రాజ్యసభలో శునకోపాఖ్యానం
posted on Dec 20, 2022 @ 2:53PM
రాజస్థాన్ లో జరుగుతున్న రాహుల్ భారత జోడో యాత్రలో పాల్గొన్న ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభ దద్దరిల్లింది. ఇంతకీ మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో యాత్రలో ఏమన్నారంటే.. భారత దేశం కోసం నిజమైన త్యాగాలు చేసినది కాంగ్రెస్సేననీ, బీజేపీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదనీ అన్నారు. ఈ వ్యాఖ్యలే రాజ్యసభను అట్టుడికించేశాయి.
మల్లికార్జున్ ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఖర్గే నిరాకరించారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ వారిస్తున్నా బీజేపీ సభ్యలు శాంతించలేదు. ఆందోళనకు దిగారు
. సోమవారం(డిసెంబర్ 19) ఖర్గే రాజస్థాన్ లోన అల్వార్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లడారు. పులిలా గర్జిస్తామంటుంది కానీ పిల్లిలా ప్రవర్తిస్తుందంటూ కేంద్ర ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు. సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా.. చేతులు ముడుకుచుని కూర్చుంటుందని దుయ్యబట్టారు. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చకు మాత్రం అంగీకరించదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కాంగ్రెస్ నిలబడిందనీ, ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారనీ ఖర్గే అన్నారు.
అదే సమయంలో బీజేపీ దేశం కోసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలే మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభలో దుమారానికి కారణమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సభలో ఆందోళకు దిగింది. ఖర్గే క్షమాపణకు డిమాండ్ చేసింది. అయితే ఖర్గే క్షమాపణకు ససేమిరా అన్నారు. పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారనీ, బీజేపీలో ఎవరు ప్రాణ త్యాగం చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు.