తెలంగాణ ముందస్తు ఎన్నికలపై సుప్రీం ధర్మాసనం కామెంట్స్
posted on Nov 29, 2022 @ 8:53PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్ర శేఖర రావుకు దైవ భక్తి కొంచెం చాలా ఎక్కువ. ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు ఇంకో ముఖ్యమంత్రి, మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండక పోవచ్చు. నిజానికి, ఒకానొక సందర్భంలో, ప్రధాని నరేంద్ర మోడీ కంటే తానే పెద్ద హిందువును అని చెప్పుకునే సందర్భంలో, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.అవును, దైవ భక్తితో పాటు,,జ్యోతిష శాస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొంచెం చాలా ఎక్కువగానే నమ్ముతారు. జాతక చక్రాలు, మంచి చెడు, ముహూర్తాలతో పాటుగా, వాస్తు శాస్త్రాన్ని గట్టిగా విశ్వసిస్తారు. నిజం అవునో కాదో కానీ, వాస్తు దోషం కారణంగానే, ముఖ్యమంత్రి పాత సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి, కొత్త భవనం కట్టిస్తున్నారని అంటారు. అలాగే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం అయినా ముహూర్తం చూసుకునే తీసుకుంటారని, ఏ పని, పథకం ప్రారంభించాలన్నా,ముహూర్తం చూసుకుంటారని అంటారు.
మొన్నటికి మొన్న, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్’గా మారుస్తూ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానంపై, తెరాస అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్, నిముషాలు, ఘడియలు చూసుకుని, అక్టోబర్ 5,విజయ దశమి రోజున మధ్యాన్నం 01.19 నిమిషాలకు సంతకం చేశారు. సరే, అయినా, టీఆర్ఎస్ పేరు మార్పు ఇంతవరకు ముడిపడలేదనుకోండి అది వేరే విషయం.
అదలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా, కేసీఆర్ నమ్మకాలను అంధవిశ్వాసాలంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోడీ, సాధువైన యోగి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్) టెక్నాలజీని నమ్ముతుంటే అంధ విశ్వాసాలను నమ్మేవాళ్లు తెలంగాణను పాలిస్తున్నారని, పరోక్షంగా కేసీఆర్ కు చురకలంటించారు. అలాగే, 21వ శతాబ్దంలోనూ సీఎం అంధ విశ్వాసాలను నమ్ముతున్నారని సటైర్ వేశారు. మూఢనమ్మకాలను విశ్వసించే వ్యక్తులు తెలంగాణకు ఎలాంటి న్యాయమూ చేయలేరన్న మోడీ.. అలాంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని రాజకీయ ముక్తాయింపు (పిలుపు)నిచ్చారు.
సరే, మోడీ అంటే, ఏదో రాజకీయంగా ముఖ్యమంత్రిని దెప్పిపొడిచారని అనుకోవచ్చును కానీ, ఇప్పడు సుప్రీం కోర్టు, ధర్మాసనం కూడా కేసీఆర్ సర్కార్ పై అదే విధమైన కామెంట్స్ చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడిగా ప్రకటించేలా నోటీసులు జారీ చేయాలంటూ.. టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ తరపు న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా.. రాజాసింగ్ పై అనేక క్రిమినల్ కేసులున్నందున ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
రాజాసింగ్ కు ఇంకా ఏడాది కాలం మాత్రమే పదవి గడువు ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారించాలంటే అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రావాలని ధర్మాసనం కామెంట్ చేసింది. అలాగే, 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం గుర్తుచేసింది. ఆఫ్కోర్స్, సుప్రీం కోర్టు ధర్మాసనం, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసిందో ఏమో, కానీ, ముఖ్యమంత్రి మూఢనమ్మకాలను నమ్ముతారని, చెప్పడంతో పాటుగా, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కొంచెం సీరియస్ కామెంట్స్ కూడా జోడించి ఆసక్తి పెంచింది. ముఖ్యంగా, ముందస్తు ఎన్నికలపై వ్యూహాగానాలు వినిపిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన కామెంట్స్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు.