరెస్టు చేసింది.   అప్పుడెప్పుడూ రాష్ట్రంలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దయ్యిందని బయటపెట్టని కేసీఆర్  సర్కార్    కవిత వద్దకు సీబీఐ వచ్చేస్తున్నదా అన్న అనుమానం కలగగానే దానిని బయట పెట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి విదితమే.   అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో మరిన్ని సోదాలను, కవిత సహా మరింత మంది విచారణను సీబీఐకి జనరల్ కన్సెంట్ నిరాకరిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ఇసుమంతైనా అడ్డుకోలేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు.  ఇప్పుడు ఢిల్లీ కుంభ కోణం కేసులో కవితను సీబీఐ హైదరాబాద్ లోనే, అదీ ఆమె నివాసంలోనే విచారించనుంది. దీంతో అప్పటి విశ్లేషకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అక్షర సత్యాలని తేలిపోయింది. లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు హైదరాబాదే సేఫ్ ప్లేస్‌గా కవిత భావిస్తున్నారు. ఢిల్లీలో అయితే ఏం జరుగుతుందో తెలియదు కనుక,  ఎందుకైనా మంచిదని హైదరాబాద్ ను అందులోనూ తన నివాసాన్ని ఎంచుకున్నారు. అలాగే హైదరాబాద్‌లో విచారణ అంటే.. జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం అవుతుందని ఊహించిన సీబబీఐ వ్యూహాత్మకంగా ఢిల్లీ ఆర్ హైదరాబాద్ అని  కవితకు ఆప్షన్ ఇచ్చిందని కూడా అంటున్నారు. ఇప్పుడు జనరల్ కన్సెంట్  రద్దు ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పరిశీలకుల కథనం ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డను రక్షించుకోవడం కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా జనరల్ కన్సెంట్ రద్దు చేసినా.. ఆ రద్దుకు ముందే నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ యథేచ్ఛగా ముందకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర బయట నమోదైన కేసులలో జనరల్ కన్సెంట్ రద్దైన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటే.. వారిని సీబీఐ విచారించడాన్ని ఆ రద్దు ఏ విధంగానూ అడ్డుకోలేదు. అంటే ఎమ్మెల్సీ కవితకు ఈ జనరల్ కన్సెంట్ రద్దు వల్ల ఎలాంటి ఊరటా లభించే అవకాశం లేదు. దీంతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ చేసిన జనరల్ కన్సెంట్ రద్దు ఒక విఫలప్రయత్నమేనని పరిశీలకులు అంటున్నారు. 

‘కాపు’ కాసేది ఎవరికో ?

అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇప్పడు అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అయినా, కాపు సామాజిక వర్గానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత కాదన లేనిది. రాష్ట్ర జనాభాలో 15 శాతం పైగా ఉన్న  కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే, ‘కాపు’  ఓటు, ఏ పార్టీని కాపు కాస్తే, ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ విశ్వాసం బలంగా స్థిరపదిండి. ఆ కారణంగానే  కాపు  జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలలో ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఒక నమ్మకం ఏర్పడింది.  రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో కూడా  అదే జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో జరిగిన అవశేష ఆంధ్రప్రదేశ్’ తొలి శాసన ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను 25 స్థానాలు తెలుగు దేశం పార్టీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది.అలాగే, 2019 ఎన్నికల్లో  ఉభయగోదావరి జిల్లాలలోని 34 స్థానాలకు గాను, 27 స్థానాలు వైసీపీ గెలుచుకుంది.రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.  అదలా ఉంటే, రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నరకు పైగానే సమయం వున్నా,  ఎన్నికల పరుగు మాత్రం ఇప్పటికే ఊపందుకుంది.అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పుడు ‘కాపు’ ఓటును చేరుకుందుకు తెలుగు దేశం,వైసీపీలతో పాటుగా బీజేపీ కుడా పావులు కదుపుతోంది. నిజానికి, తెలుగు దేశం ఆవిర్భావం మొదలు, కాపుసామాజిక వర్గం ప్రధానంగా టీడీపీతో కలిసి నడుస్తోంది. అయితే, 2008 అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో సామాజిక సమీకరణల్లో కొంత మార్పు వచ్చింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో, ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 18 శాతం పైగా ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత చిరంజీవి తమ పార్టీని కాంగ్రెస్’లో విలీనం చేయడంతో 2014ఎన్నికల్లో, కాపు ఓటు తిరిగి (టీడీపీ)  సొంత గూటికి చేరింది. అలాగే, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన టీడీపీతో చేతులు కలపడంతో ఇక తిరుగే లేక పోయింది.  ఇక ప్రస్తుతానికి వస్తే,  ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నా, కాపు సామాజిక వర్గం మాత్రం, ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి’ మాటలు నమ్మి ఓటేస్తే కాపు రిజర్వేషన్ మాట దేవుడెరుగు కాపుల సంక్షేమం ఊసే లేకుండా మూడేళ్ళు గడిపేశారని కాపులు గుర్రుగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాపుల రిజర్వేషన్ కోసం చిత్త శుద్దితో కృషిచేశారని, కానీ, జగన్ రెడ్డి రిజర్వేషన్ విషయాన్ని పూర్తిగా అట కెక్కించారని , కాపు నేతలు ఆరోపిస్తున్నారు.నిజానికి,  2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు తెచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేసి  కాపు రిజర్వేషనను అడ్డుకుంది. అయినా, చద్రబాబు నాయుడు ప్రభుత్వం, జనరల్‌ కేటగిరిలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కోసం మరోప్రయత్నం చేసింది. అయితే, ఈసారి సుప్రీంకోర్టు అడ్డుపుల్ల వేసింది. ఇక ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్’ అంశాన్ని పూర్తిగా అటకెక్కించింది. అందుకే, కాపు సామాజిక వర్గం చిరకాల స్వప్నం, కాపు రిజర్వేషన్ ఏదో విధంగా సాకారమావ్వాలంటే, అది ఒక్క చంద్రబాబుతో మాత్రమే సాధ్యమనే నిర్ణయానికి ఆ వర్గం ప్రజలు వచ్చారు. అందుకే, ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి కాపు కాయాలనే నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, కాపు సామాజిక వర్గానికి చెందిన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో చేతులు కలపాలని కాపు నేతలు కోరుకుంటున్నారు.  అటు టీడీపీ ఇటు జనసేనే కాదు బీజేపీ కూడా కాపు ఓట్ల కోసం కుస్తీ పడుతోంది. గత ఎన్నికల్లో జగన్‌ కి మద్దతుగా నిలిచిన కాపు వర్గాన్ని ఈసారి తమవైపు తిప్పుకునేందుకు కాపు రిజర్వేషన్ అంశాన్ని, బీజేపీ   మళ్లీ తెరపైకి తెచ్చింది.ఇప్పటికే ఆపార్టీ నేత కన్నాలక్ష్మీనారాయణ సీఎం జగన్‌ కి లేఖ కూడా రాశారు. నిజానికి రాజకీయ పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా, కాపు  సామాజిక వర్గం మాత్రం, నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గోదావరి  జిల్లాల పర్యటనలో అదే స్పష్టమైంది. ఈ  నేపధ్యంలోనే అధికార వైసీపీ, కాపు నేతలు ఆత్మీయ సమ్మేళనాలతో కాపులకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.అయితే,మూడేళ్ళుగా కాపు నేస్తంతో కాలక్షేపం చేస్తున్న జగన్ రెడ్డి పాలనతో విసుగెత్తి పోయిన కాపు సామాజిక వర్గం ... చాలు జగన్ ..సెలవు జగన్’ అంటున్నది.

