విడదల రజనీ వర్సెస్ నందమూరి సుహాసిని@ చిలకలూరిపేట?
posted on Apr 10, 2023 @ 2:55PM
చిలకలూరిపేటలో రాజకీయం అంటే.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విడదల రజినీనే చేయాలి అనే ఓ టాక్ అయితే సదరు నియోజకవర్గంలో తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్... ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడదల రజినీకి లైన్ క్లియర్ అయిందనే ఓ చర్చ స్థానికంగా జోరందుకుంది.
ఈ నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం గట్టిగానే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో ప్రముఖ నటుడు,తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేర్వేరుగా సమావేశమై.. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఓకే చేయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతోన్న పత్తిపాటి పుల్లారావుకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు పంపిస్తామనే స్పష్టమైన హామీని ఈ సందర్భంగా బాలయ్య ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.
చిలకలూరిపేటలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అభ్యర్థి విజయంలో వీరి పాత్ర అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను పరిశీలిస్తే ఇట్టే అర్దమవుతుంది. అయితే గత ఎన్నికల వేళ జగన్ పార్టీ వ్యూహాం మార్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి.. తన కేబినెట్‌లోకి తీసుకుంటానని ఆ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించడం ద్వారా... అంతకు కొద్ది రోజుల ముందే పార్టీలోకి వచ్చిన విడదల రజినీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలా ఆమె విజయం కోసం మర్రి రాజశేఖర్... పని చేయక తప్పలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అదీకాక విడదల రజినీ బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు.. జగన్ వేవ్ కూడా ఆమె విజయానికి కలిసి వచ్చిందనే చెప్పాలి.
కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపైనే కాదు.. ఎమ్మెల్యే విడదల రజినీపైన కూడా నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. అలాగే ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు సైతం అధికంగా ఉన్నాయి. వీరి ఓట్లు సైతం అభ్యర్థి గెలుపులో కీలకంగా మారనున్నాయి. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో జగన్ సర్కారు లోపాయికారి ఒప్పందం చేసుకుందనే భావనలో మైనార్టీ వర్గం బలంగా విశ్వసిస్తోంది. అలాంటి వేళ నందమూరి సుహాసినిని చిలకలూరిపేట నుంచి రంగంలోకి దింపితే.. రజినీకి ఎదురీత తప్పదన్న చర్చ చిలకలూరిపేటలో హల్‌చల్ చేస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి రామకృష్ణ, నందమూరి చైతన్య కృష్ణా, జూనియర్ ఎన్టీఆర్‌లు రంగంలోకి దిగననున్నారనే టాక్ సైతం స్థానికంగా సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది.