అధికారులపై విమర్శల వెనుక మోహన్ బాబు టార్గెట్ జగనేనా?
posted on Dec 20, 2022 @ 11:18AM
మోహన్ బాబు నటనలోనే కాదు.. వ్యవహార శైలిలోనూ తనదైన విలక్షణత ప్రదర్శిస్తారు. ఆయన ఏం మాట్లాడినా నిర్మొహమాటంగా ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని తన మనసులో మాటను చెప్పకుండా ఉండరు. అయితే ఆ నిర్మొహమాటం తరచుగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. దీంతో మోహన్ బాబును వివాదాలు వెతుక్కుంటూ వస్తాయా? మోహన్ బాబే వాటిని వెతుక్కుంటూ వెళతారా అన్న సంశయం ఆయన అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ తరచూ వ్యక్తం అవుతూ ఉంటుంది.
నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు తన రాజకీయ ప్రస్థానంలో కూడా విజయాల బాటే పట్టారు. తెలుగుదేశం తరఫున ఒక సారి రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత రాజకీయంగా ఏ మంత క్రియాశీలంగా లేరనే చెప్పాలి. తొలుత తెలుగుదేశంలో ఒకింత క్రియాశీలంగా వ్యవహరించినా.. ఆ పార్టీకి దూరమైన తరువాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే వరకూ ఆయన రాజకీయంగా చురుకుగా లేరు. జగన్ అదికారంలోకి వచ్చిన తరువాత ఏదో పదవి రాకపోతుందా అని మూడున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నా.. పదవి కాదు కదా, కనీస గుర్తింపు లేకుండా పోయిందన్న వేదన ఆయనలో గూడుకట్టుకందని అంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ తెలుగు దేశం గూటికి చేరతారన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమైంది.
ఇందుకు తార్కాణంగా వారు ఇటీవల ఒక సందర్బంగా మోహన్ బాబు తెలుగుదేవం అధినేత చంద్రబాబునాయుడిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడాన్ని చెబుతున్నారు. అయితే తన కాలేజీ ఆవరణలో షిరిడీ సాయిబాబా విగ్రహావిష్కరణకు చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లినట్లు చెప్పారు అది వేరే విషయం. అయితే ఆ భేటీ మాత్రం అప్పట్లో సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కూడా పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.
2019 ఎన్నికలకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేశారు. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలా ఆయన జగన్ పార్టీకి దగ్గరయ్యారు. చివరికి ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత పార్టీలో ఆయనకు వీసమెత్తు గౌరవం కానీ, ప్రాధాన్యత కానీ దక్క లేదు. దీంతో ఆయన కూడా నెమ్మది నెమ్మదిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒక సారి ప్రధాని మోడీతో భేటీ అయినా ఆయన రాజకీయంగా క్రియాశీలంగా మాత్రం లేరు. అయినా ఆయనలో తాను వైసీపీ కోసం కష్టపడి పని చేసినా.. పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తనను నిర్లక్ష్యం చేయడం పట్ల మోహన్ బాబులో అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు అంటున్నారు.
ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మోహన్ బాబు చూచాయిగా బయటపెట్టారు కూడా. అప్పట్లో అంటే చంద్రబాబు హయంలో తన విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని రోడ్డెక్కిన మోహన్ బాబు.. ఇప్పుడు అంటే జనగ్ హయాంలో కూడా అదే పరిస్థితి ఉంది ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మోహన్ బాబు తనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించారని, అయితే జగన్ పట్టించుకోకపోవడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారనీ ఆయన సన్నిహితులు చెబుతారు. ఈ నేపథ్యంలోనే చిన్నవో చితకవో అలీ, పోసాని, సింగర్ మంగ్లిలకు పదవులిచ్చిన జగన్ మోహన్ బాబును పూర్తిగా విస్మరించడంతో రగిలిపోతున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన విశాల్ సినిమా లాఠీ ప్రముష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు జగన్ సర్కార్ లక్ష్యంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. నిజమే లాఠీ ప్రమోషన్ కార్యక్రమంలో మోహన్ బాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో చేసిన వ్యాఖ్యల టార్గెట్ జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కార్యక్రమంలో తనకు పోలీసు అధికారులంటే గౌరవం అని చెబుతూనే వారు అధికారంలో ఉన్న వారి కోసమే పని చేస్తారని, సామాన్యుల గురించి పట్టించుకోరనీ అన్నారు.
ఈ సందర్భంగా కూడా ఆయన తాను చేసిన వ్యాఖ్యలను నిర్మొహమాటం మాటున కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థపై విమర్శలు చేయడమంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే. తిరుపతిలో మోహన్ బాబు అదే చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనీ, అధికారులకు కొమ్ముకాయడమే పోలీసులు డ్యూటీగా భావిస్తున్నారనీ చెప్పకనే చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.