160 సీఆర్పీసీలో ఉన్న వెసులు బాటు మేరకే.. ఇంటి వద్దే కవితను విచారించనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  సీబీఐ తెరాస ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. కవితకు లిక్కర్ స్కాంలో నోటీసులు రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఎంత మాత్రం కాదు. అసలీ స్కాం బయట పడినప్పటి నుంచీ కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ కుంభకోణంలో తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర కీలకం అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక దశలో తనపై ఆరోపణలు చేయరాదంటూ ఆమె కోర్టు కు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ కుంభకోణం కేసులోనే కవితకు సన్నిహితుడిగా చెప్పే అభిషేక్ రావు అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తెరాస రాజకీయ కుట్ర కోణం ఉందంటూ ఆరోపణలు గుప్పించింది. కవితను కమలం గూటికి చేరాలని ప్రలోభ పెట్టారనీ, అందుకు ఆమె ససేమిరా అనడంతోనే కుంభకోణంలో ఇరికించారనీ తెరాస ఆరోపణలు గుప్పించింది. అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్నితెరమీదకు తెచ్చి దర్యాప్తునకు సీట్ ఏర్పాటు చేసి బీజేపీని ఇరుకున పెట్టేందుకు తెరాస ప్రయత్నించిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జోరందుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ  కవితకు నోటీసులు జారీ చేసింది. అందుకే కవితకునోటీసులు రావడంపై రాజకీయ ప్రకంపనలు ఏవీ చోటు చేసుకోలేదు. చివరికి కవిత కూడా తాను వీటి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్పందించారు. అయితే ఆ సందర్భంగానే కవిత కుంభకోణంలో ప్రమేయంపై  తనకు సంబంధం లేదనీ,  ఈ విషయం సీబీఐకి కూడా అర్ధమైందన్న సంగతి వారిచ్చిన నోటీసుల ద్వారానే తెలుస్తోందన్నట్లుగా కవిత మీడియా ముందు బిల్డప్ ఇచ్చారు. తనకు సీబీఐ160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిందని చెప్పిన కవిత.. సోమవారం (డిసెంబర్ 6) విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిందనీ చెప్పారు. అయితే విచారణ ఎక్కడ జరగాలన్న ఛాయిస్ సీబీఐ తనకే ఇచ్చిందనీ, ఇదే తన నిజాయితీకి, నిర్దోషిత్వానికి తార్కాణమన్నట్లుగా మీడియాకు చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే విచారణ జరుపుతామని సీబీఐ నోటీసులో పేర్కొందని కవిత వివరించారు. తాను సీబీఐని తన నివాసంలోనే విచారించాలని కోరారనని, ఆ మేరకు సోమవారం (డిసెంబర్ 6)  ఉదయం సీబీఐ అధికారులు తన నివాసానికే వచ్చితనను విచారిస్తారని కవిత పేర్కొన్నారు.  అలాగే కేవలం తనను వివరణ కోరడానికి మాత్రమే సీబీఐ తనకు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. అయితే కవితకు గతంలో సహాయకుడిగా వ్యవహరించిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయితిహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. శరత్‌చంద్రారెడ్డి కూడా అదే జైలులో ఉన్నారు. కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవలే ఈడీ విచారించింది.  ఈ క్రమంలోనే అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ  కవిత పేరు ప్రస్తావించిన 48 గంటల్లోనే  సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.  అన్నిటికీ మించి కవితకు 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్న మహిళలు విచారణ ఎక్కడ జరగాలన్నది తామే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదే ఇదే సెక్షన్ కింద నోటీసులు అందుకున్న పురుషులు మాత్రం దర్యాప్తు సంస్థ ఎక్కడకు రావాలని సమన్ చేస్తే అక్కడకే విచారణకు రావాల్సి ఉంటుంది. ఆ వెసులు బాటు మేరకే కవిత తన విచారణ తన నివాసంలో  జరగాలని ఎంచుకున్నారు. ఏదో తన వివరణ తీసుకుని వెళ్లిపోవడమే తప్ప సీబీఐ విచారణకు అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నట్లు మాట్లాడుతున్న కవిత.. శనివారం (డిసెంబర్ 3) ఉదయమే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కావడం... పలువురు న్యాయ నిపుణులతో చర్చించడం చూస్తుంటే.. ఏదైనా జరగొచ్చన్న భావన కవితలో ఉందన్న సంగతి అవగతమౌతుంది. అంత కంటే ముందు అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరున్నట్లు బయటకు రాగానే కవిత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అనడమే కాకుండా.. రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావన వెనుక కమలం పెద్దలున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మోడీ కంటే ఈడీ రావడం బీజేపీ దుష్ట సంస్కృతిలో భాగమేనని అన్నారు. ఆ తరువాత నోటీసులు అందగానే న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించడం.. వంటి సంఘటనలన్నీ కవిత సీబీఐ నోటీసులపై బయటకు కనిపిస్తున్నంత ధీమాగా లేరని చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. 

ఉచితం లోగుట్టు.. ప్రలోభాలతో చెంపపెట్టు!

రాజకీయ పార్టీల ఉచిత హామీల బాగోతాన్ని ఒక హోటల్ ఒక్క రోజులో బయట పెట్టేసింది.  ప్రస్తుతం చెలామణిలో లేని ఐదు పైసల నాణేన్నితీసుకువస్తే తమ హోటల్ లో 35 రకాల వంటలతో శాఖాహార భోజనం ఉచితమని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ తో జనం పెద్ద సంఖ్యలో రావడంతో.. సగం మందికి చెప్పిన ప్రకారం భోజనం వడ్డించి  మిగిలిన వారి నుంచి ముక్కు పిండి మరీ సగం డబ్బులు వసూలు చేసింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలదీ ఇదే తంతు. ఓట్లు దండు కోవడానికి అన్నీ ఉచితాలని ప్రకటించేసి పబ్బం గడిచాకా.. పన్నుల రూపంలో ఉచితాలను మించి వడ్డింపులు చేస్తారు. క్రమంగా ఉచితాలు మాయమైపోతాయి కానీ వడ్డించిన పన్నులు మాత్రం కడుతూనే ఉండాలి. ఇక ఉచితంగా షడ్రశోపేతమైన భోజనం అంటూ హడావుడి చేసిన హోటల్ విషయానికి వస్తే   ఏపీలోని ఓ రెస్టారెంట్ చెలామణిలో లేని   5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాఖాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది.  ఒకటి రెండు కాదు.. 35 రకాల వంటకాలను రుచి చూడొచ్చని బంపరాఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ ఇచ్చింది విజయవాడలోని రాజ్ భోగ్ రెస్టారెంట్.  ఈ రోజుల్లో 5 పైసల కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా ఆఫర్ పెట్టారో లేదో.. అలా 5 పైసల కాయిన్స్ పట్టుకుని రెస్టారెంటుకు జనాలు ఎగబడ్డారు. ఇంత మంది  వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే అంతకు రెట్టింపు కంటే ఎక్కువ మంది  వచ్చారని చెప్పారు. మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా వారికి సగం ధరకే అంటే.. రూ.200 భోజనం అందించామని చెప్పారు. అయినా తమ ఈ ఆఫర్ వల్ల హోటల్ కు మాత్రం గొప్ప పబ్లిసిటీ వచ్చిందని సంతోషపడ్డారు.  ఈ వివరణలోనే ఉచితాల వ్యవహారం ఏమిటో అర్ధమైపోతుంది.  రాజకీయ పార్టీలూ ఉచిత హామీలు గుప్పించేస్తూ ఓట్లకు గాలం వేస్తుంటారు. ఆ ఉచిత హామీలకు జనం మెస్మరైజ్ అయి ఓట్లు వేస్తుంటారు. అయితే ఆ ఉచితాల బాగోతం ఏమిటో జగన్  ఈ మూడున్నరేళ్ల కాలంలో జనానికి అర్ధమయ్యేలా చెబితే.. ఐదు పైసల కాయిన్ ఇస్తే ఉచిత భోజనం అంటూ ఇచ్చిన ఆఫర్ ఉచితాల బాగోతాన్ని ఒక్క రోజులోనే తేల్చేసింది. ప్రజలను ఆకట్టుకోవడానికే ఉచిత హామీలు ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. పబ్బం గడవగానే వాటికి కోతలు పెట్టేస్తుంటారు. జగన్ రెడ్డి పాలనలో ఈ మూడున్నరేళ్ల కాలంలో చూస్తున్నదదే. విపక్ష నేతగా ఉండగా ఉచితం ఉచితం అంటూ నోటికొచ్చిన ప్రతి హామీని గుప్పించిన ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల అమలు మాత్రం కోతలతో ఆరంభించి చివరకు ఎగనామం పెట్టే వరకూ వచ్చారు. అలాగే ఈ రెస్టారెంట్ పాపులర్ వావడానికి ఉచితం అన్న ఆయుధాన్ని వాడుకుంది. ఆ హోటల్ ప్రకటనను నమ్మి వచ్చిన వారిలో సగం మందికి ఉచితం హామీ ప్రకారం భోజనం అందించి... మిగిలిన వారిని సగం డబ్బులు చెల్లించి తింటే తినండి లేకపోతే మానండి అంది. ఇప్పుడు ఏపీలో జనం పరిస్థితి కూడా అలాగే ఉంది.  

బీజేపీ నేతలకు అఖిలేష్ బంపర్ ఆఫర్

రాను రాను రాజు గుర్రం గాడిద అవుతోందనే నానుడి, అప్పుడు రాజరికం కాలంలో ఏమో కానీ, ఇప్పుడు, ప్రజాస్వామ్య యుగంలో నిజం అవుతోంది. భారతీయ జనత పార్టీ ( బీజేపీ) కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, గడచిన ఎనిమిదేళ్ళలో, ప్రజాసామ్య బద్దంగా, ప్రజలు ఎన్నుకున్న తొమ్మిది రాష్ట్ర  ప్రభుత్వాలను కూల్చి వేసిందని, ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఆరోపిస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా జోడీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికార పార్టీల ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, ఐటీ, ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి, భయపెట్టి, బ్లాకు మెయిల్ చేసి ఎమ్మెల్యేలను, దుర్మార్గంగా తమ వైపు తిప్పుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ మొదలు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వరకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా ప్రతి రోజు ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో, శివసేన తిరుగుబాటు నాయకుడు షిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ ఇతర నాయకులు ‘షిండే’ నామ జపం చేస్తున్నారు. షిండేను ఓ సింబల్ గా చూపించి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపద్యంలోనే, మునుగోడు ఉప ఎన్నిక మధ్యలో ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ ను తెరమీదకు తెచ్చారు. ఓ ముగ్గురు వ్యక్తులు తెరాస ఏమ్మేల్యలతో బేరసారాలు సాగిస్తున్న ఉదంతాన్ని కెమెరాలో బంధించి, తెరమీదకు తెచ్చి బీజేపీని దేశం ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఉదందం పై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి,విచారణ జరిపిస్తున్నారు. కోర్టులు, జైళ్లు, బెయిళ్ళు గా ఆ కథ నడుస్తోంది.  మరోవంక  బీజేపీ జాతీయ నాయకులు తెరాస నాయకుల కొనుగోలుకు బేరసారాలు సాగిస్తున్నారంటూ  అందుకు సంబందించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్స్, ఇతర ఆధారాలతో, ఓ నివేదకను తయారు చేసి, సుప్రీం కోర్టు, రాష్ట్రాల హై కోర్టుల న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రదాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, దేశంలోని మీడియా సంస్థలు, మేథావులు, సామాజిక కార్యకర్తలు, ఒకరని కాదు కొన్ని వందల (?) మందికి పంపించారు.  మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ నివేదికను యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజవాదీ పార్టీ నాయకుడు,అన్నిటినీ మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి మిత్రుడు అఖిలేష్ కు పంపలేదా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ యూపీలో  ఎమ్మెల్యేల  క్రయవిక్రయయాలకు తాజాగా తెర తీశారు. యూపీ ఉప ముఖ్యమంత్రులు,కేశవ్ మౌర్య, బ్రిజేష్ పాథక్ లకు బ్రహ్మాండమైన ఉచిత బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఇద్దరిలో ఎవరైనా సరే, బీజేపీని చీల్చి ఓ వంద మంది ఎమ్మెల్యేలను తమ వెంట తెచ్చుకుంటే  ముఖ్యమంత్రి కుర్చీ ఉచితంగా ఇచ్చేస్తామని బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు.   బీజేపీని చీల్చండి, ఓ వంద మంది మీ ఎమ్మెల్యేలను తెచ్చుకోండి, మా ఎమ్మెల్యేలు ఓ వందమందిని ఉచితంగా ఇచ్చేస్తాం... మీరే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి ... ముఖ్యమంత్రి కావాలనే మీ చిరకాల కోరికను తీర్చుకోండి..” అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.  అంతే కాదు, ఈ ఉచిత ఆఫర్ కు కాలపరిమితి కూడా లేదు. ఉప ముఖ్యమంత్రులు ‘ఎప్పుడు కావాలంటే  అప్పుడు, ముఖ్యమంత్రి కావచ్చని, బంతి వారి కోర్టులోనే ఉందని, అఖిలేష్ యాదవ్ స్ట్రెయిట్ గా ముఖ్యమంత్రి కుర్చీని ఎర వేశారు. సరే,ఆ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అఖిలేష్ ఆఫర్  యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీని ముక్కలు చేస్తారా,?అది అయ్యే పనేనా? తెలంగాణలో సిపిఐ సింగిల్ ఎమ్మెల్యే సహా  కాంగ్రెస్ ,టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలని కారెక్కించిన కేసీఆర్ ఎనిమిదేళ్ళలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరిని అయినా ‘పట్టు’ కోలేక పోయారు. అలాంటిది. యూపీలో వందమంది బీజేపీ ఎమ్మెల్యేలకు వల వేయడం అయ్యే  పనేనా? అంటే, అదంతా వేరే చర్చ,కానీ, అఖిలేష యాదవ్ ఓపెన్ ఆఫర్  పై దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, జాతీయ పోరాటాలకు సిద్దమవుతున్న కేసీఆర్, ఎలా స్పందిస్తారు? ఈ విషయం దేశం తెలుసుకోవలనుకుంటోంది  అంటున్నారు, విశ్లేషకులు.

జనం మనతోనే ఉన్నారు.. మీరే జనంతో లేరు.. పశ్చిమ నేతలకు బాబు క్లాస్

చంద్రబాబు ‘పశ్చిమ’ పర్యటన తెలుగు దేశం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు ఇవేవీ కూడా జనంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణను ఇసుమంతైనా తగ్గించ లేకపోయాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఆయోమయంలో ఉన్న శ్రేణులలో చంద్రబాబు పర్యటన జరిగిన తీరు ధీమా నింపింది. ఇక మీదట కూడా పార్టీ స్థానిక నాయకత్వం ఇదే ధోరణిలో ఉంటే నిలదీసే దన్ను దమ్మూ ఇచ్చింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా పార్టీ నేతలతో భేటీలో చెప్పారు. జనం మనతోనే ఉన్నారు.. కానీ మీరే జనంతో లేరు. ఇకనైనా తీరు మార్చుకోండి అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇక బాబు చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటన తెలుగుదేశం పార్టీకి జవసత్వాలను నింపిందనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గోవవరి జిల్లాలలో పర్యటించిన నియోజకవర్గాలలో పార్టీ ఇన్ చార్జీలు లేరు.. ఆయా నియోజకవర్గాలలో నాయకుల మధ్య సమన్వయమూ అంతంత మాత్రమే. అయినా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటనకు జనం వరద గోదావరిలా పోటేత్తారు. ఆంక్షణ కరకట్టలను తెంచేసి మరీ ముందుకు దూకారు. వెళ్లిన రెండు పెద్ద నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలు లేరు. ఉన్న నాయకుల మధ్య సమన్వయలోపం. అయినా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు చంద్ర బాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన  తెలుగుదేశం కూడా ఊహించనంతగా విజయవంతం అయ్యింది. బాబు కోసం జనం ఉరకలెత్తి పోటెత్తి రావడం    తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది.  నేతల మధ్య సమన్వలోపంతో ఒకింత అసంతృప్తితో ఉన్న క్యాడర్ కు చంద్రబాబు పర్యటన వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.  అదే సమయంలో టీడీపీ వస్తే ఇప్పటి పథకాలు నిలిచిపోతాయన్న అధికార వైసీపీ ప్రచారానికి తిప్పి కొడుతూ చంద్రబాబు స్పష్టత ఇవ్వడం సంక్షేమాన్ని కొనసాగిస్తూనే సంపద సృష్ఠించి అభివృద్ధి చేస్తానని చెప్పడం తెలుగుదేశం నేతలలోనూ స్థైర్యాన్ని నింపింది.   ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన   పర్యటన తెలుగే దేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు.. జనంలోనూ తమ బతుకులు బాగుపడతాయన్న స్థైర్యాన్నిచ్చింది. బాబు పర్యటన లో తీవ్ర జాప్యం జరిగినా జనం ఆయన కోసం గంటల తరబడి వేచి చూడటం ఎన్టీఆర్ ప్రభంజనం నాటి రోజులను గుర్తు చేసిందని పరిశీలకులు చెబుతున్నారు.  దెందులూరు, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నిడదలవోలు, తాడేపల్లిగూడెం, నూజివీడు నియోజకవర్గాల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి  పర్యటనలో జనం పోటెత్తారు. కీలకమైన నియోజకవర్గాలయిన చింతలపూడి, కొవ్వూరు నియోకవర్గాలకు ఇన్చార్జిల సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ, బాబు సభలు-రోడ్‌షోలకు మాత్రం అనూహ్యమైన స్పందన లభించడం పరిశీలకులను సైతం విస్మయ పరిచింది. నిజానికి ఆ రెండు నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పరిస్థితి సరిగా లేదు. నాయకుల మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనక వస్తున్నా నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జనసమీకరణ ప్రయత్నాలే జరగలేదు.  అయితే  ఎవరూ బాధ్యత తీసుకోకపోయినప్పటికీ, ఆ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలకు జనం వరదగోదారిలా పోటెత్తారు. స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే పార్టీ నేతలతో సమావేశంలో చంద్రబాబు   జనం మనతోనే ఉన్నారు,  కానీ మీరు మాత్రం వాళ్ల మధ్యలో ఉండి పనిచేయడం లేదు. మీకు బాధ్యత లేదు. జనం మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.  కానీ మీరు దానిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. ఇకపై మీరంతా జనంలోనే ఉండండి. మీరెవరూ జనసమీకరణ బాధ్యత తీసుకోకపోయినా, అన్ని వేల మంది వచ్చారంటే మీ వైఫల్యం గురించి ఆలోచించండి’ అని క్లాసు  పీకారు.   వాసాలపాడు క్రాస్‌రోడ్స్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ నేతల సమావేశం, గోపాలపురంలో దొండపూడి, పోలవరంలో జరిగిన చంద్రబాబు రోడ్‌షో, సభలకు జనం పోటెత్తారు. రోడ్లన్నీఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి.  వాస్తవానికి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ కన్నా నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగింది. అయినా  జనం  ఆయన కోసం వేచిచూడటం కనిపించింది.  

ఇటు అలీ అటు పవన్ మధ్యలో...జగన్ ?

రాజకీయాలకు ఉండే ‘పవరే’ అలాంటిది..మంచి మిత్రులనే కాదు, భార్యా భర్తలను, తండ్రీ కొడుకులను, ఆన్పదమ్ములను,అక్క చెల్లెళ్ళను, వారినీ వీరిని అని ఏముంది, చివరకు అవిభక్త కవలలను సైతం  విడదీయగల మహమ్మారి రాజకీయం. సినిమా ఇండస్ట్రీతో ఏ కొంచెం పరిచయం ఉన్న ఎవరికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. అలీ పవన్ ప్రాణమిత్రులు, జిగ్నీ దోస్తులు అన్నా కొలత సరిపోదు. బియాండ్ దట్ అంతకంటే ఎక్కువైనది ఆ ఇద్దరి స్నేహం అంటారు, సినిమా రంగంలోని ఆ ఇద్దరి మిత్రుల మిత్రులు. ‘తొలి ప్రేమ’ మొదలు ‘కాటం రాయుడు’ వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ స్టోరీ డిమాండ్ చేసినా చేయక పోయినా, ‘అలీ’ కి ఓ పాత్ర ఉంటుంది. అదొక, ‘రాజ్యాంగ’ నిబంధన. అందుకే, కథకు అవసరం ఉన్నా లేకున్నా, అలీ కోసం ఓ పాత్రను సృష్టించిన దర్శకులు ఉన్నారు. ఇక్కడ అప్రస్తుతమేమో కానీ, అలాంటి జోడీ ఇంకొకటి కూడా వుంది. దర్శకుడు తివిక్రం శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ, హాస్య నటుడు సునీల్ కు ఒక పాత్ర ఉటుంది. అది కష్టాల్లో ఒకే గదిలో కలిసున్న స్నేహానికి చిహ్నం అంటారు.    కట్ చేస్తే ... ఈ మధ్య కమెడియన్ ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం జరిగింది. ఆ వివాహానికి, మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరయ్యారు. నాగార్జున, అమల జంట వచ్చి అక్షింతలు వేశారు. ఇంకా చాలా మంది సినిమా పెద్దలు, చిన్నలు చాలా మంది పెళ్ళికి వెళ్లి అలీతో సరదాగా, సందడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జంటగా కాదు కదా కనీసం ఒంటరిగా అయినా పెళ్ళికి వెళ్ళలేదు. అదేమిటి, అంత జిగ్నీ దోస్త్ కూతురు పెళ్ళికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్ళలేదు?ఈ ప్రశ్న పెళ్ళికి వెళ్ళిన వారినే కాదు, వెళ్లని వారినీ వెంటాడుతూనే వుంది. సోషల్ మీడియాలో అయితే అందుకే వెళ్ళలేదంటూ ఎన్నో కథలు. ఆ ఇద్దరి మధ్య రాజకీయమే చిచ్చు పెట్టిందని, చాలా చాలా కథలు షికార్లు చేస్తున్నాయి.ఒకరు, అసలు అలీ పిలవనే లేదంటే, ఇంకొందరు, అలీ పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్లలేదని అంటారు. ఏది నిజమో, ఏది రాజకీయమో... ఎవరికీ తెలియక పోవచ్చును.  అయితే,అలీ కొంచెం చాలా నింపాదిగా,పవన్ కళ్యాణ్ రాకపోవడానికి, అందరు అనుకుంటున్నట్లుగా  రాజకీయ విభేదాలు కారణం కాదు అని ఒక వివరణ ఇచ్చారు. చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవ్వడం వలన చేతనే పవన్ కళ్యాణ్ పెళ్లికి హాజరు కాలేకపోయారని, అలీ వివరణ ఇచ్చారు. అలాగే,  ఎప్పుడైనా కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటే చెప్పు.. అప్పుడు వస్తాను అని అన్నారనీ, అన్నారు. అయితే, అయన ఇచ్చిన వివరణ నమ్మేటట్టు లేదని సోషల్ మీడియాలో కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి.  సరే, పెళ్లికి రావడానికి ఫ్లైట్ మిస్ కథ చెప్పారు బాగుది. పోనీ అదే నిజం అనుకున్నా, పెళ్లి తర్వాత గుంటూరులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా.. ఆ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా.. చాలా మంది రాజకీయ ప్రముఖులు హజరయ్యారు,కదా .. మరి రిసెప్షన్ కు అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు?  అంటూ లా పాయింట్స్ లాగే వాళ్ళు లాగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో, పవన్ కళ్యాణ్ ఎందుకని ఆలీ ఆయన్ని పెళ్ళికి మాత్రమే పిలిచి రిసెప్షన్కు పిలవ లేదా? ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో తాను పాల్గొనడం ఎందుకని, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? అంటూ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఆలీ, ఎప్పుడో తీరిగ్గా సమాధానం ఇస్తే, ఇవ్వవచ్చును. ఇవ్వక పోతే ఇవ్వక పోనూవచ్చును. ఇచ్చిన ఐవ్వక పోయిన భేతాళ ప్రశ్న మాత్రం ఎప్పటికీ చెరిగి పోదు. చెట్టెక్కదు. అయితే  అలీ ఇంట పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళ లేదనే చర్చకు చుక్కపెట్టి, అయన చెప్పిందే నిజం అని అనుకున్నా,రాజకీయాలు స్నేహ సంబంధాలనే కాదు,రక్త సంబంధాలను రక్తసిక్తం చేస్తాయి అనేది, నిజం.  అందులోను జగన్ రెడ్డితో వ్యవహారం అంటే ఇక వేరే చెప్పనక్కరలేదు.జగన్ రెడ్డి సొంత బాబాయ్  వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏమి జరుగుతోందో చూస్తున్నాం.  వివేకానంద రెడ్డి కుమార్తె, ఇతర బంధువులు జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల విశ్వాసం లేక కేసు విచారణను, పొరుగు రాష్ట్రానికి బదిలీచేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఈ మధ్యనే  తీర్పు నిచ్చింది.  ఇక ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన సొంత సోదరి  వైఎస్ షర్మిల విషయంలో ఏమి జరుగుతోందో కూడా చూస్తూనే ఉన్నాం.పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి, వేధింపులకు గురిచేస్తున్నా, జగన్ రెడ్డిలో చలనం లేదు. చెల్లినే కాదు, తల్లినీ తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కాలు కదల కుండా కట్టిపడేసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. సో .. ఆలీ చెప్పినా చెప్పక పొయినా, పవన్ – అలీ మధ్య అడ్డుగోడగా నిలిచింది ఎవరో కాదు.రాజకీయమే. అందుకే ..రాక్షసీ నీ పేరు రాజకీయమా ? అన్నారు, హాస్య రచయిత ఆదివిష్ణు. అవును అని చూపించారు హాస్య నటుడు అలీ .. అదీ విషయం.

వరంగల్ టీఆర్ఎస్ లో రోడ్డుకెక్కిన వర్గ విభేదాలు

వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గు మన్నాయి. ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ బాస్కర్ దిష్టి బొమ్మ దగ్ధం వరకూ పరిస్థితి దిగజారింది. పార్టీ ఘనంగా జరుపుకుంటున్న దీక్షా దివస్ ఉత్సవాలలో విభేదాలు భగ్గు మనడంలో తెరాసలో ఐక్యత మేడి పండు చందమేనని బయటపడిపోయింది. విషయం ఏమిటంటే..దీక్షా దివస్ సందర్భంగా    తెరాస వరంగల్ లో చేపట్టిన 11 రోజుల ఉత్సవాలు మూడో రోజునే  రోజే రసాభాసగా మారాయి. దిక్షా దివస్ సందర్భంగా గత నెల 29 నుంచి 11 రోజుల పాటు కార్యక్రమాలను షెడ్యూల్ చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 29న కాళోజీ సెంటర్​ లో దీక్ష దివస్ ప్రారంభించారు, 30న  జయశంకర్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక డిసెంబర్ 1న బైక్ ర్యాలీ నిర్వహించారు.  శుక్రవారం (డిసెంబర్ 2)న వరంగల్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తెరాసలో విభేదాలు భగ్గు మన్నాయి. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి గళం బలంగా లేచింది. ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్లిన మెహరున్నీసా ఫొటోకు  ఆ ఎగ్జిబిషన్ లో  స్థానం కల్పించకపోవడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం రసాభాసగా మారింది. దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ఫొటోలను చింపేసి మొహరున్నీసా ఆందోళనకు దిగారు. నిజమైన ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వకుండా దిక్షాదివస్ నిర్వహించడమేమిటంటూ దాస్యం వినయ్ భాస్కర్ ను నిలదీశారు. ఒక దశలో వినయ్ భాస్కర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కూడా దిగారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడినట్లైంది. తెరాస ముందస్తు ప్రణాళికలు జోరుగా రచిస్తున్న సమయంలో అత్యంత కీలకమైన వరంగల్ లో పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో టీఆర్ఎస్ వర్గాలలో ఆందోళన మొదలైంది. అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైన దిక్షా దివస్ ఉత్సవాల మూడో రోజుకే ఇలా విభేదాలు రచ్చకెక్కి కార్యక్రమం  రచ్చరచ్చగా మారడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ అధినాయకత్వం పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’ చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా విభేదాల కారణంగా తెరాస ప్రతిష్ట మసకబారుతోందని పరిశీలకులు అంటున్నారు. అసలే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో డిఫెన్స్ లో పడిన తెరాస ఇప్పుడు కీలకమైన వరంగల్ జిల్లాలో రచ్చకెక్కిన విభేదాలతో  కొత్త తలనొప్పి మొదలైనట్లేనని అంటున్నారు. ఉద్యమ కారులకు తెరాసలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమ కారులు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి వైదొలుగుతుండటానికి కారణం వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవడమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. దానికి తోడు ఉద్యమ సమయంలో సమైక్య వాదులుగా ముద్ర పడిన పలువురు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉండటాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన వారికి ఇసుమంతైనా గుర్తింపు లేకుండా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ విషయంలో మొహరున్నీసా నిరసన గళమెత్తి వినయ్ బాస్కర్ పై విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా ఉద్యమ కారుల ఫొటో ఎగ్జిబిషన్ లో ఉన్న కొన్ని ఫొటోలను చింపేసి ఆందోళనకు దిగడం పార్టీకి ఒకింత ఇబ్బంది కరమేనని చెప్పక తప్పదు.  ఎన్నికల వేళ రచ్చకెక్కతున్న విభేదాలు పార్టీ నాయకత్వంలో ఆందోళనకు కారణమౌతున్నాయి. 

తెరాస ఆఖరి అస్త్రం.. తెర పైకి సమైక్య వాదం!

ఇటునుంచి కాకపోతే, అటునుంచి నరుక్కు రమ్మన్నారు, పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో చకచకా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తే, అధికార తెరాస నాయకత్వం, కమ్ముకోస్తున్న ‘కారు’ మబ్బుల్లోంచి బయట పడేందుకు,  సమైక్య కుట్రల పేరున సెంటిమెంట్’ను శరణు వేడడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని,రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు వాకిళ్లపై ఐటీదాడులు,ఆ తర్వాత డైరెక్ట్ గా, ఢిల్లీ మద్యం కేసులో, తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు పైకి రావడంతో, తెరాస నాయకత్వానికి  మరోమార్గం లేక  సెంటిమెంట్  గుర్తుకొచ్చింది.  నిజానికి, 2014లో అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఇకపై ఎంత మాత్రం  ఉద్యమ పార్టీ కాదని తేల్చి చెప్పారు. అలాగే  తెరాస ఇక పై ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా రాజకీయాలే చేస్తుందనీ కుండ బద్దలు కొట్టారు. నిజానికి  ప్రభుత్వంలో, తెలంగాణ రాజకీయాల్లో  ఉద్యమ స్పూర్తి కాదు, కనీసం ఉద్యమ వాసనలు అయినా లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారందరినీ సాగనంపారు. వైఎస్సార్, ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ సబితా ఇంద్రా రెడ్డి  సహా తెరాస ఉద్యమ నాయకత్వం ఉద్యమ ద్రోహులుగా ప్రకటించిన  తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి వంటి వారందరికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదేమంటే, ఉద్యమంలో పాల్గొన్నవారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ సెంటిమెంట్ ను ఉద్దేశపూర్వకంగా పలుచన చేశారు.  అయితే ఇప్పుడు  మారిన పరిస్థితులలో  తెరాస నాయకత్వానికి సెంటిమెంటే శ్రీరామ రక్షగా కనిపిస్తోంది. అందుకే, అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను సొంత చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా పరిణామాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, ప్రాంతీయ వాదాన్ని, తెరపైకి తెచ్చే ప్రయత్నం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అరెస్ట్  వెనక ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఉందని  అందుకే కేసీఆర్ కుమార్తె కవిత మొదలు తాజగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వరకు, అనేక మంది మంత్రులు, ఇతర నాయకులు, ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ఆమె పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టి సంవత్సరం పైగా అయిన తర్వాత ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నించడం వెనక  సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వైఎస్ షర్మిల మనసులో ఏముందో ఇందుకోసం ఆమె పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారో ఏమో కానీ, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి  పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ఈ దశలో ఆమె యాత్ర మీద దాడి జరగటం, ఆపై నాటకీయ పరిణామలు నడుమ ఆమెను  అరెస్ట్ చేయడం  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యయాయి.ఇక ఇదే సమయంలో గులాబీ నాయకులు వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని  సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు. అయితే  ఇక్కడ తెరాస అసలు టార్గెట్  షర్మిల కాదని, ప్రధాన లక్ష్యం స్వీయ రక్షణ అయితే బీజేపీకి సమైక్య ముద్ర వేసే ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, తెరాసను, తెరాస నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలను అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు కెసిఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర  తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కెసిఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  నిజానికి, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్’ ఆశించిన విధంగా రక్తి కట్టక పోవడం, అదే సమయంలో సర్దుకుందనుకున్న ఢిల్లీ మద్యం స్కాం లో లో కవిత రోల్ ఒక్కసారిగా దూసుకు రావడం, ఈ అన్నిటినీ మించి కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి మొదలు  మంత్రులు, సామంతులు, ఎంతమంది ఎంతగా గగ్గోలు పెట్టినా  సామాన్య తెలంగాణ ప్రజలు స్పందించక పోవడంతో  తెరాస నాయకత్వం సెంటిమెంట్ అస్త్రాన్ని మరోమారు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే, సమైక్యవాదం మాటున తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరమీదకు తేవడం అయ్యేపని కాదని పరిశీలకులు అంటున్నారు.నిజానికి, సమైక్యవాదానికి బట్టలు తొడిగితే ఎలా ఉంటుందో, అలా ఉండే ఉండవల్లి అరుణ కుమార్ కు పూర్ణ కుంభంతో ప్రగతి భవన్ లోకి  స్వాగతం పలికిన తెలంగాణ నాయకత్వం, ఇప్పడు సమైక్య వాదం, సమైక్య వాదుల కుట్రల గురించి  మాట్లాడితే ప్రజలు నమ్మరని, నవ్వుతారని  పరిశీలకులు అంటున్నారు.

భారత్ జోడో యాత్రలో తారల తళుకు బెళుకులు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. ఇంతవరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా నడిచిన రాహుల్ యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో సాగుతోంది. రేపో మాపో రాజస్థాన్ లో ప్రవేశిస్తుంది. నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు. సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీ లు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. అయితే, ఈ యాత్ర వలన అంతిమంగా ఏమి జరుతుగుంది, ఏమి జరగదు అనేది పక్కన పెడితే, రాహుల్ యాత్ర పాదయాత్రల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అయితే, చెప్ప వచ్చును.  రాహుల్‌ గాంధీ మొదలుపెట్టిన భారత్‌ జోడో యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయినిలో రాహుల్ గాంధీ వెంట స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనండి.. మన దేశం కోసం నిలబడండి అని స్వరా భాస్కర్ పిలుపునిచ్చారు. అంతే కాదు, రాహుల్ గాంధీకి, ఆమె ప్రేమ పూర్వకంగా రోజా పూలిచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు, ఇందుకు సంబందించిన ఫొటోలను కాంగ్రెస్‌  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.  రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూనమ్‌ కౌర్‌, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ కుసాక్‌ కూడా రాహుల్‌కు ట్విటర్‌ వేదికగా మద్దతు ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఇదలా ఉంటే,భారత్ జోడో యాత్రపై, కొందరు సీనియర్ నాయకులు కొంత అసంతృప్తి వ్యక పరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి.ప్రస్తుతం రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండగా.. షెడ్యూల్ కఠినంగా రూపొందించడంపై కమల్ నాథ్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ మిశ్రా అనే పండితుడితో ఆయన మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నం.. ఇక్కడ రెండే నిబంధనలు ఉన్నాయి. ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభించాలి. రోజులో కనీసం 24 కిలోమీటర్లు నడవాలి. అంతే కాకుండా మధ్యప్రదేశ్ లో యాత్రకు రాహుల్ ముందే మూడు కండీషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భీల్ జన్మస్థలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించాలని షరతు పెట్టారు అని కమల్ నాథ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇటీవల పాదయాత్రలో దిగ్విజయ్ సింగ్ జారిపడిన నేపథ్యంలో కమల్ నాథ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.  నిజానికి రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన  జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్లు ప్రయాణించి కశ్మీర్ చేరుకునేలాప్లాన్ చేశారు. ఈ యాత్ర ఇప్పరికే  సగం దూరం దాటేసింది. ఈరోజు (శుక్రవారం) 84వ రోజుకు చేరింది.మరో 1200 కిలోమీటర్లు నడిస్తే, యాత్ర పూర్తవుతుంది.యాత్ర పూర్తవుతుంది కానీ  యాత్ర లక్ష్యం అది భారతీయలను కులాలు, మతాలకు అతీతంగా ఏకం చేయడమే అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే అయినా, 2024 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని మోడీకి సమ ఉజ్జీగా నిలపడమే అయినా నెరవేరుతుందా? ఇప్పడు యాత్రలో పాల్గొంటున్న నాయకులనే కాదు కాంగ్రెస్ నేతలు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

