మోడీజీ.. ఏమయ్యింది? క్యాడర్ కు ఉత్సాహం ఇవ్వని ప్రసంగం ఏంటి?
posted on Apr 10, 2023 @ 12:18PM
తెలంగాణలో రాజకీయ వేడి రోహిణీకార్తెను మించిపోయింది. టీఎస్పీఎస్సీ, టెన్త్ పరీక్షల లీకేజీ లు కేంద్రంగా రాష్ట్రంలో సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అరెస్టుల పర్వం అదనం. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఉష్ణోగ్రత పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో మొన్నశనివారం (ఏప్రిల్ 8)న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను చీల్చి చెండాడేస్తారనిఅందరూ భావించారు.
మోడీ హైదరాబాద్ వచ్చినది అధికారిక పర్యటనలోనేఅయినా.. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో మోడీ బీఆర్ఎస్ పై మాటల తూటాలు ఎక్కుపెడతారనే అంతా భావించారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ శ్రేణులు మోడీ ప్రసంగంపై అంచనాలను రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి అమాంతంగా పెంచేసింది. సీఎం కేసీఆర్ పాలనపై మోదీ విమర్శనాస్త్రాలు సంధిస్తారనీ, ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును ఉద్దేశించి పరేడ్ గ్రౌండ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారనీ కమలంశ్రేణులు భావించాయి. అయితే ప్రధాని మోడీ ప్రసంగం వారిఅంచనాలకు ఏ మాత్రం చేరువగా లేదు. మోడీ సభ కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు భారీగా జనాన్ని సమీకరించారు. తన సభకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసి మోడీ మురిసిపోయారు. అయితే మోడీ అయితే మురిసిపోయారు
కానీ బీజేపీ శ్రేణులు మాత్రం మోడీ ప్రసంగంతో చాలా చాలా నిరాశ చెందారు. మోడీ ప్రసంగం లో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకపోవడం వారిని నిరాశపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. మోడీ ప్రసంగం యావత్తూ పరోక్ష విమర్శలకే పరిమితమైంది. అంతే కాకుండా ఆయన ప్రసంగంలో కార్యకర్తల్లో ఉత్సాహాన్నినింపే అంశం ఒక్కటీ లేదు అన్నిటికీ మించి టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టై బెయిలు మీద బయటకు వచ్చిన బండి సంజయ్ ఉదంతంపై ఆయన మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం పార్టీ శ్రేణులలో నిరాశకు కారణమైంది.
మోడీ బండి సంజయ్ అరెస్టు వ్యవహారాన్ని కనీసం పరోక్షంగా కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం నివ్వెరపరిచింది. ఇక సామాన్య జనం అయితే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉందా? అందుకే మోడీ ఆ విషయాన్ని తన ప్రసంగంలో అవాయిడ్ చేశారా అన్నఅనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా మోడీ తన పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో కూడా భేటీ కాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.