ముందున్నది.. మండే కాలం
posted on Apr 10, 2023 @ 11:50AM
ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ఉదయం పది కాదు, ఎదిమిది గంటలు దాటిన తర్వాతే గడపదాటి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఎండ భయానికి వణుకుతున్నారు. అయితే వృద్దులు, చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అదలా ఉంటే ఇంతటితో అయిపోలేదు, ముందున్నది మరింత మండే ఎండల కాలమని, భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరించింది. రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని హెచ్చరించింది. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారతదేశంలో ఎండలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతాయని ఇటీవలే ఐఎండీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఎండాకాలంలో తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఎండకు దూరంగా ఉండడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపెడుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే, పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయి. అయితే ఉష్ణోగ్రతలు మరో సారి భగ్గుమనే అవకాశముందని ఐఎండీ చెబుతోంది .అలాగే, ఎండల నడుమ కురిసే అకాల వర్షాల ప్రభావంతో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు అన్నటికంటే ముఖ్యంగా ఎక్కువ మోతాదులో పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మిగతా కాలాలలో తీసుకునే నీటి కంటే ఎండాకాలంలో రెండింతలు అధికంగా నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో అదే పనిగా నీరు తాగడం కూడా మంచిది కాదని, తక్కువ మోతాడులో ఎక్కువ సార్లు నీరు తాగడం ద్వారా దప్పిక దగ్గరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను తీసుకోవడం అవసరమని అంటున్నారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలనీ, విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి.
చర్మం తాజాగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అంటున్నారు. అయితే, ఎండల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈ అన్నిటికంటే కూడా ఎవరి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అంటున్నారు.