షర్మిల గాయం ఏదీ లేదే.. గాయబ్..పోయిందే!

వైఎస్సార్ టీపీ అధినేత్రి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె పాదయాత్ర పై రాళ్లదాడి, కాన్వాయ్ లోని వామనం దగ్ధం ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఆమె తన గడ్డం, పెదవిపై తగిలిన గాయాలను మీడియాకు చూపించి రాజశేఖరరెడ్డి బిడ్డను, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న మహిళను తెరాస ప్రభుత్వం ఈ విధంగా గాయపరుస్తుందా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది గడిచి రెండు రోజులు అయ్యింది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంపై గాయమే కాదు.. ఆ గాయం తాలూకు మచ్చ కూడా కనిపించలేదు. దీంతో ఆమె నిజంగా గాయపడ్డారా అన్న అనుమానాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. గాయం పేరుతో మీడియా ముందు ఆమె సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విమర్శించారు. అయినా గాయాలు అంత తొందరగా మానిపోయే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా  అని సెటైర్ వేశారు. ఇప్పటికైనా షర్మిల  వ్యక్తిగత విమర్శలు మానుకుని బుద్ధిగా పాదయాత్ర చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

బంగ్లా టూర్ కు పంత్ ఔట్

రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న టీమ్ ఇండియా క్రికెటర్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అవుతాడా? అతడి పేరును సెలక్టర్లు బంగ్లా  టూర్ కు దూరం పెట్టేయాలని డిసైడయ్యారా? అంటే క్రికెట్ నిపుణులు ఔననే అంటున్నారు. అయితే గాయం కారణంగానే పంత్ బంగ్లాటూర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమ్ ఇండియా ఆటగాళ్లు చెబుతున్నారు. పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా అతడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తోందంటున్నారు. అద్భుత మైన టాలెంట్ ఈ యువ క్రికెటర్ సొంతమని చెబుతున్నారు. అందుకే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా పంత్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. అయితే కివీస్ తో రెండు రోజుల కిందట జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్ కేవలం పది పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు. కానీ ఆ తరువాత అతడు స్ట్రెచర్ పై పడుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ గాయపడ్డాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంత్ బంగ్లా టూర్ కు దూరం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.   

కుక్కపై అత్యాచారం..!

కామాతురాణాం.. న భయం.. న లజ్జ అన్నారు. అంటే కామంతో కళ్లు మూసుకు పోయిన వాళ్లకు భయం, సిగ్గు ఉండవని. అయితే ఉచ్ఛం, నీచం కూడా తెలియదని, మనిషికీ, పశువుకీ కూడా తేడా తెలియదనీ  పంజాబ్ లో జరిగిన ఒక సంఘటన రుజువు చేసింది. పక్కింటి వారిపెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన పంజాబ్ లోని శిమ్లాపురిలో జరిగింది. తమ పెంపుడు కుక్కను ఇంటికి కాపలాగా వదిలి ఏదో ఫంక్షన్ ఉంటే ఇంటిల్లి పాదీ బయటకు వెళ్లారు. ఇదే అదునుగా పక్కింటి వ్యక్తి వారింట్లోకి జొరబడి ఆ పెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు. అది కాస్తా బయటకు వచ్చింది. యానిమల్ రైట్స్ గ్రూప్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు. 

కరి లక్ష్మికి కార్డియాక్ అరెస్టు! కడసారి చూపుకోసం పోటెత్తిన భక్త జనం

లక్ష్మి కార్డియాక్ అరెస్టుతో మరణించింది. 27 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించిన లక్ష్మిని కడసారి చూసేందుకు భక్త జన సందోహం తరలి వచ్చింది. తమిళనాడులోని  మనాకుల వినాయకర్ ఆలయంలో లక్ష్మి దశాబ్దాల సేవలతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రురాలైంది. అందరి అభిమానాన్నీ చూరగొంది. అలాంటి లక్ష్మి మార్నింగ్ వాక్ చేస్తూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించిందని తేల్చారు. ఈ వార్త తెలియగానే భక్త జనసందోహం ఆలయానికి వచ్చింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారంతా లక్ష్మి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. ఇంతకీ లక్ష్మి ఎవరు, ఆమె మరణిస్తే భక్తులు కంటతడి పెట్టడమేమిటి అనుకుంటున్నారు. లక్ష్మి ఒక ఏనుగు. గత రెండున్నర దశాబ్దాలుగా వినాయకర్  ఆలయంలో సేవలందిస్తోంది. భక్తులందరికీ ఏనుగు లక్ష్మి ఒక కుటుంబ సభ్యురాలిగా దగ్గరైపోయింది. దాని హుందాతనం, దాని కలివిడి తనం, పిల్లలు పెద్దలూ అన్న తేడా లేకుండా దగ్గరకు వచ్చిన వారందరినీ తొండంతో దీవెనలు అందచేసే మంచితనంతో ఆలాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. దీంతో లక్ష్మి మరణ వార్త భక్తులను కలచి వేసింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారిలో భక్తులూ కాదు.. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

ఉచితానికి ప్రలోభ పడి.. ఎంగిలిప్లేట్లు కడిగి..!

