కుప్పంలో పోటీకి విశాల్ నో.. జగన్ తో భేటీకి సై..
posted on Dec 20, 2022 @ 10:39AM
తమిళ సూపర్ స్టార్ విశాల్ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ మూలాలున్న విశాల్ తమిళనాట స్థిర పడి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందారు. విశాల్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి విజయవంతమయ్యాయి. దీంతో తెలుగునాట కూడా విశాల్ కు మంచి గుర్తింపు ఉంది. అటువంటి విశాల్ ఏపీలో రాజకీయ ప్రవేశం చేయనున్నారన్న వార్త గత కొంత కాలంగా ఏపీలో హల్ చల్ చేస్తోంది. మామూలుగా ఆయన ఏదో ఒక పార్టీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతారన్న వార్తలైతే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు.. కానీ ఆయన ఏకంగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో పోటీకి నిలబడనున్నారన్న ప్రచారం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కుప్పం టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ఎంతో మందిని అక్కడ నుంచి నిలబెట్టాలని చూశారు. కుప్పం నుంచి కచ్చితంగా గెలిచే అభ్యర్థినే రంగంలోకి దింపాలని భావించిన ఆయనకు పార్టీలో అందుకు సమర్ద నాయకుడెవరూ కనిపించలేదు. దీంతో కుప్పంతో సంబంధాలున్న తమిళనటుడు విశాల్ పై ఆయన దృష్టి పడింది. దీంతో విశాల్ అంగీకారంతో సంబంధం లేకుండానే కుప్పం వైసీపీ అభ్యర్థి విశాల్ అన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో జరిగింది. ఒక దశలో ఇది వాస్తవమే అని అంతా నమ్మే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇందుకు కారణం కుప్పంతో విశాల్ కు ఉన్న అనుబంధం. గతంలో విశాల్ తండ్రి కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో తండ్రికి సహాయంగా విశాల్ కూడా కుప్పంలోనే ఉండేవారు. అందుకే కుప్పంలోని వీధి వీధి విశాల్ కు తెలుసు. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అదీ కాకుండా తమిళనాడుకు సమీపంగా ఉండే చిత్తూరు జిల్లాలో తమిళ సినిమాలకూ, తమిళ నటులకూ మంచి క్రేజ్ ఉంది. అందుకే విశాల్ ఏపీ రాజకీయాలలో కుప్పం నుంచి అడుగుపెడతారన్న ప్రచారానికి ప్రాధాన్యత పెరిగింది. అన్నిటికంటే విశాల్ కుప్పం వ్యవహారానికి రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి కారణం కుప్పం తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం. దీంతో విశాల్ అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం అన్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా విశాల్ తన కొత్త చిత్రం లాఠీ ప్రమోషన్్సలో భాగంగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఆయన కుప్పం పొలిటికల్ ఎంట్రీ వార్తలన్నీ ఒట్టి వదంతులేనని తేల్చేసింది.
తాను ఏపీ రాజకీయాలలో కాలుపెట్టడం లేదని నిర్ద్వంద్వంగా చెప్పేసిన విశాల్.. ఈ సందర్బంగా తనకు ఏపీ సీఎం జగన్ అంటే అభిమానమని కూడా చాటారు. ఆయన మీద అభిమానం ఉన్నంత మాత్రాన ఆయన చెప్పినట్లుగా కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని ఎలా భావిస్తారని ఎదురు ప్రశ్నించారు. కానీ అదే సమయంలో విశాల్ తాను జగన్ తో మంగళవారం బేటీ కానున్నారని చెప్పారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాముఖ్యత ఏదీ లేదని కూడా ఎవరూ అడగకుండానే చెప్పారు. దీంతో ఈ భేటీ ఆంతర్యమేమిటన్న చర్చ సర్వత్రా మొదలైంది. విశాల్ తన స్థాయి ఎమ్మెల్యే కంటే ఎక్కువ అని చెప్పుకున్నారు. గుర్తింపు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ ఎమ్మెల్యే కంటే తన స్థాయి ఎక్కవ అన్నారు విశాల్. రాను రానంటూనే.. విశాల్ జగన్ తో భేటీకి సిద్ధమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వైసీపీ ఎప్పటి నుండో కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఉంది. ఇక్కడ దెబ్బకొట్టి టీడీపీ అధినేత చంద్రబాబును కోలుకోకుండా చేయాలన్నది జగన్ తన లక్ష్యంగా చెబుతూ వస్తున్నారు. అందుకే విశాల్ జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకే సమయంలో విశాల్ రాజకీయాల పట్ల అనాసక్తిని, జగన్ పట్ల అనురక్తినీ ప్రకటించి ఏపీ సీఎంతో భేటీపై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండేంత ఉత్కంఠ రేకెత్తించారు. ఆయన ఎంతగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టే ప్రశ్నే లేదని చెబుతున్నా.. తమిళ ఫిల్మ్ అసోసియేషన్ వ్యవహారాలలో విశాల్ పోషించిన క్రియాశీల పాత్ర ఆయన అడుగులు రాజకీయాలవైపే అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ ఏపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తారా అన్న చర్చ మాత్రం సశేషంగా సాగుతూనే ఉంది. జగన్ తో భేటీ అనంతరం విశాల్ ఏం చెబుతారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది.
సినిమా నటుడిగా విశాల్ కు ఎంత అభిమానం ఉన్నా.. రాజకీయ నాయకుడిగా ఆయనను జనం ఆదరిస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తమౌతోంది. కేవలం సినిమా గుర్తింపుతోనే రాజకీయాలలో రాణించడం ఏమంత సులువు కాదని చిరంజీవి, పవన్ కల్యాణ్ ల విషయంలో ఇప్పటికే రుజువైపోయింది. ఎంతటి ప్రముఖ నటుడైనా విశాల్ నటన, ప్రజాదరణ విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు సాటి రారనడంలో సందేహం లేదు. అయినా వైసీపీ శ్రేణులు అవసరానికి మించి విశాల్ కు హైప్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.