బీజేపీ ప్రాపకం కోసమేనా ఈ పిల్లిమొగ్గలు..?
posted on Apr 11, 2023 @ 12:09PM
పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు తమ డిగ్రీ పత్రాలను చూపించాలని కొందరు నేతలు ప్రశ్నించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా మండిపడుతున్నారు. నాయకులు చదువుకున్న కళాశాల ఏది? వారి డిగ్రీ అర్హత ఏంటీ? అనే ప్రశ్నలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ఇవి అసలు రాజకీయ అంశాలేనా? " అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందనీ.. వాటిపై దృష్టి పెట్టకుండా నాయకుల విద్యార్హత వంటి అనవసర అంశాన్ని లేవనెత్తటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, శాంతి భద్రతలు, ద్రవ్యోల్బణం వంటి తీవ్ర అంశాలపై కాకుండా ఇలాంటి వాటిని సమస్యలుగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కులం, మతం అంటూ ప్రజల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి, ఉద్యో గాలు లేక ఎంతోమంది యువత ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఇలాంటి వాటిపై కేంద్రాన్ని నిలదీ యండి అని హితవు పలికారు.
అదానీపై హిడెన్ బర్గ్ సమర్పించిన నివేదిను తప్పు పట్టిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. నేడు మోడీ విద్యార్హత, సర్టిఫికేట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిపై మండిపడటం వెనుక మతలబు ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. శరద్ పవార్ ఈ విన్యాసాలన్నీ బీజేపీ ప్రాపకం కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే బీజేపీతో కుమ్మకై.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి అధికారానికి దూరమైన పవార్ ధోరణిలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందనీ.. ఇదంతా దేని కోసమో అర్ధమౌతోనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అటు మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలన్నీ అధికారం చుట్టూనే తిరుగుతున్నాయనడానికి శరద్ పవార్ వ్యవహారం తాజా ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.