Read more!

భారత్ జోడో యాత్రలో రాహుల్ డ్యాన్స్

రాజకీయాలలో కాంగ్రెస్ పతనం, వరుసగా రాష్ట్రాలలో అధికారం కోల్పోతుండటం.. ఇప్పటికే పూర్తయిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తుందో లేదో తెలియని అయోమయం.. అలాగే వచ్చే నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటో తెలియని గందరగోళం.. ఇవేమీ పట్లకుండా తన మానాన తాను భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా నడిచేస్తున్నారు

రాహుల్ గాంధీ. పార్టీ జయాపజయాలతో సంబంధం లేకుండా సాగుతున్న ఆయన యాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నారు. ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. తన యాత్రకు రాజకీయాలతో సంబంధం లేదనీ, దేశంలో ద్వేష పూరిత వాతావరణాన్ని రూపుమాపి.. ఐక్యత సాధించడమే లక్ష్యమని రాహుల్ చెబుతున్నారు. కానీ ఆయన భారత్ జోడో యాత్ర విజయవంతంపైనే కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికిప్పుడు కాకున్నా 2024 సార్వత్రిక ఎన్నికలలో బారత్ జోడో యాత్ర ఫలితం తప్పకుండా కనిపిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర విషయానికి వస్తే ఆయన జనసమూహాలను ఆకర్షిస్తున్నారు. ఇంత కాలం డైనాస్టీ ద్వారా నాయకుడయ్యారన్న ముద్ర నుంచి రాహుల్  క్రమంగా బయట  పడుతున్నారు. ప్రజానాయకుడిగా అవతరిస్తున్నారు.

ప్రజలు పెద్ద ఎత్తున ఆయనతో అడుగుకలుపుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. ఇక తన తీరుతో, వ్యవహార శైలితో రాహుల్ జనంలో మమేకమౌతున్నారు. బుల్లెట్ నడుపుతున్నారు. పరుగులు పెడుతున్నారు.  స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలూ చేస్తున్నారు. ఇలా ఆయన జనాన్ని ఆకర్షిస్తున్నారు.

తాజాగా ఉజ్జయినిలో ఆయన డ్యాన్స్ చేసి జనాలను సమ్మోహనపరిచారు.రాహుల్ తో పాటు  మాజీ ముఖ్యమంత్రులు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా స్కూల్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. రాహుల్ పాదయాత్ర  ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు.