కేసీఆర్ బీఆర్ఎస్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసిందా?
posted on Dec 19, 2022 @ 9:54AM
తెరాస అధినేత కేసీఆర్ పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేసి భారత చేర్చడం.. తమది ఇక తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదంటూ హస్తిన కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పుతాననడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లైందన్న టాక్ తెలంగాణలో జోరుగా సాగుతోంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్కీచాన్స్ కొట్టేశారంటూ.. తెరాస శ్రేణులు అంటున్నాయి. తెరాస అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి.. దేశ రాజధాని ఢిల్లీలో కారు స్టీరింగ్ తిప్పేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో సైకిల్ పార్టీ మళ్లీ పుంజుకోనేందుకు కేసీఆర్ స్వయంగా బాటలు వేసినట్లు అయిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాదాపు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ .. తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం.. అందులో భాగంగా.. ప్రజల్లో ఆ సెంటిమెంట్ రాజేసి గెలవడంలో వందకి వంద శాతం సఫలమైంది. అందుకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలే ఉదాహరణ అని.. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్‌గా మారడంతో.. తెలంగాణ అనే పదం మాయమైపోయింది.. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నకలలో తెలంగాణ వాదాన్ని ఎత్తుకునే చాన్స్ కేసీఆర్ కోల్పోయారు. కేసీఆర్ అనేమిటి ఆయన కుటుంబం, బీఆర్ఎస్ కు లేకుండా పోయింది. దీంతో తెలంగాణలో మళ్లీ టీడీపీకి పుంజుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.
మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించడంతోపాటు.. రాష్ట్రంలో సైకిల్ సవారీకి అవసరమై వ్యూహాలపై కసరత్తు చేశారు... చేస్తున్నారు. అలాగే గతంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాలపై వీరు దృష్టి సారించారు. ఆ క్రమంలో వివిధ జిల్లాల నేతలతోపాటు కేడర్‌తో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికీ ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పసుపు పార్టీకిఇప్పటికీ బలంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఖమ్మంలో టీ టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో సైతం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి సైకిల్ పార్టీని మరింత బలోపేతం చేస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే కాదు.. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి సైతం టీడీపీ గట్టి కిక్ ఇస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల తర్వాత.. టీ టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా.... తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని.. ఇది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఓ విధంగా లక్కీ ఛాన్సేనని విశ్లేషకులు అంటున్నారు.