పిలవని పేరంటానికి వెళ్లిన పెద్ద ముత్తయిదువ అగ్రతాంబూలం ఇవ్వాల్సిందేనని గొడవ పెట్టుకుందట.. అయితే వాయినం మాట అటుంచి ఆమెను ‘మర్యాద’గా బయటకు సాగనంపారు. సరిగ్గా అలాంటి మర్యాదే ఓ ఎంబీఏ విద్యార్థికి ఎదురైంది. పేరంటానికి వెళ్లినందుకు కాదు. ఆహ్వానం లేకండా పెళ్లి విందుకు హాజరై సుబ్బరంగా తిన్నందుకు. ప్రస్తతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ విందు భోజన అనంతర మర్యాదకు సంబంధించిన సంఘటన జబల్పూర్ లో జరిగింది. సాధారణంగా ఫంక్షన్ హాళ్లలో జరిగే వివాహ వేడుకలు, రిసెప్షన్లకు ఆహ్వానితులు మాత్రమే హాజరౌతారన్న గ్యారంటీ ఏమీ లేదు. కొందరు పనీ పాటా లేకుండా ఏదో కాలక్షేపం చేసి అల్పాహారం, విందు భోజనం లాగించేద్దాం అనే ఉద్దేశంతో వచ్చే వాళ్లూ ఉంటారు. ముఖ్యంగా  వేరే ఊళ్ల నుంచి చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన వారు.. హాస్టళ్లలో, హోటళ్లలో ఫుడ్ తిని తిని విసిగిపోయి..ఇదుగో ఇలా ఎక్కడైనా వివాహ విందు జరుగుతుంటే ఆహ్వానం లేకపోయినా వెళ్లి విందారగించి, వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేస్తుంటారు. అంతా బాగా జరిగి.. ఎవరూ గుర్తించి అడ్డగించకపోతే ఓకే.. కానీ పెళ్లివారిలో ఎవరికైనా అనుమానం వచ్చి నిలదీసి నిగ్గ దీస్తే మాత్రం కష్టాలే. సరిగ్గా అలాంటి కష్టాలే జబల్పూర్ లో ఓ ఎంబీయే విద్యార్థికి అనుభవంలోకి వచ్చాయి. జబల్పూర్ లో ఓ వివాహ విందుకు ఈ జబల్పూర్ విద్యార్థి ఆహ్వానం లేకపోయినా మాంచి వివాహ భోజనంబు ఆరగించేద్దామని వెళ్లాడు. హాయిగా విందు భోజనం భుజించాడు. ఇక బయటకు వచ్చేద్దామనుకుంటుండగా పెళ్లి వారికి అనుమానం వచ్చింది. అడ్డగించి నిలదీశారు. వాస్తవం తెలుసుకుని మంచి భోజనం చేశారుగా అందుకు తగ్గ పని కూడా చేయడం అంటే మర్యాద చేశారు. ఆ ఎంబీయే విద్యార్థి చేత ఎంగిలి ప్లేట్లు కడిగించారు. అతగాడా పని చేస్తుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ వీడియోయే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దొరికిపోయి జబల్పూర్ పరువు తీశావు సోదరా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా నేను చాలా సార్లు చేశాను, కానీ ఎప్పుడూ దోరకలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొసమెరుపేమిటంటే... దొరికి పోయి ఎంగిలి ప్లేట్లు కడిగిన ఎంబీయే విద్యార్ధి కూడా ఆ వీడియోపై తన కామెంట్ పెట్టాడు. ఉచితంగా ఏదైనా పొందాలనుకోవడం దురాసే కదా.. అందుకే శిక్ష అనుభవించాను అన్నది అతగాడి కామెంట్.  ఉచిత ప్రలోభాలకు లొంగి ఓట్లు గుద్దేసే ప్రజలకు కూడా ఉచితాలకు ఆశపడితే శిక్ష తప్పదన్న జ్ణానోదయం ఎప్పుడౌతుందో కదా.

ముందస్తు ముచ్చట్లు ఎవరి ‘గోల్’వారిదే.. ఎవరి గోల వారిదే!

ముందస్తు ఎన్నికలు డైలీ సీరియల్ లో మరో ఎపిసోడ్ మన ముందుకొచ్చింది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు, మీడియా కథనాలు ఎలా ఉన్నా, అధికార తెరాసలోనూ అదే గందరగోళం, ఒక విధమైన ఊగిసలాట కనిపిస్తోంది. ఎదుకో తెలియదు కానీ తెరాస నాయకులే ముందస్తు ముచ్చట్లు డైలీ సీరియల్ లా సాగదీస్తున్నారు. ఒకరు ఇటు, ఒకరు అటు నిలపడి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. అది కూడా  ఏదో చిన్నాచితక నాయకులు, హాఫ్ టికెట్ గాళ్లు అసలే కాదు.  అలాంటి వారు  ఏదో అన్నారంటే అర్థం చేసుకోవచ్చును. కానీ, పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా, పూటకో మాట, నోటికో మాట అన్నట్లుగా మాట్లాడడంతో రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతోంది. నిజానికి, ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరిగినా  ప్రజలకు ప్రత్యేకించి జరిగే మేళ్ళు  పెద్దగా ఉండవు.  అయినా, ఇప్పడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా  అదే చర్చ. ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా? వస్తే ఎందుకు వస్తాయి, రావంటే ఎందుకు రావు ఇదే చర్చ జరుగుతోంది.  అయితే  రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయ వేడి చల్లారకుండా, ముందస్తు ముచ్చట్లు వదులుతున్నారని అంటున్నారు. ఇతర సమస్యల నుంచి మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, విచారణలలో వెలుగు చూస్తున్న ఇబ్బందికర పరిస్తితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార పార్టీ ముఖ్య నాయకులు  ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నారని పరిశీలకులు విశ్లేస్తిస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం తెరాస కీలక నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, బోయినపల్లి వినోద్ కుమార , సమయం లేదు మిత్రమా... ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు, ఆరేడు నెలల్లోనే నగారా మోగుతుంది, ‘గెట్ రెడీ  అంటూ  క్యాడర్ ను  హెచ్చరించారు. అందుకు ఒక రోజు అటూ ఇటుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెరాస కీలక నేత, ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో మామకు మించిన అల్లుడిగా చెప్పుకునే  మంత్రి హరీష్ రావు, ముందస్తు లేదు వెనకస్తు లేదు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలని తేల్చి చెప్పారు. మరో వంక మీడియా చర్చల్లో పాల్గొనే, తెరాస నాయకులు,ఎమ్మెల్యేలు అటూ ఇటూ కాకుండా, అవునని కాదని రెండు మాటలూ ఒకరే చెపుతున్నారు. అదలా ఉంటే ఇప్పడు తాజాగా  ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ టూ పొజిషన్’లో ఉన్న ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుట్ల తారక రామా రావు, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని ప్రకటించారు. నిజానికి, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. అలాగే ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో ప్రధాన సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని కేటీఆర్ ప్రజలకు మాటిచ్చారు.   అయితే ఫలితాలు వచ్చి 15 రోజులు  కాదు ఇంచు మించుగా నెల రోజులు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మునుగోడులో కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగ లేదు సరికదా ఎన్నికల ప్రకటనకు ముందు హడావిడిగా మొదలు పెట్టిన పనులు కూడా  ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిజానికి, ఎన్నికలకు ముందు అడుక్కో ఎమ్మెల్యే, గజానికో మంత్రి అన్నట్లుగ మునుగోడును చుట్టేసిన తెరాస నాయకులు  ఎవరూ ఈ నెలరోజుల్లో అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. చివరకు గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కనిపిచడం లేదని ప్రజలు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రి కేటీఆర్ మరో నలుగురు మంత్రులు  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మునుగోడు వెళ్లి అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గతంలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్, ఇప్పడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒకేసారి ఆరేడు నెలల్లో పూర్తి చేస్తామని  అలాగే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పనులు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో రాబోయే 10, 12 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని,  ఆలోపే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అంటే, పనులు ప్రాజెక్టుల విషయం ఎలా ఉన్నా ముందస్తుకు వెళ్ళేది లేదని, కేటీఆర్ చెప్పకనే చెప్పారు. అయితే ఇంతటితో ముందస్తు ముచ్చట్లు ఆగుతాయా  అంటే అబ్బే అదేం లేదు. అదదే ఇదిదే... అంతే.. ఎవరి గోల వారిదే ..ఎవరి ‘గోల్’వారిదే.