ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన
posted on Dec 19, 2022 @ 1:24PM
అదో వంతెన.. పూర్తయ్యి ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి నోచుకోకపోవడానికి కారణం తెలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్దమౌతుంది. బీహార్ లో సీఎం నాబార్డ్ పథకం కింద నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన పర్తై ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు.
ప్రారంభం కాకుండానే కుప్పకూలిపోయింది. ఇంతకీ బగుసరాయ్ లోని గండక్ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ఎందుకు నోచుకోలేదంటే.. ఆ వంతెనకు అప్రోచ్ రోడ్డు లేకపోవడమే. నాడా దొరికిందని గుర్రం కోసం వెతికిన చందంగా నిధులు మంజూరయ్యాయనీ వంతెన నిర్మించేశారు. అప్రోచ్ రోడ్డు కు మాత్రం ఐదేళ్లుగా మోక్షం కలగలేదు.
ఈ వంతెనే ఆదివారం కుప్పకూలింది. వంతెన ముందు భాగం కూలి నదిలో పడింది. ఇంతకీ కూలిపోవడానికి కారణమేమిటంటే.. అప్రోచ్ రోడ్ లేకపోవడంతో వంతెన ప్రారంభం కాలేదు కానీ, భారీ వాహనాలు, ట్రాక్టర్లు ఈ వంతనపై యథేచ్ఛగా రాకపోకలు సాగించాయి. దీంతో పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. దీంతో వంతెన కూలిపోయింది.