అభ్యర్ధుల ఎంపికే అత్యంత కీలకం!
posted on Apr 11, 2023 @ 12:29PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. నెలరోజుల్లోకి వచ్చేశాయి. వచ్చే నెల 10 వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సగానికి పైగా స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినా, అధికార బీజేపీ మాత్రం ఇంకా తొలి జాబితా అయినా ప్రకటించలేదు. అభ్యర్ధులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆయినా, అభ్యర్ధుల పేర్లను ఇంకా గుట్టుగానే ఉంచారు. అయితే ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మొత్తం జాబితా రెడీ అయిందని, తాను షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ఒకటి రెండు రోజుల్లో మొత్తం జాబితా ఒకేసారి ప్రకటిస్తామని మీడియా ముఖంగా ప్రకటించారు.
అయితే బీజేపీ అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం అయ్యే కొద్దీ ఇటు ఆశావహుల్లో అంతకంటే ఎక్కువగా విపక్షాలలో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే 165 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 60 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవంక కర్ణాటకలో బీజేపీ గుజరాత్ ప్రయోగం చేస్తున్నదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, కొత్త వారికీ పెద్ద పీట వేస్తుందని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు. టికెట్ రాని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకి కాంగ్రెస్ లో చేరకుండా ఉండేందుకే, బీజేపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం చేస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి బొమ్మై కాంగ్రెస్ పార్టీకి 60 నియోజక వర్గాల్లో అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు.
మరో వంక 165 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్రంలోని రెండు ఆధిపత్య కులాలైన లింగాయత్’లకు 30, వొక్కలిగాలకు 24 టిక్కెట్లను కేటాయించింది. అయితే, తమ వర్గానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని కోరుతున్న వీరశైవ-లింగాయత్‌లను శాంతింపజేయడానికి పార్టీ పెద్దలు బుజ్జగింపు ప్రయత్నాల్లో ఉన్నారు.
అదలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘సీటు’ హాట్ సీటుగా మారింది. సిద్దరామయ్యపై పోటీ చేసేందుకు సీనియర్ నేత సోమన్నను బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. వరుణ స్థానం నుంచి ఈ ఇద్దరూ బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమన్న వరుణ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సిద్దరామయ్య కూడా వరుణ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. తనకు మరో స్థానాన్ని కేటాయించాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. వరుణతో పాటు ‘కోలార్’ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనిపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికల్లో ‘ఒకరికి ఒక్క సీటు మాత్రమే’ నిబంధనను పాటిస్తున్న కాంగ్రెస్.. సిద్ధరామయ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 2018 ఎన్నికల్లోనూ ఆయన రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు. మైసూరులోని చాముండేశ్వరి స్థానంలో పరాజయం పాలైన ఆయన బగల్‌కోట్‌లోని బాదామి నుంచి విజయం సాధించారు.
కాగా వరుణ నియోజవర్గంలో దాదాపు 70 వేల మంది ఓటర్లు ఉంటారు. ఇందులో లింగాయత్‌లే సింహభాగం. ఈ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన సోమన్నను అభ్యర్థిగా నిలిపితే.. పార్టీకి మరింత బలం చేకూరడంతోపాటు సులభంగా విజయం సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది. వక్కలిగ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కనకపుర నియోజకవర్గ స్థానంలోనూ బలమైన వ్యక్తిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేస్తున్నారు. కర్ణాటక జనాభాలో దాదాపు 15శాతం ఉన్న వక్కలిగులు... లింగాయత్‌ల (17శాతం) తర్వాత రెండో అతిపెద్ద సామాజిక వర్గం. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 100 చోట్ల లింగాయత్‌ల ప్రాబల్యమే ఎక్కువ. వీటిలో ఎక్కువ సీట్లు ఉత్తర కర్ణాటకలోనే ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 37 మంది బీజేపీ చెందిన వారే ఉన్నారు.
కాగా కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తగ్గేదే లే..అన్నట్లుగా తలపడుతున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపిక విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కుల సమీకరణలో పాటుగా ఇతర సామాజిక, ఆర్థిక సమీకరణల విషయంలోని ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అలాగే, ఈసారి ఎన్నికల్లో కులాల కంటే మత రాజకీయ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర సమస్యలతో పాటుగా జాతీయ రాజకీయాలు, జాతీయ సమస్యల ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని న్తున్నారు. అందుకే అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. ప్రజల నాడిని పట్టుకోలేక పోతున్నారని అంటున్నారు.