వేసవి హీట్ ను మించి ఏపీలో పొలిటికల్ హీట్
posted on Apr 11, 2023 @ 11:58AM
వేసవి హీట్ ను మించి ఏపీలో రాజకీయ హీట్ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ పార్టీలు ఇప్పటి నుంచే విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులోభాగంగా రాష్ట్రంలో స్టిక్కర్ వార్.. జరుగుతోంది. ఇక విమర్శలు.. ప్రతివిమర్శల జోరు సరేసరి. తాజాగా అధికార జగన్ పార్టీ.. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ఇంటింటికీ స్టిక్కర్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ప్రజల్లోకి వెళ్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ.. తన దైన శైలిలో ఈ కార్యక్రమంపై వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. మా దరిద్రం నువ్వే జగనన్న అంటూ పంచ్ డైలాగ్‌లు పేలుస్తోంది. అలాగే మీ బిడ్డను ఆశీర్వదించండి.. మీ బిడ్డకు అండగా నిలవండంటూ సీఎం జగన్.. వివిధ వేదికలు, బహిరంగ సభలపై నుంచి ఇస్తున్న పిలుపునకు సైతం... మీ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటూ తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.
మరోవైపు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంపై జనసేన సైతం స్పందించింది. సంచులేసుకొని, స్టిక్కర్లు అతికించుకొంటూ.. మీ నినాదాలే మీరు చేసుకుంటే వచ్చేది.. నమ్మకం ఎలా అవుతుంది స్టిక్కర్ సీఎం అంటూ ట్విట్ చేసింది. అలాగే మాకు నమ్మకం లేదు జగన్.. మాకు నమ్మకం పవన్ అనే స్టిక్కర్లు తిరుపతిలో దర్శనమిస్తున్నాయి. జగన్ పార్టీ స్టిక్కర్ల పక్కనే ఈ స్టిక్కర్లను జనసేన పార్టీ శ్రేణులు అంటిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు సభలకు ప్రతిగా సభలు... ర్యాలీలకు పోటీగా ర్యాలీలు... దాడులకు పోటీగా ప్రతి దాడులు... విమర్శలకు దీటుగా ప్రతి విమర్శలకు తోడు ఇప్పుడు ఈ స్టిక్కరింగ్ వార్ ఆ జాబితాలో చేరిందని చెప్పవచ్చు.
జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అవుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివరిలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న చర్చ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకొంది. అదీ కాక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఎన్నికలకు అట్టే సమయం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్.. ఫిబ్రవరి 7వ తేదీన నువ్వే మా భవిష్యత్త జగనన్న అంటూ స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఆ క్రమంలో 1.60 కోట్ల కుటుంబాలను వీరంతా సందర్శించి.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాల గురించే కాకుండా.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడమే కాకుండా.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పలాల గురించి కూడా వారికి వివరిస్తున్నారు.
ఆ క్రమంలో 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ సైతం ఇస్తారు. దీంతో ఈ కుటుంబం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉందని ఆ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వస్తుందని తెలుస్తోంది. అయితే మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు గుప్పించడంపై సోషల్ మీడియాలో ఈ స్టిక్కరింగ్ వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది.