టార్గెట్ మోడీ.. వేదిక అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ.. కేసీఆర్ వ్యూహం!
posted on Apr 10, 2023 @ 2:07PM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ పాలన, అవినీతిపై పరోక్షంగా చేసిన విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేరుగా పేరు పెట్టి విమర్శించకుండా మోడీ పరోక్ష వ్యాఖ్యలకే సరిపెట్టేయడంతో కేసీఆర్ స్పందించలేదని కొందరు అంటుంటే.. మోడీపై పకడ్బందీ విమర్శలతో విరుచుకుపడేందుకు కేసీఆర్ సమాయత్తమౌతున్నారని మరి కొందరు అంటున్నారు. మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఘాటు రిప్లై ఇచ్చేందుకు తగిన అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ సభేనని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేసీఆర్ మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోడీ ప్రస్తావించిన అన్ని అంశాలకూ ఘాటుగా రిప్లై ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 14న ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్న ఆసక్తి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఓ వైపు అంబేడ్కర్ ను కీర్తిస్తూనే.. మరోవైపు రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ మోడీకి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర విధానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనడానికి ఉన్న ఉదాహరణలతో సహా మోడీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా కేంద్రం, మోడీపై విమర్శలతో విరుచుకుపడే అవకాశాలు దండిగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణలతో సహా వివరించడానికి కసరత్తు మొదలైంది. అంబేడ్కర్ ను నిరంతరం తల్చుకునే విధంగా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టిన సంగతిని చెబుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంటు (సెంట్రల్ విస్టా) భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీ చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని మోడీ లెక్కలోకి తీసుకోలేదన్న సంగతిని బలంగా ఎస్టాబ్లిష్ చేయలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అదే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతందని సోదాహరణంగా వివరించేందుకు కూడా సీఎం కేసీఆర్ సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు.