Read more!

ఆస్తుల అటాచ్.. జేసీ ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్

తెలుగుదేశం నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. వాహనాల కుంభకోణం కేసులో ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. జేపీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడివి కలిపి మొత్తం 22.10 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.  

బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  బీఎస్ 3 వాహనాలకు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించి నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. అలాగే అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది.  ఇలా ఉండగా రాజకీయ కక్షతోనే ఈడీ వేధిస్తోందని జేసీ ప్రభాకరరెడ్డి అంటున్నారు.  

ఇంతకీ కేసేమిటంటే. బీఎస్ 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలనుబీఎస్ -4 వాహనాలుగా చూపించి జేసీ ప్రభాకరరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేసింది.  స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ లో రిజిస్రేషన్ చేయించి  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)  పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఆరోపించింది.   దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ జేపీ ప్రభాకరరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది.