చైనాలో కరోనా టెర్రర్
posted on Dec 19, 2022 @ 12:19PM
కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలకు వర్క్ ఫ్రం హోం నేర్పింది. ఇప్పుడు అలసి పోయి తాను ఇంటి నుంచి పని చేస్తోంది అంటూ సామాజిక మాధ్యమంలో జోకులు పేలుతున్నాయి. అయితే చైనాలో పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు వణికించేసింది. ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారిని వదిలించుకుని యథాపూర్వస్థితికి చేరుకుంటోంది. అయితే కరోనా పుట్టిన దేశం చైనా మాత్రం మహమ్మారి గుప్పిట్లో విలవిలలాడుతోంది. ప్రపంచంలో కరోనా తొలి, మలి దశలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో.. ఇప్పుడు చైనాలో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. స్మశానాలు కరోనా మృతులతో నిండిపోతున్నాయి. అంతిమ సంస్కారాని నోచుకోక వందల సంఖ్యలో మృతదేహాలు స్మశానం బయట పడి ఉంటున్నాయి. ప్రస్తుతం చైనాలో రోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి.
మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. కరోనా నియంత్రణకు ఆ దేశం ఆంక్షలు విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో అనివార్యంగా ఆంక్షలను ఎత్తివేయాల్సి వచ్చింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కరోనా అక్కడ కరాళ నృత్యం చేయడం ప్రారంభించింది. దీంతో ఆంక్షలతో సంబంధం లేకుండా జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమైపోతున్నారు.
ఇందుకు ఆదివారం (డిసెంబర్ 18) దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ నిర్మానుష్యంగా కనిపించడమే తార్కానం. ఇక చైనా బయటకు అయితే వెల్లడించడం లేదు కానీ.. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కర స్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. స్మశాన వాటికల వద్ద కనిపిస్తున్న రద్దీయే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.