ఈ ఏడు వర్షాభావమే.. వ్యవసాయం కష్టమే.. ఎల్ నినో ఎఫెక్ట్ అన్న స్కైమెట్!
posted on Apr 10, 2023 @ 3:07PM
ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ ఈ ఏడు వర్షపాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ ఏడాది అన్న దాతలకు కష్టకాలమే అని పేర్కొంది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ కాలానికి వర్షాలు సగటు 94 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్కైమెట్ అంచనా మేరకు ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదౌతుంది.
అనుకూల ప్రభావంతో గత కొన్ని సంవత్సరాలుగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. అయితే ఈ ఏడాది ఆ అనుకూల ప్రభావం పోయి ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉణ్నాయని పేర్కొంది. ఉత్తర భారత్, మధ్య భారత్ లోని ప్రాంతాలు ఎక్కువ వర్షాభావాన్ని ఎదుర్కొంటాయని స్కైమెట్ చెబుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జులై, ఆగస్ట్ లో సరైన వర్షపాతం ఉండకపోవచ్చని పేర్కొంది.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఎల్ నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించినవి. వాటి ఆధారంగానే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. భారత వాతావరణ విభాగం ఇంకా ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి అధికారిక అంచనాలను ప్రకటించలేదు. ప్రస్తుత వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని మాత్రమే ప్రకటించింది.