Read more!

తెలంగాణ తదుపరి డీజీపీ రవిగుప్తా?! సీవీ ఆనంద్ కు నిరాశే!

తెలంగాణ డిజీపీ ఎం. మహేందర్ రెడ్డి సరిగ్గా మరో నెలలో (డిసెంబర్ 31)  పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర తదుపరి డీజీపీ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే అందరూ ఇప్పటి వరకూ ఆటోమేటిగ్గా హైదరరాబాద్ సీసీ సీవీ ఆనంద్ డీజీపీగా ప్రమోట్ అవుతారని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ మొగ్గు మాత్రం ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న రవి గుప్తాపై ఉందని అంటున్నారు.

అందరూ ఊహిస్తున్నట్లుగా సీవీ ఆనంద్ కాకుండా మహేందర్ రెడ్డి సక్ససర్ గా తెలంగాణ డీజీపీ బాధ్యతలు రవిగుప్తా చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  వాస్తవంగా  సీనియారిటీ ప్రకారం ఐపీఎస్ అధికారులు ఉమేష్ షరాఫ్, గోవింద్ సింగ్, అంజనీకుమార్ గుప్త, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ లు డీజీపీ రేసులో ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత ఆధారంగా సీవీ ఆనంద్ కు డీజీపీగా పదోన్నతి దక్కుతుందని అంతా భావిస్తూ ఉన్నారు.

అయితే కేసీఆర్ మాత్రం సీవీ ఆనంద్ విషయంలో ఒకింత అసంతృప్తిగా ఉన్నారనీ, అందుకే ఆయన రవి గుప్తా వైపు మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాలలోనే వినిపిస్తోంది. అందుకే సీవీ ఆనంద్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ నేతృత్వాన్ని సీవీ ఆనంద్ కు అప్పగించి సైడ్ ట్రాక్ చేశారని అంటున్నారు.

అయితే డీజీపీ పదవి రేసులో బలంగా ఉండాలన్న ఉద్దేశంతో సీవీ ఆనంద్ సిట్ దర్యాప్తులో చురుకుగా, దూకుడుగా వ్యవహరిస్తూ మళ్లీ కేసీఆర్ మన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటికే కొత్త డీజీవీ ఎవరన్న విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. ఇప్పటికే సీనియారిటీ ప్రకారం టాప్ లో ఉన్న 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్ వచ్చే ఏడాది జూన్ లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనను డీజీపీగా నియమించే అవకాశాలు లేవు.

ఇక సీనియారిటీ జాబితాలో 1990 బ్యాచ్ కు చెందిన  గోవింద్‌ సింగ్ గత నవంబర్ లోనే పదవీ విరమణ చేయడంతో ఆయన రేసులో లేకుండా పోయారు. ఇక  ఆ బ్యాచ్ కు చెందిన , అంజనీకుమార్, రవిగుప్తాలలో కేసీఆర్ మొగ్గు రవి గుప్తా వైపే ఉందని చెబుతున్నారు.  ఏడాది జూనియర్ అయినా సీవీ ఆనంద్ డీజీపీ రేసులో బలంగా ఉన్నారనీ, ఆయననే కేసీఆర్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనీ ఇటీవలి కాలం వరకూ గట్టిగా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ కు సీవీ ఆనంద్ పై విశ్వాసం తగ్గిపోయిందని అంటున్నారు.

అందుకే ఆయనను కాదని రవి గుప్తా వైపే మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అందుకే సీట్ కు పంపించారని అంటున్నారు. ఇక రాష్ట్ర డీజపీ నియామకానికి సంబంధించి ప్యానల్ జాబితాను వచ్చే నెల 2వ వారంలో యూపీఎస్పీకి పంపే అవకాశం ఉందని అంటున్నారు. ఆ జాబితాలో పంపే పేర్లలో సీఎం మాత్రం రవిగుప్తా వైపే మొగ్గు చూపుతారని అంటారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్యానల్ జాబితా నుంచి యూపీఎస్పీ ముగ్గరు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గిరిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజపీపీగా నియమిస్తుంది.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్ఠం మేరకే రవిగుప్తా ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ తరువాత రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొత్త సంవత్సరం మొదటి తేదీన రవిగుప్తా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ పోస్టు ఆశిస్తున్న సీవీ ఆనంద్ కు ఈ సారి అయితే నిరాశ తప్పదని పోలీసు వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్ర పోలీసు క్యాడర్ లో నంబర్ 2 ర్యాంకుకు ఆయనకు పదోన్నతి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. బహుశా రవి గుప్తా పదవీ విరమణ అనంతరం అప్పటికీ మరో ఏడాదికి పైగా సర్వీసు ఉన్న సీవీ ఆనంద్ కు డీజీపీ అయ్యే అవకావం ఉంటుందని చెబుతున్నారు.